శుభసూచకమే!
ట్వంటీ20 క్రికెట్‌లో పేరుకే కాదు ఆటతో కూడా ఇప్పుడు ధోని సేన నంబర్‌వన్‌గా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాను వారి మైదానంలోనే చిత్తుగా ఓడించిన భారత జట్టు సొంతగడ్డపై తమ పదునేమిటో శ్రీలంకకు రుచి చూపించింది. పుణే మ్యాచ్ ఒక అరుదైన ఫలితం కాగా... ఆ తర్వాత మన అసలు సత్తా బయటపడింది. వెంటనే ఆసియాకప్‌లో పాల్గొనాల్సి ఉన్నా... అసలు లక్ష్యం మాత్రం ప్రపంచకప్. స్వదేశంలో జరుగుతుండటం, మొదటినుంచి చివరి ఆటగాడి వరకు అంతా ఫామ్‌లో ఉండటమే కాదు, మన కోసమే సిద్ధమయ్యే స్పిన్ పిచ్‌లు కూడా భారత్ గెలుపును కోరుతున్నట్లున్నాయి.
లంకపై చివరి మ్యాచ్ విజయం కూడా అదే చూపించింది. పొట్టి క్రికెట్‌లో తాము ఎప్పుడైనా గట్టి పోటీదారులమే అంటూ ధోని సవాల్ విసురుతుండటం వరల్డ్ కప్‌పై మన అంచనాలు పెంచేస్తోంది.
* సూపర్ ఫామ్‌లో ధోని సేన
* వరల్డ్‌కప్‌కు అన్ని విధాలా రెడీ
* లంకపై విజయం ఇచ్చిన ఉత్సాహం
ఆ స్ట్రేలియాతో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్కటే జట్టు... శ్రీలంకతో సొంతగడ్డపైనే అయినా ఇక్కడా మూడు మ్యాచ్‌లకు జట్టులో మార్పు లేదు. కోహ్లి లేకపోవడంతో రహానేకు అవకాశం దక్కడం తప్ప అనూహ్య నిర్ణయమేదీ లేదు. వరల్డ్‌కప్‌లో ఆడే తుది జట్టుపై కెప్టెన్ ధోని ఇప్పటికే ఒక నిర్ణయం తీసేసుకున్నాడని అర్థమవుతుంది. నేగిలాంటి ఆటగాడిని రిజర్వ్‌గానే చూడటం తప్ప అతడిని పరీక్షించి విశ్వ వేదికపై ఆడించే ఆలోచన కెప్టెన్‌కు ఉన్నట్లుగా లేదు. కాబట్టి ఇక జట్టు విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు.
యువరాజ్‌కు బ్యాటింగ్ అవకాశం వచ్చినా, రాకున్నా... సీనియర్ హర్భజన్ సేవలు అవసరమా, కాదా... ఇలా ఎవరు ఎలా భావించినా జట్టుకు సంబంధించి ఎవరైనా అనూహ్యంగా గాయపడితే తప్ప మార్పు ఉండకపోవచ్చు. ఈ ఆటగాళ్లే శ్రీలంకతో సిరీస్ విజయం అందించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.
బ్యాటింగ్ బాగు బాగు
టి20 రికార్డు, ఫామ్‌ను బట్టి టాప్-4 స్థానాల్లో ఎలాంటి మార్పు సాధ్యం కాదని ధోని గట్టిగానే చెప్పేశాడు. రోహిత్, కోహ్లిలతో పాటు ఈ ఫార్మాట్‌లో రైనా అత్యంత నమ్మదగిన బ్యాట్స్‌మెన్. శిఖర్ ధావన్‌పై ఏమైనా సందేహాలు ఉంటే ఈ సిరీస్‌తో తీరిపోయాయి. ఇక భారత్‌లో ఈ నలుగురి ఐపీఎల్ అనుభవం బ్రహ్మాండంగా పనికి రావడం ఖాయం. ‘టి20 క్రికెట్‌లో మేం ఎప్పుడైనా గట్టి పోటీదారులమే. మా జట్టులో దాదాపు అందరికీ భారత్‌లో ఎక్కువగా ఆడిన అనుభవం ఉంది. ముఖ్యంగా ఎనిమిది ఐపీఎల్ సీజన్లలో ఏడు ఇక్కడే ఆడాం.
అది చాలా కీలక పాత్ర పోషిస్తుంది’ అని ధోని మన బ్యాటింగ్ బలమేమిటో చెప్పేశాడు. లోయర్ ఆర్డర్‌లో ధోని ఉండగా, తాను చెలరేగగలనని పాండ్యా రాంచీ మ్యాచ్‌లో చూపించాడు. మరోవైపు ఆస్ట్రేలియాలోనూ, ఇక్కడా బ్యాటింగ్‌లో చివర్లో వచ్చిన యువరాజ్ ప్రభావం చూపలేకపోయాడు. అయితే యువీకి ధోని మద్దతుగా నిలవడం బట్టి చూస్తే ఇది పెద్ద సమస్య కాదని అర్థమవుతుంది. ‘అందరికీ బ్యాటింగ్ రాకపోవడమనేది సమస్యే. కానీ 6,7,8 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవారు నేరుగా భారీషాట్లకు పోవాల్సి ఉంటుంది. ఇక్కడ వారు ఎన్ని పరుగులు చేశారనేదానికన్నా, ఎంత వేగంగా చేస్తే జట్టుకు అంత ఉపయోగపడుతుంది’ అని విశ్లేషించిన ధోని 9వ స్థానం వరకు బ్యాటింగ్‌పై ఢోకా లేదన్నాడు.
స్పిన్...స్పిన్...
లంకతో సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో పేస్ వికెట్, రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ పిచ్, చివరగా స్పిన్ వికెట్...భారత్‌లో వచ్చే వరల్డ్ కప్ పిచ్‌లు ఎలా ఉండాలి అంటూ ఎ, బి, సి చాయిస్ ఇస్తే బీసీసీఐ ఓటు కచ్చితంగా మూడోదానికే పడుతుంది. మన విజయం కోసం పిచ్ ఇలా ఉండాలి అంటూ వైజాగ్ క్యురేటర్ దేశంలోని ప్రపంచకప్ వేదికల క్యురేటర్‌లకు మార్గం చూపించినట్లుంది! ఎలాంటి విమర్శలు, వివాదాలు వచ్చినా స్పిన్ అనుకూల పిచ్‌లే ఉంటాయనడంలో ఎలాంటి సందేహాలు లేవు.
అశ్విన్, జడేజాలు ‘తిప్పుడు’కు ఇక్కడ ఎలాగూ ఎదురు లేదు. కానీ రైనా, యువీల బంతులకు కూడా పిచ్ గిరిగిరా అంటోంది. ‘భారత్‌లో స్పిన్నర్ల ప్రభావం గురించి కొత్తగా చెప్పేదేముంది. వరల్డ్ కప్‌లో అది మాకు అదనపు ప్రయోజనం. ఆరంభంలో అశ్విన్ బాగా బౌలింగ్ చేస్తే మధ్య ఓవర్లలో పేసర్లను వాడుకునే సౌకర్యం నాకు ఉంటుంది. ఇద్దరు ఆఫ్‌స్పిన్నర్లు, ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు జట్టులో ఉన్నారంటే ఒకరు విఫలమైనా మిగతా ముగ్గురు చూసుకోగలరు. పైగా డెత్ ఓవర్లలో యార్కర్లు వేయగల బుమ్రాపై కూడా నాకు గట్టి నమ్మకం ఉంది’ అంటూ జట్టు స్పిన్‌పై ధోని అచంచల విశ్వాసం ప్రకటించాడు.
లోపాలు లేవా!
టి20 ఫార్మాట్‌లో ఉండే అనిశ్చితి గురించి ధోనికి తెలియనిది కాదు. మన జట్టు ఎవరూ ఓడించలేనంత పటిష్టంగా ఉందనే ధోనికి... ఓడిపోయే అవకాశం కూడా ఉందని తెలుసు. అతని అనుభవాన్ని బట్టి చూస్తే తన లోపాలూ తెలుసు. ‘ప్రత్యర్థి జట్టులో అందరికంటే విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ను ఆపడం మా ప్రధాన లక్ష్యం. ఎందుకంటే ఆ ఒక్కడు మ్యాచ్‌ను లాగేసుకోగలడు. ముఖ్యంగా నాకౌట్‌లో అత్యుత్తమ ఆటతీరు కనబర్చాలి.
ఒకరకంగా చెప్పాలంటే ఈ దశ లాటరీ టికెట్ లాంటిది. కాబట్టి నిలకడగా ఆడాల్సి ఉంది’ అని కెప్టెన్ కూల్ వెల్లడించాడు. లంకతో ఫలితం చూస్తే ప్రపంచకప్‌కు ముందు సొంతగడ్డపై మనోళ్ల హోంవర్క్ బాగా జరిగినట్లే. అన్నీ అనుకూలాంశాలే కనబడుతున్న నేపథ్యంలో ఇదే జోరు కొనసాగిస్తే 20-20లో రెండో సారి ‘మెన్ ఇన్ బ్లూ’ విశ్వవిజేతగా నిలవడం ఖాయం.
- సాక్షి క్రీడా విభాగం