
వన్డే వరల్డ్‌కప్ 2023 చివరి దశకు చేరుకుంది. సెమీఫైనల్స్, ఫైనల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో విజేత ఎవరో తేలిపోతుంది. ముంబై వేదికగా ఇవాళ (బుధవారం) జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. అండర్ డాగ్స్‌గా పేరున్న న్యూజిలాండ్‌పై ఏమేరకు రాణించగలదో వేచి చూడాలి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే వ్యూహరచనలన్నిటినీ పూర్తి చేసుకున్నాయి. ఇక బరిలోకి దిగడమే తరువాయి. ఈ కీలక సమరానికి ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన వాయిస్‌ను వినిపించాడు. విలియమ్సన్ ఏమన్నాడంటే..
భారత్‌తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్ అనేది వాస్తవం. ఆ టీమ్ చాలా బాగా ఆడుతోంది. అయితే టోర్నీలో ప్రతీ మ్యాచ్ భిన్నమైందే. తమదైన రోజున ఏ జట్టయినా ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. జట్టు బలంతో పాటు అప్పటి పరిస్థితులు, వాటి ప్రభావం కూడా అందుకు కారణమవుతాయి. లీగ్‌లో ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామన్నది ముఖ్యం కాదు. నాకౌట్ దశను మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. వరుసగా గత రెండు వరల్డ్ కప్‌లలో మేం ఫైనల్ చేరినా మమ్మల్ని ఇంకా అండర్‌డాగ్స్‌గానే చూస్తుంటారు.
మేం వీటికి అలవాటుపడిపోయాం కాబట్టి ఇబ్బందేమీ లేదు. మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఇక్కడా గెలవగలం కాబట్టి ఏదైనా జరగొచ్చు. 2019లాగే ఈసారి కూడా మైదానంలో అంతా భారత అభిమానులే ఉంటారు. మాకు మద్దతు పలకకపోయినా ఆ వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది. మా జట్టులో చాలా మందికి ఇది అలవాటే. అయినా భారత గడ్డపై భారత్‌తో సెమీస్‌లో తలపడటమే ఎంతో ప్రత్యేకం.