రాహుల్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సామ్సన్
అయ్యయ్యో ప్రేక్షకులు! మాయదారి కరోనా వల్ల మంచి మ్యాచ్‌లను మైదానంలో చూడలేకపోతున్నారు! లేదంటే సోమవారం నాటి మ్యాచ్‌లో దంచిన సిక్సర్లు ప్రేక్షకుల గ్యాలరీలో ఎంతమంది చేతుల్లో పడేవో! ఏదైతేనేం టీవీల్లో బోలెడంత వినోదాన్ని పంచిన మ్యాచ్‌లో కొండంత స్కోరు, సిక్సర్ల హోరు ఆఖరిదాకా ఇదే జోరు ఉత్కంఠ రేకెత్తించింది. చివరి బంతికి తేలిన ఫలితంలో రాజస్తాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయాన్ని అందుకుంది.
ముంబై: ఐపీఎల్‌లో అదిరిపోయే బొమ్మ పడింది. భారీస్కోర్లతో అభిమానులకు మజా పంచింది. ఆఖరిదాకా ఉత్కంఠ పెంచింది. చివరకు ఓ అసాధారణ పోరాటం (సంజూ సామ్సన్) బౌండరీ లైన్ దగ్గర దీపక్ హుడా చేతికి చిక్కింది. దీంతో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 200 పైచిలుకు పరుగులు చేసి కూడా... పంజాబ్ కింగ్స్ 4 పరుగులతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్ (63 బంతుల్లో 119; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) ఐపీఎల్ చరిత్రలో చిరస్మరణీయ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (50 బంతుల్లో 91; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... దీపక్ హుడా (28 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) హైలైట్స్ చూపించాడు. చేతన్ సకారియా 3, క్రిస్ మోరిస్ 2 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసి ఓడిపోయింది.
రాహుల్, హుడా ఎడాపెడా...
పంజాబ్ ఇన్నింగ్స్‌లో మయాంక్ (14) ఎక్కువ సేపు నిలువలేదు. గేల్ (28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పదో ఓవర్ పూర్తికాకముందే ఔటయ్యాడు. సగం ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 89/2. ఆ తర్వాత 10 ఓవర్లలో పంజాబ్ ఏకంగా 132 పరుగులు చేసింది. స్కోరు 17.1వ ఓవర్లలోనే 200 పరుగుల్ని అవలీలగా దాటేసింది. ఇన్నింగ్స్ 13, 14 ఓవర్లయితే ప్రత్యర్థి బౌలర్లకు కాళరాత్రిని మిగిల్చాయి. దూబే 13వ ఓవర్లో రాహుల్ సిక్స్ కొట్టి 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంటే... హుడా రెండు సిక్స్‌లు బాది విధ్వంసానికి తెగబడ్డాడు. ఈ 12 బంతుల వ్యవధిలో అరడజను సిక్సర్లు వచ్చాయి. స్కోరేమో కొండంత అయ్యింది. కేవలం 20 బంతుల్లోనే దీపక్ హుడా అర్ధసెంచరీని అధిగమించాడు. సెంచరీకి చేరువైన రాహుల్ చివరి ఓవర్లో ఔటయ్యాడు.
సామ్సన్ సూపర్...
కొండంత లక్ష్యాన్ని చూసి రాజస్తాన్ రాయల్స్ జడిసిపోలేదు. హిట్టర్ స్టోక్స్ (0) తొలి ఓవర్లో డకౌటైనా కంగారు పడిపోలేదు. దిమ్మదిరిగే బదులిచ్చేందుకు రాజస్తాన్ పరుగూ పరుగూ పోగేసింది. బౌండరీలనూ జతచేసింది. సిక్సర్లతో వేగం పెంచుకుంది. ఈ క్రమంలో కెప్టెన్ సామ్సన్‌కు వచ్చిన రెండు లైఫ్‌లు లక్ష్యాన్ని దించేందుకు దోహదం చేశాయి. 12 పరుగుల వద్ద కీపర్ రాహుల్ సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తయ్యాక ఎల్బీగా వెనుదిరగాల్సిన సంజూ రివ్యూతో బతికిపోయాడు.
