
భారత జట్టు ఓడిపోయింది...అవును, నిజమే. వరుసగా తొమ్మిది మ్యాచ్‌లలో గెలిచి ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగుతున్న టీమ్ ఎట్టకేలకు తలవంచింది. ముందుగా బ్యాటింగ్ చేసినా, లక్ష్యాన్ని ఛేదించినా... అలవాటుగా అలవోకగా విజయాలు అందుకున్న కోహ్లి సేన, భారీ లక్ష్యాన్ని వేటాడే క్రమంలో చేరువగా వచ్చి చివరకు ఓటమి పక్షాన నిలిచింది. వరుసగా పదో గెలుపు సాధించి కొత్త చరిత్రను లిఖించాలని భావించిన టీమిండియా ఆ ప్రయత్నంలో విఫలం కాగా... విదేశాల్లో 11 వరుస పరాజయాల తర్వాత ఆస్ట్రేలియాకు బెంగళూరులో విజయంతో ఊరట లభించింది. సిరీస్‌లో తొలి విజయంతో స్మిత్ సేన క్లీన్‌స్వీప్ అవకాశం లేకుండా చేసి పరువు కాపాడుకుంది.
335 పరుగుల పేద్ద లక్ష్యం... చిన్నస్వామిలాంటి చిన్న స్టేడియంలో అసాధ్యం ఏమీ కాదు. అందుకే మన బ్యాట్స్‌మెన్ ఎక్కడా తగ్గలేదు. రోహిత్, రహానే ఇచ్చిన శుభారంభాన్ని ఆ తర్వాత హార్దిక్ పాండ్యా తన దూకుడుతో కొనసాగిస్తే... కేదార్ జాదవ్, మనీశ్ పాండే జంట గెలుపు దిశగా నడిపించింది. అయితే ఆఖర్లో ఆసీస్ పేస్ బౌలర్ల అద్భుత బౌలింగ్ భారత్‌ను కట్టి పడేసింది. చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోయి వికెట్లు కోల్పోవడంతో మనకు మరో విజయం చిక్కలేదు. అంతకు ముందు తన వందో వన్డేలో వార్నర్ మెరుపు సెంచరీకి తోడు ఫించ్ దూకుడైన బ్యాటింగ్ ఆస్ట్రేలియాకు భారీ స్కోరు అందించి మ్యాచ్‌లో విజయంపై ఆశలు రేపేలా చేశాయి.
బెంగళూరు : భారత పర్యటనలో ఆస్ట్రేలియాకు ఎట్టకేలకు విజయం లభించింది. తమ బ్యాటింగ్ బలంపై ఆధార పడుతూ వచ్చిన ఆ జట్టుకు ఈ మ్యాచ్‌లో ప్రధాన పేసర్లు కూడా అండగా నిలవడంతో దాదాపు తొమ్మిది నెలల తర్వాత కంగారూలు గెలుపు బాట పట్టారు. గురువారం ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (119 బంతుల్లో 124; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకం బాదగా, ఆరోన్ ఫించ్ (96 బంతుల్లో 94; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో ఆ అవకాశం కోల్పోయాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 231 పరుగులు జోడించడం విశేషం. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 313 పరుగులు చేసింది. కేదార్ జాదవ్ (69 బంతుల్లో 67; 7 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ శర్మ (55 బంతుల్లో 65; 1 ఫోర్, 5 సిక్సర్లు), అజింక్య రహానే (66 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా... హార్దిక్ పాండ్యా (40 బంతుల్లో 41; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. కేన్ రిచర్డ్సన్ 3 వికెట్లు పడగొట్టాడు. తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 3–1తో ముందంజలో ఉంది. సిరీస్‌లో ఆఖరి వన్డే ఆదివారం నాగపూర్‌లో జరుగుతుంది.
ఓపెనర్ల జోరు...
ఆస్ట్రేలియాకు మరోసారి ఓపెనర్లు ఫించ్, వార్నర్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడుతూ బౌండరీలు సాధించారు. ఫలితంగా పది ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 63 పరుగులకు చేరింది. ఇందులో షమీ, ఉమేశ్ చెరో ఐదు ఓవర్లు వేయగా... మొత్తం 12 బౌండరీలు వచ్చాయి. ఆ తర్వాత అక్షర్, పాండ్యా, చహల్ కూడా ప్రభావం చూపలేకపోవడంతో ఆసీస్ అలవోకగా పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో వార్నర్ 45 బంతుల్లో, ఫించ్ 65 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అంతకుముందు 47 పరుగుల వద్ద ఫించ్‌ను స్టంపౌట్ చేయడంతో ధోని విఫలమయ్యాడు. 30 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 191 పరుగులకు చేరింది. జాదవ్ బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఫోర్ కొట్టిన వార్నర్ వన్డేల్లో 14వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం అక్షర్ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లతో వార్నర్ 16 పరుగులు రాబట్టాడు. ఎట్టకేలకు పార్ట్ టైమర్ జాదవ్ ఈ భారీ భాగస్వామ్యాన్ని విడదీశాడు. జాదవ్ వేసిన 35వ ఓవర్ చివరి బంతికి లాంగాన్‌లో అక్షర్‌కు క్యాచ్ ఇచ్చి వార్నర్ వెనుదిరగడంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కంగారూలను నియంత్రించారు. మరో ఐదు పరుగుల వ్యవధిలో ఫించ్, స్మిత్ (3) కూడా అవుట్ కావడంతో వేగంగా ఆడటంలో ఆసీస్ విఫలమైంది. ఒక దశలో 50 బంతులపాటు ఆ జట్టు బౌండరీ కొట్టలేదు. అయితే చివర్లో టిమ్ హెడ్ (38 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... హ్యాండ్స్‌కోంబ్ (30 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో ఆసీస్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. భారత్ తమ ప్రధాన బౌలర్లు ముగ్గురు భువనేశ్వర్, బుమ్రా, కుల్దీప్‌లకు విశ్రాంతినిచ్చి వారి స్థానంలో షమీ, ఉమేశ్, అక్షర్‌లకు అవకాశం కల్పించింది.
మూడు అర్ధ సెంచరీలు...
గత మ్యాచ్‌లాగే మరోసారి భారత జట్టు ఓపెనర్లు రహానే, రోహిత్ సెంచరీ భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడటంతో తొలి పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 65 పరుగులు సాధించింది. ముందుగా రహానే 58 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, జంపా ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన రోహిత్ 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే రిచర్డ్సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రహానే వెనుదిరగడంతో 106 పరుగుల తొలి వికెట్ పార్ట్‌నర్‌షిప్‌కు తెర పడింది. కొద్ది సేపటికే కోహ్లితో సమన్వయ లోపం, స్మిత్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా రోహిత్ రనౌటయ్యాడు. ఆ వెంటనే కూల్టర్‌నీల్ బౌలింగ్‌లో కట్ చేయబోయి వికెట్లపైకి ఆడుకోవడంతో కోహ్లి (21) ఆట ముగిసింది. ఈ దశలో పాండ్యా, జాదవ్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు ఒకవైపు జాగ్రత్తగా ఆడుతూనే మరోవైపు భారీ షాట్లతో దూకుడు ప్రదర్శించారు.
ఈ క్రమంలో జంపా బౌలింగ్‌పై మరోసారి తన ఆధిపత్యం ప్రదర్శిస్తూ పాండ్యా వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే నాలుగో వికెట్‌కు 78 పరుగులు జత చేసిన అనంతరం జంపా బౌలింగ్‌లో మళ్లీ భారీ షాట్‌కు ప్రయత్నించి పాండ్యా పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో జాదవ్, పాండే కలిసి మరో చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. 54 బంతుల్లో జాదవ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే ఇలాంటి స్థితిలో ఆసీస్ పేసర్లు కమిన్స్, రిచర్డ్సన్ చక్కటి యార్కర్లతో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి భారత జోడీపై ఒత్తిడి పెంచారు. ఫలితంగా భారీ షాట్‌కు ప్రయత్నించి జాదవ్ వెనుదిరగ్గా... మరో మూడు బంతులకే పాండేను కమిన్స్ బౌల్డ్ చేశాడు. ధోని (13) కూడా తన ముద్ర చూపలేకపోవడంతో భారత్ విజయంపై ఆశలు కోల్పోయింది.
►8 కెరీర్ వందో వన్డేలో సెంచరీ చేసిన ఎనిమిదో, ఆస్ట్రేలియా తరఫున తొలి ఆటగాడు వార్నర్.
►100 ఉమేశ్ యాదవ్ వన్డేల్లో 100 వికెట్లు పడగొట్టాడు. అతను మొత్తం 71 వన్డేలు ఆడాడు.
►2000 కెప్టెన్‌గా వన్డేల్లో కోహ్లి 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అందరికంటే తక్కువ ఇన్నింగ్స్ (36)లలో అతను ఈ ఘనత నమోదు చేశాడు.