'టాయిలెట్' అంటూ కవ్వించాడు!
బెంగళూరు:భారత్ తో పుణెలో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ రెన్ షా టాయిలెట్ బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో భోజన విరామానికి ముందు అతనికి ఈ విరామం తప్పనిసరైంది. అయితే ఇదే విషయాన్ని రెండో టెస్టులో రెన్ షా కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి గుర్తు చేశాడు. మరోసారి టాయిలెట్ బ్రేక్ తీసుకుంటావా అంటూ స్లెడ్జింగ్ కు దిగాడు. బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆదివారం తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లి 'టాయిలెట్' అంటూ కవ్వించే యత్నం చేశాడని రెన్ షా అన్నాడు. కాగా, వరుస రెండు టెస్టుల్లో ఎంతో పరిణితి కనబరిచి హాఫ్ సెంచరీలు చేసిన రెన్ షా.. తనతో మాటల యుద్ధానికి దిగిన కోహ్లి విషయంలో కూడా కూల్ గానే వ్యవహరించాడు. తనను విరాట్ కవ్వించే యత్నం చేసినప్పటికీ కేవలం నవ్వుతోనే సమాధానం చెప్పానన్నాడు.
'టాయిలెట్ స్లెడ్జింగ్ ను నేను సరదాగా తీసుకున్నా. తొలి టెస్టులో పరుగెత్తుకుంటూ టాయిలెట్ కు వెళ్లిన విషయాన్ని కోహ్లి గుర్తు చేసే యత్నం చేశాడు. మరోసారి టాయిలెట్ బ్రేక్ తీసుకుంటావా అని కోహ్లి అడిగినట్లు నాకు వినబడింది. అప్పుడు స్టేడియంలో చాలా గోలగా ఉంది. దానికి నవ్వుతోనే సమాధానం చెప్పాలనుకున్నా. కొన్ని సందర్భాల్లో మాటల కంటే .. చిన్ననవ్వే ఎక్కువ అవతలి వారిని మరింత రెచ్చగొడుతుంది. నాకు సందర్భోచితంగా వ్యవహరించడం తెలుసు. అందులోనూ స్లెడ్జింగ్ ను నేను కూడా బాగానే తిప్పికొడతా 'అని రెన్ షా తెలిపాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రెన్ షా 60 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.