ఇంగ్లండ్కు సాధారణ లక్ష్యం
నాగ్పూర్: మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో మ్యాచ్లో టీమిండియా 145 పరుగుల సముచిత లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్(71;47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి(21) ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఆదిలో దూకుడుగా కనిపించిన కోహ్లి భారీ షాట్ కు యత్నించి తొలి వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం సురేష్ రైనా(7), యువరాజ్(4)లు తీవ్రంగా నిరాశపరిచారు. వీరిద్దరూ 13 పరుగుల వ్యవధిలో అవుట్ కావడంతో భారత్ తడబడింది. ఆ తరుణంలో రాహుల్ కు జత కలిసిన మనీష్ పాండే ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేశాడు.
ఈ జోడి నాల్గో వికెట్ కు 56 పరుగుల జత చేయడంతో భారత్ తేరుకుంది. ఈ క్రమంలోనే రాహుల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే భారత్ స్కోరు 125 పరుగుల వద్ద రాహుల్ నాల్గో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆపై స్వల్ప వ్యవధిలో మనీష్ పాండే(30;26 బంతుల్లో) ఐదో వికెట్ గా అవుట్ అయ్యాడు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా(2), అమిత్ మిశ్రా(0)లు రనౌట్ లుగా పెవిలియన్ కు చేరగా, మహేంద్ర సింగ్ (5) లు అవుట్ కావడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ మూడు వికెట్లు సాధించగా, మొయిన్ అలీ, రషిద్, మిల్స్ లకు తలో వికెట్ దక్కింది.