
ఇంగ్లండ్ కు భారీ లక్ష్యం
విశాఖ: ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు 204 పరుగుల వద్ద ఆలౌటైంది. 98/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 106 పరుగులు జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది. తద్వారా 405 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 455 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఈ రోజు ఆట ఆరంభంలో అజింక్యా రహానే(26), అశ్విన్(7), సాహా(2)లను స్వల్ప వ్యవధిలో కోల్పోయిన భారత జట్టు ఆ తరువాత కాస్త ఫర్వాలేదనిపించింది. కాగా, విరాట్ కోహ్లి(81;109 బంతుల్లో 8 ఫోర్లు)ని రషిద్ బోల్తా కొట్టించాడు. విరాట్ దాటిగా ఆడిన బంతిని స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న బెన్ స్టోక్స్ అద్భుతమైన రీతిలో ఒడిసి పట్టుకున్నాడు. దాంతో విరాట్ ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం జడేజా(14) మోస్తరుగా ఇంగ్లండ్ ను ఎదుర్కొనే యత్నం చేశాడు.
అయితే రషిద్ స్పిన్ వలలో చిక్కుకున్న జడేజా.. బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చివర్లో జయంత్ యాదవ్(27 నాటౌట్;59 బంతుల్లో 4ఫోర్లు), మొహ్మద్ షమీ(19; 22 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు)లు ఇంగ్లండ్ ను ప్రతిఘటించడంతో భారత తన రెండో ఇన్నింగ్స్ లో రెండొందల పరుగుల మార్కును చేరింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రషిద్లు తలో నాలుగు వికెట్లు సాధించగా,అండర్సన్, మొయిన్ అలీలకు చెరో వికెట్ దక్కింది. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 255 పరుగులకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే.