అజేయ భారత్‌ | India beats South Africa 5-1 | Sakshi
Sakshi News home page

అజేయ భారత్‌

Published Sun, Jun 16 2019 6:14 AM | Last Updated on Sun, Jun 16 2019 6:14 AM

India beats South Africa 5-1 - Sakshi

భువనేశ్వర్‌: సొంతగడ్డపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చలాయించిన భారత పురుషుల హాకీ జట్టు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన ఫైనల్లో మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని టీమిండియా 5–1 గోల్స్‌ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (11వ, 25వ నిమిషాల్లో), వరుణ్‌ కుమార్‌ (2వ, 49వ నిమిషాల్లో) రెండేసి గోల్స్‌ సాధించగా... వివేక్‌ ప్రసాద్‌ (35వ నిమిషంలో) ఒక గోల్‌ చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున రిచర్డ్‌ పౌట్జ్‌ (53వ నిమిషంలో) ఏకైక గోల్‌ సాధించాడు. తుది ఫలితంతో సంబంధం భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో జరిగే టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ 4–2తో అమెరికాను ఓడించింది.  

అదే జోరు...
లీగ్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్‌... సెమీఫైనల్లో ఆసియా క్రీడల చాంపియన్‌ జపాన్‌ను చిత్తుగా ఓడించింది. అదే జోరును ఫైనల్లోనూ కనబరిచింది. ఆట మొదలైన రెండో నిమిషంలోనే వరుణ్‌ కుమార్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ పెనాల్టీ కార్నర్‌ను, పెనాల్టీ స్ట్రోక్‌ను లక్ష్యానికి చేర్చడంతో భారత ఆధిక్యం 3–0కి పెరిగింది. ఆ తర్వాత భారత్‌ అదే దూకుడు కొనసాగించగా... దక్షిణాఫ్రికా డీలా పడింది. ఈ టోర్నమెంట్‌ మొత్తంలో భారత్‌ 35 గోల్స్‌ సాధించి, కేవలం నాలుగు గోల్స్‌ మాత్రమే సమర్పించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement