
భరత్ ‘ట్రిపుల్’ సెంచరీ
గోవాతో రంజీలో పట్టుబిగించిన ఆంధ్ర
ఒంగోలు: నిలకడైన బ్యాటింగ్... నాణ్యమైన షాట్లతో చెలరేగిన ఆంధ్ర బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్ (311 బంతుల్లో 308; 38 ఫోర్లు, 6 సిక్సర్లు) గోవాతో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ‘ట్రిపుల్’ సెంచరీతో చెలరేగాడు. దీంతో శనివారం రెండో రోజు ఆంధ్ర తొలి ఇన్నిం గ్స్‌లో 123 ఓవర్లలో 5 వికెట్లకు 548 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 408/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆంధ్ర రెండో రోజు ఆట కొనసాగించగా... ఎం.శ్రీరామ్ (254 బంతుల్లో 144; 20 ఫోర్లు, 1 సిక్స్), భరత్‌లు గోవా బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 333 పరుగులు జోడించారు. శ్రీరామ్ అవుటైన తర్వాత 46 పరుగుల వ్యవధిలో ఆంధ్ర మూడు వికెట్లు కోల్పోయింది. నరేన్ రెడ్డి (1), రికీ భుయ్ (10)లతో పాటు భరత్ కూడా వెనుదిరిగాడు.
తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గోవా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 52 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. వేదాంత్ నాయక్ (32 బ్యాటింగ్), గవాస్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. దర్శన్ మిసాల్ (66) మెరుగ్గా ఆడాడు. ప్రస్తుతం గోవా తొలి ఇన్నింగ్స్‌లో 361 పరుగులు వెనుకబడి ఉంది. విజయ్ 3, శివ, స్టీఫెన్ చెరో రెండు వికెట్లు తీశారు. రెండు రోజులు ఆట మిగిలిఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఆంధ్రకు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి.