
అదరగొట్టిన ధోని సేన
హరారే:మూడు టీ 20ల సిరీస్లో భాగంగా సోమవారం ఇక్కడ హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జింబాబ్వేతో జరిగిన రెండో మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ రాణించిన టీమిండియా సునాయాస విజయాన్ని చేజిక్కించుకుంది. తొలి టీ 20లో రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైన ధోని సేన.. ఈ మ్యాచ్లో మాత్రం 10 వికెట్ల తేడాతో గెలిచి అందకు ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. జింబాబ్వే విసిరిన 100 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్లేమీ కోల్పోకుండా 13.1 ఓవర్లలో ఛేదించింది. దీంతో సిరీస్ను 1-1 సమం చేసింది. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్(47 నాటౌట్; 40 బంతుల్లో 2 ఫోర్లు,2 సిక్సర్లు), మన్ దీప్ సింగ్(52 నాటౌట్;40 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించడంతో భారత్ అలవోకగా గెలుపొందింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొమ్మిది వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. జింబాబ్వే ఆది నుంచి భారత బౌలర్ల దెబ్బకు విలవిల్లాడింది. భారత యువ పేసర్ బరిందర్ శ్రవణ్ జింబాబ్వే పతనాన్ని శాసించాడు. శ్రవణ్ నాలుగు ఓవర్లలో 10 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు సాధించాడు.
జింబాబ్వే ఓపెనర్ చిబాబా(10)ను తొలి వికెట్ గా పెవిలియన్ కు పంపిన శ్రవణ్.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ లో మూడు వికెట్లు తీశాడు. మసకద్జా(10), సికిందర్ రాజా(1), ముతోంబోడ్జి(0)లను ఒకే ఓవర్ లో శ్రవణ్ అవుట్ చేశాడు. దీంతో జింబాబ్వే ఐదు ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. కాగా, జింబాబ్వే ఆటగాడు మూర్(31) ఫర్వాలేదనిపించాడు. భారత మిగతా బౌలర్లలో బూమ్రా మూడు వికెట్లు తీయగా, కులకర్ణి, చాహల్లకు తలో వికెట్ దక్కింది.