IPL 2021, CSK vs RR: చెన్నై సూపర్‌... | Chennai Super Kings Beat Rajastan Royals 45 Runs | Sakshi
Sakshi News home page

IPL 2021, CSK vs RR: చెన్నై సూపర్‌...

Published Tue, Apr 20 2021 4:37 AM | Last Updated on Tue, Apr 20 2021 8:48 AM

Chennai Super Kings Beat Rajastan Royals 45 Runs - Sakshi

ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ మొయిన్‌ అలీ

ఒకరిద్దరు కాకుండా... కలసికట్టుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు అదరగొట్టింది. ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 33 దాటకున్నా వచ్చిన వారందరూ క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడేసి తమవంతు పరుగులు చేసేసి వెళ్లారు. దాంతో చెన్నై జట్టు ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్నే నిర్దేశించింది. అనంతరం బౌలింగ్‌లోనూ చెన్నై సమష్టిగా మెరిసింది. మొయిన్‌ అలీ, రవీంద్ర జడేజా ‘స్పిన్‌’తో తిప్పేయగా... పేస్‌తో స్యామ్‌ కరన్, శార్దుల్, బ్రావో హడలెత్తించారు. వెరసి ఐపీఎల్‌లో మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 
 
ముంబై: ఆల్‌రౌండ్‌ షోతో అలరించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఐపీఎల్‌లో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. వాంఖెడే స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని సీఎస్‌కే 45 పరుగుల ఆధిక్యంతో రాజస్తాన్‌ రాయల్స్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. డు ప్లెసిస్‌ (17 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అంబటి రాయుడు (17 బంతుల్లో 27; 3 సిక్స్‌లు), మొయిన్‌ అలీ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా ఓ చెయ్యి వేశారు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ను చెన్నై బౌలర్లు మొయిన్‌ అలీ (3/7), స్యామ్‌ కరన్‌ (2/24), రవీంద్ర జడేజా (2/28) కట్టడి చేశారు. ఫలితంగా రాజస్తాన్‌ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులకే పరిమితమై  ఓడిపోయింది. జోస్‌ బట్లర్‌ (35 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  

మెరిసిన టాపార్డర్‌
టాస్‌ ఓడి సీఎస్‌కే బ్యాటింగ్‌కు దిగగా... రుతురాజ్‌ గైక్వాడ్‌ (10) మరోసారి విఫలమయ్యాడు. మరో ఓపెనర్‌ డు ప్లెసిస్‌ మాత్రం తన బ్యాట్‌ను స్వేచ్ఛగా ఝుళిపించాడు. ఉనాద్కట్‌ వేసిన ఐదో ఓవర్‌లో రెచ్చిపోయిన డు ప్లెసిస్‌ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌ కొట్టాడు. అయితే అదే దూకుడును కొనసాగించలేకపోయిన అతడు... మోరిస్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్‌ పాయింట్‌ వద్ద పరాగ్‌ చేతికి చిక్కాడు. మరో ఎండ్‌లో ఉన్న మొయిన్‌ అలీ కూడా దూకుడుగా ఆడాడు.

ముస్తఫిజుర్‌ వేసిన ఏడో ఓవర్‌లో షార్ట్‌ థర్డ్‌మ్యాన్, డీప్‌ మిడ్‌వికెట్‌ దిశగా రెండు బౌండరీలు బాదిన అలీ... ఆ మరుసటి ఓవర్‌లో డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా కొట్టిన ఫ్లాట్‌ సిక్సర్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అయితే అలీ కూడా డు ప్లెసిస్‌లాగే తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోరు చేయడానికి ఉపయోగించుకోలేకపోయాడు. 10 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే స్కోరు 82/3గా ఉంది. ఈ దశలో రైనా, రాయుడు కూడా హిట్టింగ్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. 14వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన సకారియా... ఆ ఓవర్‌లో 5 పరుగులు మాత్రమే ఇచ్చి రాయుడు, రైనాలను అవుట్‌ చేసి రాజస్తాన్‌కు డబుల్‌ బ్రేక్‌ ఇచ్చాడు. ధోని (18), జడేజా (8) వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరగా... చివర్లో బ్రావో (8 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌)... స్యామ్‌ కరన్‌ (6 బంతుల్లో 13; 1 సిక్స్‌) 14 బంతుల్లో 33 పరుగులు జోడించారు.

