
ఓపెనర్లు ఇరగదీశారు..
చెన్నై:ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, పార్థీవ్ పటేల్లు ఇరగదీశారు. ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తొలుత కేఎల్ రాహుల్ 96 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, ఆ తరువాత కొద్ది సేపటికీ పార్థీవ్ 81 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. అయితే టీమిండియా ఓపెనర్లు సెంచరీకిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం 31 ఇన్నింగ్స్ ల తరువాత ఇదే తొలిసారి. 2015 జూన్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత ఓపెనింగ్ జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని చివరిసారి సాధించింది. అప్పట్నుంచి ఈ ఇన్నింగ్స్ ముందు వరకూ చూస్తే టీమిండియా ఓపెనింగ్ యావరేజ్ 24.72గా ఉంది. ఇదిలా ఉంచితే 2011 నుంచి చూస్తే టీమిండియా ఓపెనర్లు 50 కు పైగా వ్యక్తిగత స్కోరు సాధించడం ఇది నాల్గోసారి మాత్రమే.
60/0 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును కదిలిస్తోంది. ఓవర్ నైట్ ఆటగాళ్లు పార్థీవ్, రాహుల్లు సమయోచితంగా ఆడుతూ భారత ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. కాగా, పార్థీవ్ పటేల్(71) భారీ షాట్ కు యత్నించి తొలి వికెట్ గా అవుటయ్యాడు. దాంతో ఈ జోడి 152 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.