విరాట్ సేన చితక్కొట్టుడు!
విశాఖ:ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, చటేశ్వర పూజారాలు శతకాలతో కదం తొక్కారు. తొలుత పూజారా 184 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకం చేయగా, ఆ తరువాత కాసేపటికి విరాట్ కోహ్లి 154 బంతుల్లో 12 ఫోర్లుతో సెంచరీ పూర్తి చేశాడు. ఇది పూజారా టెస్టు కెరీర్లో 10 వ సెంచరీ కాగా, విరాట్ కెరీర్లో 14వ టెస్టు శతకం. పూజారా సిక్స్ కొట్టి సెంచరీ మార్కును దాటగా, విరాట్ మాత్రం సెంచరీ చేయడానికి కొన్నిబంతులను వృథా చేశాడు.
ఈ రోజు ఆరంభమైన ఆటలో భాగంగా మురళీ విజయ్(20) రెండో వికెట్ గా పెవిలియన్ చేరిన తరువాత పూజారాతో జత కలిసిన కోహ్లి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. ఒకవైపు మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కోవడంతో పాటు, చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఇంగ్లిష్ బౌలర్లకు పరీక్షగా నిలిచింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ శతకాలతో మెరిశారు. ఈ జోడి మూడో వికెట్ కు 200కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి భారత్ ను పటిష్టస్థితికి చేర్చింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ తో సుదీర్ఘ సిరీస్ లో భాగంగా రెండో టెస్టులో అందుబాటులోకి వచ్చిన కేఎల్ రాహుల్ డకౌట్ గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆపై స్వల్ప వ్యవధిలో విజయ్ కూడా నిష్క్రమించాడు. తొలి సెషన్ లో రెండు వికెట్లను కోల్పోయిన భారత్.. రెండో సెషన్ లో వికెట్ నష్టపోకుండా ఇంగ్లండ్ పై ఆధిపత్యం ప్రదర్శించింది.