బెసెటెరీ (సెయింట్ కిట్స్): తమతో జరిగే టెస్టు సిరీస్ లో టీమిండియాను నిలువరించడం అంత సులభం కాదని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ స్పష్టం చేశాడు. ప్రస్తుత విండీస్ జట్టులో ఎక్కువ మంది యువ క్రికెటర్లు ఉండటంతో పాటు అనుభవం కూడా తక్కువగా ఉండటంతో ఈ సిరీస్ లో తమకు ఒక సవాల్ ఎదురుకానుందన్నాడు.
' ఈ సిరీస్ మాకు కచ్చితంగా ఛాలెంజే. భారత క్రికెట్ జట్టులో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉండటంతో పాటు, నాణ్యమైన బౌలింగ్ కూడా ఉంది. ప్రస్తుతం భారత జట్టు టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉంది. దీంతో ఆ జట్టు నుంచి మాకు తీవ్ర పోటీ ఉంటుంది. మా జట్టులో అనుభవం లేదు. ఎక్కువ యువకులు ఉండటమే ఇందుకు కారణం'అని హోల్డర్ తెలిపాడు. తొలి ఇన్నింగ్స్ లో 90.0 ఓవర్లపాటు ఆడినట్లైతే భారత్ కు పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందన్నాడు. గత కొంతకాలంగా తమ జట్టు రోజంతా ఆడటంలో విఫలమవుతూ వస్తుందని, దాన్ని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హోల్డర్ అన్నాడు.