బట్లర్ (25; 5 ఫోర్లు), శివమ్ దూబే (23; 3 ఫోర్లు) వేగంగా ఆడినా... ఎక్కువసేపు నిలువలేదు. ఆ తర్వాత రియాన్ పరాగ్ (11 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్‌లు)తో కలిసి సామ్సన్ ప్రత్యర్థి బౌలర్లను చావబాదాడు. ఐదో వికెట్‌కు వీరిద్దరి మధ్య చకచకా సాగిన 52 పరుగుల భాగస్వామ్యం జట్టులో ఆశల్ని కసికసిగా పెంచింది. చివరకు సామ్సన్ 54 బంతుల్లోనే సాధించిన సెంచరీ గెలుపుదారిలో పడేసింది. కానీ ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి 13 పరుగులు అవసరమైన దశలో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. అర్‡్షదీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి సామ్సన్‌కు పరుగు రాలేదు.
రెండో బంతికి సామ్సన్... మూడో బంతికి మోరిస్ సింగిల్స్ తీశారు. నాలుగో బంతిని సామ్సన్ సిక్సర్‌గా మలిచాడు. దాంతో రాజస్తాన్ గెలుపునకు 2 బంతుల్లో 5 పరుగులు అవరసమయ్యాయి. ఐదో బంతిని సామ్సన్ లాంగ్‌ఆఫ్ వద్దకు ఆడగా... మోరిస్ సింగిల్ కోసం వచ్చాడు. కానీ సామ్సన్ సింగిల్ వద్దనడంతో మోరిస్ వెనక్కి వెళ్లిపోయాడు. దాంతో చివరి బంతికి రాజస్తాన్ గెలుపునకు 5 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆరో బంతిని సామ్సన్ కవర్స్‌లో కొట్టిన భారీ షాట్ బౌండరీ దాటకుండా పంజాబ్ ఫీల్డర్ దీపక్ హుడా చేతికి చిక్కింది. దాంతో చేజారిందనుకున్న మ్యాచ్‌లో పంజాబ్ విజయాన్ని అందుకుంది.
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) తెవాటియా (బి) సకారియా 91; మయాంక్ (సి) సంజూ సామ్సన్ (బి) సకారియా 14; గేల్ (సి) స్టోక్స్ (బి) పరాగ్ 40; దీపక్ హుడా (సి) పరాగ్ (బి) మోరిస్ 64; పూరన్ (సి) సకారియా (బి) మోరిస్ 0; షారుఖ్ ఖాన్ (నాటౌట్) 6; జే రిచర్డ్‌సన్ (సి) మోరిస్ (బి) సకారియా 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 221.
వికెట్ల పతనం: 1–22, 2–89, 3–194, 4–201, 5–220, 6–221.
బౌలింగ్: చేతన్ సకారియా 4–0–31–3, ముస్తాఫిజుర్ 4–0–45–0, మోరిస్ 4–0–41–2, శ్రేయస్ గోపాల్ 3–0–40–0, స్టోక్స్ 1–0–12–0, తెవాటియా 2–0–25–0, రియాన్ పరాగ్ 1–0–7–1, దూబే 1–0–20–0.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: స్టోక్స్ (సి అండ్ బి) షమీ 0; వొహ్రా (సి అండ్ బి) అర్‡్షదీప్ సింగ్ 12; సంజూ సామ్సన్ (సి) హుడా (బి) అర్‡్షదీప్ సింగ్ 119; బట్లర్ (బి) రిచర్డ్‌సన్ 25; శివమ్ దూబే (సి) హుడా (బి) అర్‡్షదీప్ సింగ్ 23, పరాగ్ (సి) రాహుల్ (బి) షమీ 25; తెవాటియా (సి) రాహుల్ (బి) మెరెడిత్ 2; మోరిస్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 217.
వికెట్ల పతనం: 1–0, 2–25, 3–70, 4–123, 5–175, 6–201, 7–217.
బౌలింగ్: షమీ 4–0–33–2, రిచర్డ్‌సన్ 4–0–55–1, అర్‡్షదీప్ సింగ్ 4–0–35–3, మెరెడిత్ 4–0–49–1, మురుగన్ అశ్విన్ 4–0–43–0.
ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా నైట్‌రైడర్స్ X ముంబై ఇండియన్స్
వేదిక: చెన్నై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం.
Comments
Please login to add a commentAdd a comment