
అశ్విన్ ర్యాంకు మరింత కిందికి..!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్ లో భారత ప్రధాన బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక ర్యాంకు కోల్పోయాడు. బౌలర్ల తాజా టెస్టు ర్యాంకింగ్స్ లో అశ్విన్ ఒక ర్యాంకు దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. అదే సమయంలో శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్ తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకుని రెండో స్థానానికి ఎగబాకాడు.
జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో 11 వికెట్లను తన ఖాతాలో వేసుకున్న హెరాత్.. అశ్విన్ కంటే ఒక రేటింగ్ పాయింట్ ఆధిక్యంతో రెండో స్థానాన్ని సాధించాడు. ప్రస్తుతం రంగనా హెరాత్ ఖాతాలో 866 రేటింగ్ పాయింట్లు ఉండగా, అశ్విన్ 865 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. గతవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో నిలిచిన అశ్విన్.. ఇప్పుడు మరో ర్యాంకు కోల్పోయి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఇదిలా ఉంచితే, భారత్ కు చెందిన మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా 898 రేటింగ్ పాయింట్లతో తొలిస్థానంలో కొనసాగుతున్నాడు.