శ్రేయస్ అయ్యర్
విజయవాడ:న్యూజిలాండ్ 'ఎ'తో మూలపాడులోని ఏసీఏ మైదానంలో జరిగిన తొలి అనధికార టెస్టులో భారత్ 'ఎ' ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మూడో రోజు ఆటలో భాగంగా 64/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 'ఎ' 142 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా భారత్ 'ఎ'కు ఇన్నింగ్స్ విజయం లభించింది.
భారత బౌలర్లలో షాబాజ్ నదీమ్, కరణ్ శర్మ తలో నాలుగు వికెట్లతో చెలరేగగా, శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు భారత ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 320 పరుగులు చేసింది. ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యార్(108;97 బంతుల్లో14 ఫోర్లు 2 సిక్సర్లు), రిషభ్ పంత్ (41 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించగా, సమర్థ్ (54) కూడా అర్ధ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 147 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.