బట్లర్‌ బాదినా...
ఛేదనలో రాజస్తాన్‌ రాయల్స్‌ను స్యామ్‌ కరన్‌ దెబ్బ కొట్టాడు. తన వరుస ఓవర్లలో మనన్‌ వోహ్రా (14), కెప్టెన్‌ సామ్సన్‌ (1)లను అవుట్‌ చేసి చెన్నైకి శుభారంభం చేశాడు. మరో ఎండ్‌లో బట్లర్‌ బౌండరీలు బాదేస్తూ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా... అతనికి శివమ్‌ దూబే (17; 2 ఫోర్లు) సహకరించాడు. దాంతో రాజస్తాన్‌ 10 ఓవర్లు ముగిసేసరికి 81/2గా నిలిచింది. 12వ ఓవర్‌ వేసిన జడేజా... మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. గుడ్‌లెంగ్త్‌ బాల్‌తో బట్లర్‌ను జడేజా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అదే ఓవర్‌ చివరి బంతికి దూబేను ఎల్బీగా అవుట్‌ చేసి మ్యాచ్‌ను సీఎస్‌కే వైపు తిప్పాడు. ఆ తర్వాత ఆశలు పెట్టుకున్న మిల్లర్‌ (2), పరాగ్‌ (3), మోరిస్‌ (0)లను మొయిన్‌ అలీ అవుట్‌ చేయడంతో... ఒకదశలో 87/2గా ఉన్న రాజస్తాన్‌ 8 పరుగుల వ్యవధిలో 5 వికెట్లను కోల్పోయి 95/7గా నిలిచింది. చివర్లో తెవాటియా (20; 2 సిక్స్‌లు), ఉనాద్కట్‌ (24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిసినా ఫలితం లేకపోయింది.

వావ్‌... ధోని
40 ఏళ్లకు చేరువలో ఉన్నా ధోని ఫిట్‌నెస్‌లో మాత్రం ఏ మార్పు లేదు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని... ఆ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో తప్ప క్రికెట్‌ ఆడింది లేదు. అయినా సరే వికెట్ల వెనుక, వికెట్ల మధ్య అతడి వేగం ఏ మాత్రం తగ్గలేదు. ఈ విషయం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి నిరూపితమైంది. ఏడో నెంబర్‌లో బ్యాటింగ్‌ వచ్చిన ధోని... 15వ ఓవర్‌ రెండో బంతిని షార్ట్‌ ఎక్స్‌ట్రా కవర్‌లోకి ఆడి పరుగు కోసం పిచ్‌ మధ్య వరకు వచ్చాడు. అయితే బంతి బట్లర్‌ వద్దకు వెళ్లడంతో పరుగు వద్దంటూ నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌లో ఉన్న జడేజా ధోనిని వారించాడు. బట్లర్‌ రాకెట్‌ వేగంతో బంతిని కీపర్‌కు విసరగా... రెప్పపాటులో ధోని... వెనక్కి తిరిగి సామ్సన్‌ వికెట్లను గిరాటేసేలోపు సూపర్‌ డైవ్‌తో క్రీజును చేరుకున్నాడు. దాంతో అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు.   


స్కోరు వివరాలు

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) శివమ్‌ దూబే (బి) ముస్తఫిజుర్‌ 10; డు ప్లెసిస్‌ (సి) పరాగ్‌ (బి) మోరిస్‌ 33; మొయిన్‌ అలీ (సి) పరాగ్‌ (బి) తెవాటియా 26; రైనా (సి) మోరిస్‌ (బి) సకారియా 18; రాయుడు (సి) పరాగ్‌ (బి) సకారియా 27; జడేజా (సి) సామ్సన్‌ (బి) మోరిస్‌ 8; ధోని (సి) బట్లర్‌ (బి) సకారియా 18; స్యామ్‌ కరన్‌ (రనౌట్‌) 13; బ్రావో (నాటౌట్‌) 20; శార్దుల్‌ ఠాకూర్‌ (రనౌట్‌) 1; దీపక్‌ చహర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 188.
వికెట్ల పతనం: 1–25, 2–45, 3–78, 4–123, 5–125, 6–147, 7–163, 8–174, 9–180.
బౌలింగ్‌: జైదేవ్‌ ఉనాద్కట్‌ 4–0–40–0; చేతన్‌ సకారియా 4–0–36–3; ముస్తఫిజుర్‌ 4–0–37–1; మోరిస్‌ 4–0–33–2; రాహుల్‌ తెవాటియా 3–0–21–1; రియాన్‌ పరాగ్‌ 1–0–16–0.

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ (బి) జడేజా 49; మనన్‌ వొహ్రా (సి) జడేజా (బి) స్యామ్‌ కరన్‌ 14; సామ్సన్‌ (సి) బ్రావో (బి) స్యామ్‌ కరన్‌ 1; శివమ్‌ దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 17; మిల్లర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) మొయిన్‌ అలీ 2; పరాగ్‌ (సి) జడేజా (బి) మొయిన్‌ అలీ 3; తెవాటియా (సి) రుతురాజ్‌ (బి) బ్రావో 20; మోరిస్‌ (సి) జడేజా (బి) మొయిన్‌ అలీ 0; ఉనాద్కట్‌ (సి) జడేజా (బి) శార్దుల్‌ ఠాకూర్‌ 24; సకారియా (నాటౌట్‌) 0; ముస్తఫిజుర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 13;  మొత్తం (20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు) 143.
వికెట్ల పతనం: 1–30, 2–45, 3–87, 4–90, 5–92, 6–95, 7–95, 8–137, 9–143.  
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 3–0–32–0; స్యామ్‌ కరన్‌ 4–0–24–2; శార్దుల్‌ ఠాకూర్‌ 3–0–20–1; జడేజా 4–0–28–2; బ్రావో 3–0–28–1; మొయిన్‌ అలీ 3–0–7–3. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement