‘పేస్’ లేకుంటే ఎలా?
తేలిపోతున్న భారత సీమర్లు
ప్రపంచకప్‌కు సరిపోతారా?
సాక్షి క్రీడావిభాగం
‘భారత జట్టుకు బ్యాటింగ్‌తో సమస్య లేదు. జట్టులో స్పిన్నర్లూ బాగున్నారు. అయితే ఆస్ట్రేలియా గడ్డపై కనీసం 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే పేసర్లు ఆ జట్టుకు అవసరం. అప్పుడే 2015 వన్డే ప్రపంచకప్‌లో అవకాశాలుంటాయి’... అపార అనుభవం ఉన్న ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్‌లీ తాజా వ్యాఖ్య ఇది.
ఆస్ట్రేలియాలో పేస్ బౌలర్లు ఏం చేయాలో బ్రెట్‌లీ విశ్లేషించినంత సులభంగా ఇంకెవరు చెప్పగలరు! మరి భారత జట్టు సీమర్లకు ఆ సత్తా ఉందా...ఇటీవల వారి ప్రదర్శన చూస్తే వీళ్లు ప్రపంచకప్ ఆడటానికి పనికొస్తారా..?
ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం చెలరేగుతున్న ఇతర జట్ల ఫాస్ట్ బౌలర్లను చూస్తే మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది. మిషెల్ జాన్సన్ భారత వికెట్లపై కూడా ఏ దశలోనూ 150 కి.మీ.లకు తగ్గకుండా బౌలింగ్ చేశాడు. యాషెస్‌లో, ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో అతడి ప్రతాపం చూస్తే ఆసీస్ వికెట్లపై అతనేం చేయగలడో ఊహించవచ్చు.
ఇక ఇతర ప్రధాన జట్లలో స్టెయిన్, జునేద్ ఖాన్, మలింగ, మిల్నే తదితరుల వేగం ఎప్పుడూ 140 కి.మీ.కు తగ్గడం లేదు. అదే భారత బౌలింగ్‌కు మాత్రం ‘స్పీడ్ లాక్ చేయబడినది’ అనే బోర్డే కనిపిస్తోంది! ఎందుకంటే ఇప్పుడు జట్టులో ఉన్న షమీ, భువనేశ్వర్, ఆరోన్‌లతో పాటు ప్రస్తుతం దేశవాళీ ఆడుతున్న ఉమేశ్ యాదవ్ కూడా 130 కి.మీ.ల సగటుతోనే బౌలింగ్ చేస్తున్నారు. ఆసీస్ పిచ్‌లపై తగిన బౌన్స్ రాబట్టాలంటే మంచి వేగం ఉండటం ఎంతో అవసరం. మన బౌలర్లు మీడియం పేసర్లుగానే మిగిలిపోతున్నారు తప్ప ఫాస్ట్ బౌలర్లుగా ఎదగడం లేదు.
ఆకట్టుకోని ఆటతీరు...
ఫాస్ట్‌గా బౌలింగ్ వేయకపోవడానికి తోడు ఇటీవల వన్డేల్లో మన పేసర్ల వైఫల్యం భవిష్యత్తుపై సందేహాలు రేకెత్తిస్తోంది. స్వింగ్ బౌలర్‌గా గుర్తింపు ఉన్న భువనేశ్వర్ తనకు అనుకూలించే న్యూజిలాండ్ గడ్డపై ఐదు వన్డేలు ఆడి 4 వికెట్లే పడగొట్టగలిగాడు. కెరీర్ ఆరంభంలో వరుసగా మెయిడెన్లు, ప్రత్యర్థిని కట్టి పడేయగలిగిన భువీలో ఇప్పుడు ఆ పదును లోపించింది. ఇక మొహమ్మద్ షమీని అయితే ప్రతీ జట్టు బ్యాట్స్‌మెన్ అతి సులభంగా ఎదుర్కొంటున్నారు. ఇన్నింగ్స్ చివర్లో బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడే ప్రయత్నంలో వికెట్లు దక్కుతున్నా భారీగా పరుగులిస్తున్నాడు. కివీస్‌లో అతని ఎకానమీ రేట్ ఏ మ్యాచ్‌లోనూ 6.10 కంటే తక్కువ లేదు.
ఆసియా కప్‌లోనైతే షమీ 6.16 ఎకానమీతో పరుగులిచ్చాడు. చివరకు 159 పరుగులు నమోదైన అఫ్ఘానిస్థాన్ మ్యాచ్‌లో కూడా షమీ 7.2 ఓవర్లలోనే 50 పరుగులు సమర్పించుకున్నాడు. ఉపఖండం వికెట్లపై మలింగ తరహాలో కీలక సమయాల్లో యార్కర్లతో కట్టి పడేయడమో, మరో పదునైన అస్త్రమో మన బౌలర్ల వద్ద లేదు.
అందుబాటులో వీరే...
భారత వన్డే జట్టులో ఇటీవల వస్తూ, పోతూ ఉన్న బౌలర్లలో సీనియర్ ఇషాంత్‌తో పాటు వరుణ్ ఆరోన్, ఉమేశ్ యాదవ్ ఉన్నారు. వన్డేల్లో ఇషాంత్ ఎంత బలహీనమో ‘ఫాల్క్‌నర్’ పవర్‌తోనే తేలిపోయింది. మంచి భుజబలం ఉన్న ఉమేశ్ చక్కటి బౌన్స్ రాబట్టగలడని చాలా కాలంగా వింటూ వస్తున్నా ఇటీవల దక్షిణాఫ్రికాలో అతనూ ప్రభావం చూపలేదు. మూడేళ్ల క్రితం దేశవాళీలో 150 కిమీ వేగంతో బౌలింగ్ చేస్తూ వెలుగులోకి వచ్చి భారత్‌కు ఎనిమిది వన్డేలు ఆడినా పెద్దగా ఆకట్టుకోలేదు.
ఈశ్వర్ పాండేకు ఒక అవకాశం ఇచ్చి ఉంటే అతనేమిటో తెలిసేది.వినయ్ కుమార్, మోహిత్ శర్మ, ఉనాద్కట్ ఇలా వచ్చి అలా వెళుతున్నవారే. ప్రస్తుతం వరల్డ్‌కప్‌కు మిగిలిన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్న వనరులతోనే ముందుకు సాగడం తప్ప కొత్తగా ప్రత్యామ్నాయాలను తీర్చి దిద్దే అవకాశాలు తక్కువ. ఈ నేపథ్యంలో దాదాపు ఈ జట్టుతోనే వరల్డ్‌కప్‌కు వెళ్లే అవకాశాలే ఎక్కువ. మరి ఈ బలగం తమ పదును పెంచుకుంటేనే వరల్డ్‌కప్‌ను నిలబెట్టుకోవడంపై ఆశలు పెట్టుకోవచ్చు.