పాక్‌తో చర్చలు జరుపుతాం
ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వ్యాఖ్య
న్యూఢిల్లీ: డిసెంబరులో పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య సిరీస్ జరిగే అవకాశాలు ఇంకా ఉన్నాయని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు. ఈ విషయం గురించి అక్టోబరు 25 తర్వాత ఇరు బోర్డుల అధ్యక్షులు చర్చలు జరుపుతారని చెప్పారు. ‘చర్చల కోసం భారత్‌కు వచ్చిన షహర్యార్ ఖాన్ బృందానికి మేం మంచి ఆతిథ్యం ఇచ్చాం. ఊహించని పరిణామాల వల్ల చర్చలు వాయిదా పడ్డాయి. అక్టోబరు 25న దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇరు బోర్డుల అధ్యక్షులు సమావేశమై సిరీస్ గురించి చర్చిస్తారు’ అని శుక్లా తెలిపారు. అటు పాక్ బోర్డు అధికారులు కూడా బీసీసీఐ నుంచి సానుకూల సంకేతాలు అందాయని తెలిపారు.
బీసీసీఐలో అంబుడ్స్‌మన్
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో పారదర్శకతను పెంచేందుకు అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నవంబరు 9న జరిగే ఏజీఎమ్‌లో దీనిపై అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇకపై బోర్డులో పదవుల్లో ఉన్న ఎవరైనా ఎలాంటి నిబంధనలను అతిక్రమించినా, కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తలెత్తినా ఈ అంబుడ్స్‌మన్ వాటిని పరిశీలిస్తుంది. అలాగే ఇకపై సెలక్షన్ కమిటీ ఎంపిక తర్వాత ఆ జట్టును అధ్యక్షుడు ఆమోదించాల్సిన అవసరం లేకుండా నిబంధనలను మార్చనున్నారు. ఇకపై రాష్ట్రాల సంఘాలు ఆడిట్ చేసిన అకౌంట్స్‌ను అప్పగిస్తేనే తర్వాతి ఏడాదికి నిధులు ఇస్తారు. ఇలా అనేక అంశాలపై మార్పులు, చేర్పులను 9న జరిగే సమావేశంలో ఆమోదించే అవకాశం ఉంది.