వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 15) జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్‌పై గంభీర్ విశ్లేషణ చేస్తూ ఇలా అన్నాడు.
సెమీఫైనల్లో కచ్చితంగా భారత జట్టే ఫేవరెట్. ఈ టోర్నీలో ప్రత్యర్థుల్ని కంగుతినిపించడమే కాదు... భారత్‌తో ఢీ అంటేనే కష్టం అనిపించేలా మనోళ్లు జైత్రయాత్ర సాగించారు. ముఖ్యంగా ఈ టోర్నీలో భారత బౌలింగ్ నన్ను ఆకట్టుకుంది. బౌలర్లు జట్టు భారాన్ని తమ భుజాలపై మోశారు.
ఈ ప్రపంచకప్ గెలిస్తే మాత్రం దేశంలో బౌలింగ్ విప్లవం ఖాయం. ఇంతవరకు మనలో చాలామంది సచినో, కోహ్లినో కావాలనుకునే క్రికెట్‌లో అడుగుపెట్టేవారు. కానీ ఈ వరల్డ్‌కప్ తర్వాత బౌలర్ల లక్ష్యంతో అకాడమీలు కళకళలాడుతాయంటే ఆశ్చర్యం లేదు.
కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కళ్లప్పగించేలా చేసింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై బాదిన శతకం (102) అయితే హైలైట్ అని చెప్పొచ్చు. చక్కని ఫుట్‌వర్క్, పరిణతితో కూడిన ఫ్లిక్ షాట్స్‌తో ఫోర్లు, సిక్సర్లు అదరగొట్టాడు. మణికట్టు స్ట్రోక్‌ప్లేతో పరుగులు సాధించిన తీరు అద్భుతం. దీంతో రాహుల్‌ను ఇప్పుడు 360 డిగ్రీ ప్లేయర్ అనొచ్చు. 160 స్ట్రయిక్‌రేట్ అతని టాప్‌గేర్‌ను సూచిస్తోంది.
అలాగని శ్రేయస్ అయ్యర్ ఏం తక్కువ కాదు. డచ్‌పై అతని ఆయుధం పుల్ షాట్‌లే. 128 పరుగుల్లో 42 ఆ షాట్లతో వచ్చినవే! అవే అతని సెంచరీని తేలిక చేశాయి. షార్ట్‌పిచ్ బంతులపై అయ్యర్ కనబరిచిన నైపుణ్యం మురిపించింది. ఏ బంతుల్ని ఎలా ఆడాలో... ఏవి వదిలేయాలో వివేకం చూపించాడు.
అయితే కివీస్‌తో జరిగే సెమీస్‌లో మాత్రం అతనికి బౌన్స్, స్వింగ్ పరీక్షలు ఎదురవొచ్చు. తప్పకుండా న్యూజిలాండ్ నుంచి భారత్‌కు సవాల్ ఎదురవుతుంది. ప్రపంచకప్ కోసం బాగా సన్నద్ధమై వచ్చారు. వంద శాతం నిబద్ధతతో మెగా ఈవెంట్ ఆడుతున్నారు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో న్యూజిలాండ్ మోహరింపు కట్టుదిట్టంగా ఉంటోంది.
భారత టాప్–3 కోసం ఇదివరకే కసరత్తు చేసే వుంటారు. ఇందులో ఏ సందేహం లేదు. బౌలింగ్ ఫ్రెండ్లీ వాంఖెడే పిచ్‌పై భారత బ్యాటర్లకు చేజింగ్ కాస్త ఇబ్బందికరంగా మారొచ్చు. అయితే మనవాళ్లు బాగా ఆడితే ఎవరైనా ఏమీ చేయలేరు.
Comments
Please login to add a commentAdd a comment