భారత కుర్రాళ్ల శుభారంభం | India U-19 thrash Zimbabwe by 148 runs in one-day | Sakshi
Sakshi News home page

భారత కుర్రాళ్ల శుభారంభం

Published Tue, Sep 24 2013 1:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM

భారత కుర్రాళ్ల శుభారంభం

భారత కుర్రాళ్ల శుభారంభం

  విశాఖపట్టణం, న్యూస్‌లైన్: దీపక్ హుడా (55 బంతుల్లో 83 నాటౌట్; 5 ఫోర్లు; 5 సిక్స్‌లు, 2/37)ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో అండర్-19 నాలుగు దేశాల వన్డే సిరీస్‌లో భారత కుర్రాళ్లు శుభారంభం చేశారు. సోమవారం స్థానిక వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో జింబాబ్వేతో జరిగిన ఈ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో రాణించిన భారత్ 148 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 291 పరుగులు చేసింది. 
 
 ఓపెనర్ అంకుశ్ బెయిన్స్ (62 బంతుల్లో 49; 7 ఫోర్లు; 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (55 బంతుల్లో 55; 4 ఫోర్లు; 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ఆరో నంబర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన హుడా జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు. ప్రతీ బౌలర్‌పై ఎదురుదాడికి దిగడంతో చివర్లో స్కోరు బోర్డు పరుగులెత్తింది. రికీ భుయ్ (19)తో కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించిన హుడా... 15 ఏళ్ల సర్ఫరాజ్‌తో కలిసి ఆరో వికెట్‌కు 35 బంతుల్లోనే 72 పరుగులు జత చేశాడు. 
 
 అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన జింబాబ్వే 41.2 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటయ్యింది. బుర్ల్ (55 బంతుల్లో 46; 4 ఫోర్లు; 1 సిక్స్) ఒక్కడే ఆకట్టుకున్నాడు. కుల్‌దీప్ యాదవ్‌కు నాలుగు వికెట్లు దక్కగా హుడా బౌలింగ్‌లోనూ రాణించి రెండు వికెట్లు సాధించాడు. సోమవారమే జరిగిన మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అండర్ -19 జట్టు 17 పరుగుల తేడాతో ఆసీస్ అండర్-19 జట్టును ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 44 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత ఆసీస్ 44.2 ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేసి ఓడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement