87 కొట్టు... ట్రోఫీ పట్టు... | India Inch Closer To Series Win After Australia Collapse In Dharamsala | Sakshi
Sakshi News home page

87 కొట్టు... ట్రోఫీ పట్టు...

Published Tue, Mar 28 2017 1:00 AM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

87 కొట్టు... ట్రోఫీ పట్టు...

87 కొట్టు... ట్రోఫీ పట్టు...

విజయం దిశగా భారత్‌
చెలరేగిన బౌలర్లు
జడేజా ఆల్‌రౌండ్‌ షో
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ 137
భారత్‌ లక్ష్యం 106 ∙ప్రస్తుతం 19/0


నిర్ణయాత్మక చివరి టెస్టులో ఆధిక్యం దక్కేదెవరికి? చేతిలో నాలుగు వికెట్లున్న దశలో కనీసం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరునైనా అందుకోగలదా? రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు పరిస్థితిపై అంచనాలివి. అయితే మూడో రోజు సోమవారం భారత్‌ దుమ్ము రేపే ప్రదర్శనతో హల్‌చల్‌ చేసింది. ఆట ముగిసే సమయానికి మ్యాచ్‌నే తమ చేతుల్లోకి తెచ్చుకుంది. కట్‌ చేస్తే... తమ రెండో ఇన్నింగ్స్‌లో మరో 87 పరుగులు చేస్తే చాలు.. మ్యాచ్‌తో పాటు బోర్డర్‌ – గావస్కర్‌ ట్రోఫీని సగర్వంగా అందుకుంటుంది.

అత్యంత కీలకంగా మారిన తొలి సెషన్‌లో రవీంద్ర జడేజా తన అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. ప్రత్యర్థి స్లెడ్జింగ్‌తో ఎంతగా రెచ్చగొడుతున్నా సహనం కోల్పోకుండా కీపర్‌ సాహాతో కలిసి అత్యంత విలువైన భాగస్వామ్యంతో జట్టును నిలబెట్టాడు. ఏడో వికెట్‌కు వీరి మధ్య 96 పరుగులు జత చేరడంతో భారత్‌కు 32 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కింది.

ఆ తర్వాత భారత బౌలర్ల విజృంభణకు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో విలవిల్లాడింది.. పేసర్లు ఉమేశ్, భువనేశ్వర్‌ పదునైన బౌన్సర్లతో బెంబేలెత్తించగా అటు స్పిన్నర్లు కూడా ఉచ్చు బిగించడంతో పర్యాటక జట్టు పరుగులు తీయలేక 137 పరుగులకే తోక ముడిచింది. దీంతో భారత్‌కు 106 పరుగుల స్వల్ప లక్ష్యం ఎదురవగా ప్రస్తుతం వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. అయితే బౌలర్లు రాజ్యమేలుతున్న ఈ పిచ్‌పై నాలుగో రోజు తొలి సెషన్‌ కీలకం కానుంది. లక్ష్యం తక్కువే కదా.. అని ఏమరుపాటు చూపకుండా జాగ్రత్తగా ఆడితే భారత్‌ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు..  

ధర్మశాల: మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో కోల్పోయిన బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీని భారత్‌ తిరిగి కైవసం చేసుకోవడం ఖాయమైంది. అద్భుతంగా సాగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌ను దక్కించుకోవడానికి భారత జట్టు ఇంకా 87 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం మిగిలి ఉండటంతో భారత్‌ ఘనవిజయాన్ని ఆపడం దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. మూడో రోజు సోమవారం రవీంద్ర జడేజా (95 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), వృద్ధిమాన్‌ సాహా (102 బంతుల్లో 31; 2 ఫోర్లు) కీలక ఆటతీరుతో చెలరేగారు. దీంతో భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 118.1 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్‌ కాగా 32 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. లయన్‌కు ఐదు, కమిన్స్‌కు మూడు వికెట్లు దక్కాయి.

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌పై భారత బౌలర్లు మూకుమ్మడి దాడికి దిగారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో కోలుకోలేకపోయింది. ఫలితంగా 53.5 ఓవర్లలో 137 పరుగులకు కుప్పకూలింది. మ్యాక్స్‌వెల్‌ (60 బంతుల్లో 45; 6 ఫోర్లు; 1 సిక్స్‌) ఒక్కడే రాణించాడు. ఉమేశ్, జడేజా, అశ్విన్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. భువనేశ్వర్‌ కీలక స్మిత్‌ వికెట్‌ పడగొట్టాడు. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా ఆరు ఓవర్లలో 19 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు రాహుల్‌ (18 బంతుల్లో 13 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), మురళీ విజయ్‌ (18 బంతుల్లో 6 బ్యాటింగ్‌) ఉన్నారు.

సెషన్‌ 1   జడేజా, సాహా నిలకడ
సెషన్‌లో తొలి బంతికే జడేజాను అంపైర్‌ క్యాచ్‌ అవుట్‌గా ప్రకటించగా అతను రివ్యూకు వెళ్లాడు. ఇందులో కమిన్స్‌ వేసిన బంతి బ్యాట్‌ను తాకకుండా కీపర్‌ చేతుల్లోకి వెళ్లినట్టు తేలింది. మూడో బంతికే ఎల్బీ అప్పీల్‌ చేసినా ఈసారి అంపైర్‌ తిరస్కరించాడు. ఆ తర్వాత తన మరుసటి ఓవర్‌లో బౌండరీ బాదిన జడేజా లయన్‌ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో జోరును చూపాడు. అటు సాహా కూడా వీలైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ సహకారం అందించాడు. 107వ ఓవర్‌లో సాహా అవుట్‌ కోసం ఆసీస్‌ రివ్యూకెళ్లినా నిరాశే ఎదురైంది. ఆ మరుసటి ఓవర్‌లోనే జడేజా 83 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. అదే ఓవర్‌లో భారత్‌ కూడా ఆధిక్యంలోకి వెళ్లింది. 111వ ఓవర్‌లో కమిన్స్‌ బౌలింగ్‌లో వరుసగా జడేజా ఫోర్, సిక్సర్‌ బాదాడు. అయితే అతడి మరుసటి ఓవర్‌లోనే జడేజా అద్భుత ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్‌ పూర్తిగా తడబడింది. ఆరు ఓవర్లలో మిగతా మూడు వికెట్లు కోల్పోయింది.     
ఓవర్లు: 27.1, పరుగులు: 84, వికెట్లు: 4

సెషన్‌ 2   వికెట్లు టపటపా
ఆరంభ ఓవర్లలోనే ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను భారత పేసర్లు ఉమేశ్, భువనేశ్వర్‌ తమ బౌన్స్‌తో వణికించారు. మూడో ఓవర్‌లో భువీ బౌలింగ్‌లో వార్నర్‌ (6) ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో కరుణ్‌ నాయర్‌ వదిలేశాడు. కానీ మరుసటి ఓవర్‌లోనే ఉమేశ్‌ బౌలింగ్‌లో కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి అతను అవుటయ్యాడు. ఇక తొమ్మిదో ఓవర్‌లో ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భువీ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన స్మిత్‌ (15 బంతుల్లో 17; 3 ఫోర్లు) మూడో బంతికి నిర్లక్ష్యపు షాట్‌కు బౌల్డ్‌ అయ్యాడు. తర్వాతి ఓవర్‌లో ఉమేశ్‌.. రెన్‌షా (8) పనిపట్టడంతో 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మ్యాక్స్‌వెల్‌ జట్టును ఆదుకున్నాడు. బౌండరీలతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. హ్యాండ్స్‌కోంబ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. టీ విరామానికి ముందు అశ్విన్‌ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కోంబ్‌ ఇచ్చిన క్యాచ్‌ను రహానే కన్నుమూసి తెరిచే లోపు అద్భుత రీతిలో పట్టుకున్నాడు. షాన్‌ మార్‌‡్షను జడేజా అవుట్‌ చేయడంతో జట్టు టీ విరామానికి వెళ్లింది.
ఓవర్లు: 25.3, పరుగులు: 92, వికెట్లు: 5

సెషన్‌ 3  జడేజా మాయాజాలం
బ్రేక్‌ అనంతరం కూడా ఆసీస్‌ పరిస్థితి ఏమీ మారలేదు. వేడ్‌ ఎల్బీ కోసం భారత్‌ గట్టిగా అప్పీల్‌ చేసి రివ్యూకు వెళ్లినా నాటౌట్‌గా ప్రకటించారు. కొద్దిసేపటికే జోరు మీదున్న మ్యాక్స్‌వెల్‌ను అశ్విన్‌ ఎల్బీగా అవుట్‌ చేశాడు. అయితే మ్యాక్స్‌ రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత వేడ్, కమిన్స్‌ (49 బంతుల్లో 12; 1 ఫోర్‌) జోడి పరుగులు పెద్దగా చేయకపోయినా దాదాపు 15 ఓవర్లు వికెట్‌ కాపాడుకున్నారు. అయితే 48వ ఓవర్‌ నుంచి జడేజా మేజిక్‌ చూపాడు. వరుసగా రెండు ఓవర్లలో కమిన్స్, ఒకీఫ్‌లను పెవిలియన్‌కు పంపించాడు. లయన్‌ను ఉమేశ్‌ అవుట్‌ చేయడంతో ఒక్క పరుగు వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. 53వ ఓవర్‌లో వేడ్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను అశ్విన్‌ అందుకోలేకపోయాడు. అయితే ఆ తర్వాత ఓవర్‌లో తనే ఆసీస్‌ చివరి వికెట్‌ను తీశాడు. అయితే 53.3వ బంతికి హాజల్‌వుడ్‌ ఇచ్చిన క్యాచ్‌ను విజయ్‌ క్యాచ్‌ తీసుకోగా అంపైర్‌.. థర్డ్‌ అంపైర్‌ రివ్యూకు వెళ్లాడు. అప్పటికే విజయ్‌ మైదానం వదిలి వెళ్లాడు. కానీ టీవీ రీప్లేలో బంతి కింద తాకినట్టుగా భావించి నాటౌట్‌గా ప్రకటించారు. దీంతో భారత్‌ కంగుతిన్నా మరో రెండు బంతుల్లోనే అతడిని ఎల్బీగా పెవిలియన్‌కు పంపడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.
ఓవర్లు: 28.2, పరుగులు: 45, వికెట్లు: 5

మరో వివాదంలో స్మిత్‌
బెంగళూరు టెస్టులో డ్రెస్సింగ్‌ రూమ్‌ రివ్యూతో వివాదం సృష్టించిన ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఈసారి బూతు పదాలు వాడి వార్తల్లో నిలిచాడు. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో హాజల్‌వుడ్‌ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న మురళీ విజయ్‌ అందుకున్నాడు. ఇది చివరి వికెట్‌ కావడంతో భారత్‌ సంబరాల్లో మునిగింది. అప్పటికే విజయ్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగేందుకు పెవిలియన్‌కు చేరాడు. అయితే అంపైర్‌ సందేహించి టీవీ రీప్లే కోరగా అక్కడ బంతి ముందుగా నేలను తాకినట్టుగా తేలడంతో నాటౌట్‌గా ప్రకటించారు.

దీంతో అంతా తిరిగి మైదానంలోకి చేరారు. అయితే విజయ్‌ అత్యుత్సాహంగా ముందుగానే పెవిలియన్‌కు చేరడాన్ని స్మిత్‌ సహించలేకపోయాడు. ఓ బూతు పదాన్ని వాడుతూ మోసగాడు అనడం టీవీల్లో కనిపించింది. ఈ వీడియోను ఆసీస్‌ బ్రాడ్‌కాస్టర్‌ అప్‌లోడ్‌ చేసింది. స్మిత్‌ వ్యవహారశైలిపై మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేయాలని భారత బృందం భావిస్తోంది.

6 ఈ సీజన్‌లో జడేజా చేసిన అర్ధ సెంచరీలు. కోహ్లి, విజయ్, రాహుల్‌ కూడా ఆరు చొప్పున చేశారు.
3 ఓ సీజన్‌లో 500కు పైగా పరుగులు, 50కి పైగా వికెట్లు తీసినమూడో ఆల్‌రౌండర్‌గా జడేజా. గతంలో కపిల్‌దేవ్, మిషెల్‌ జాన్సన్‌ మాత్రమే ఇలా చేశారు.
0 జడేజా అర్ధ సెంచరీ చేసిన సందర్భంలో ఏ టెస్టును కూడా భారత్‌ ఓడిపోలేదు. ఈ మ్యాచ్‌కు ముందు తను ఆరుసార్లు చేయగా ఐదుసార్లు నెగ్గి ఓ మ్యాచ్‌ డ్రా అయ్యింది.
2 ముత్తయ్య మురళీధరన్‌ (శ్రీలంక–105 వికెట్లు) తర్వాత భారత్‌పై అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నాథన్‌ లయన్‌ (64 వికెట్లు) గుర్తింపు పొందాడు.
http://img.sakshi.net/images/cms/2017-03/51490643603_Unknown.jpgస్మిత్‌ను బౌల్డ్‌ చేశాక భువనేశ్వర్‌ సంబరం
http://img.sakshi.net/images/cms/2017-03/41490643714_Unknown.jpgఉమేశ్‌ యాదవ్‌కు కెప్టెన్‌ రహానే అభినందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement