ఇంగ్లండ్ కు సాధారణ లక్ష్యం
కాన్పూర్: మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి మ్యాచ్లో భారత్ 148 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆది నుంచి తడబడతూ బ్యాటింగ్ కొనసాగించింది. ఈ మ్యాచ్లో ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి(29)ఫర్వాలేదనిపించగా, మరో్ ఓపెనర్ కేఎల్ రాహుల్(8) నిరాశపరిచాడు. ఆ తరువాత సురేశ్ రైనా(34; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో భారత్ తిరిగి తేరుకుంది.
అయితే యువరాజ్ సింగ్(12) కూడా స్వల్ప వ్యవధిలోనే అవుట్ కావడంతో భారత్ జట్టు 75 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది. కాగా, ఎంఎస్ ధోని (36 నాటౌట్;26 బంతుల్లో 3 ఫోర్లు) ఆకట్టుకోవడంతో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ రెండు వికెట్లు సాధించగా, మిల్స్, జోర్డాన్, ప్లంకెట్, స్టోక్స్లకు తలో వికెట్ దక్కింది.