భారత్‌ను ఊరిస్తున్న ‘రికార్డు’ | India v Sri Lanka, T20 World Cup 2014 Final to day | Sakshi
Sakshi News home page

భారత్‌ను ఊరిస్తున్న ‘రికార్డు’

Published Sun, Apr 6 2014 2:30 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

భారత్‌ను ఊరిస్తున్న ‘రికార్డు’ - Sakshi

భారత్‌ను ఊరిస్తున్న ‘రికార్డు’

 సాయంత్రం గం. 6.30 నుంచి
 డీడీ, స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 
 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే వన్డే ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ, టి20 ప్రపంచకప్... వీటన్నింటిలోనూ ఏకకాలంలో ఒకే జట్టు చాంపియన్‌గా ఎప్పుడూ లేదు. అలాంటి అరుదైన రికార్డును సొంతం చేసుకునే సువర్ణావకాశం భారత్‌కు లభించింది. 2011 వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ధోనిసేన... ఈసారి టి20 ప్రపంచకప్ కూడా నెగ్గితే... మూడు టైటిళ్లను ఏకకాలంలో సంపాదించుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. దీనికి కావలసింది ఒకే ఒక్క విజయం. ఆదివారం శ్రీలంకతో జరిగే ఫైనల్లో భారత్ గెలవాలి.
 
 ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 సరిగ్గా మూడేళ్ల క్రితం... 2011 ఏప్రిల్ మొదటి వారం, ముంబైలో భారత్, శ్రీలంకల మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్. శ్రీలంక దిగ్గజం మురళీధరన్‌కు అది ఆఖరి వన్డే మ్యాచ్. భారత్ ఫైనల్లో గెలిచింది.
 
 కట్ చేస్తే... 2014 ఏప్రిల్ మొదటి వారం, ఢాకాలో భారత్, శ్రీలంకల మధ్య టి20 ప్రపంచకప్ ఫైనల్. ఈసారి శ్రీలంక దిగ్గజాలు సంగక్కర, జయవర్ధనేలకు ఆఖరి టి20 మ్యాచ్. మరి ఫైనల్ ఫలితం..?
 భారత్, శ్రీలంకల మధ్య క్రికెట్ చూసీ చూసీ చాలామంది అభిమానులకు బోర్ కొట్టి ఉండొచ్చు. కానీ ఆదివారం జరగబోయే టి20 ప్రపంచకప్ ఫైనల్ మాత్రం కచ్చితంగా బోర్ కొట్టదు. రెండు జట్లూ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం ఒక కారణమైతే... భారత బ్యాట్స్‌మెన్, శ్రీలంక బౌలర్లకు మధ్య జరగనున్న నాణ్యమైన క్రికెట్ పోరాటం మరో కారణం. సూపర్-10 దశలో రెండు గ్రూప్‌లలో విజేతలుగా నిలిచిన జట్లే ఫైనల్‌కు చేరడం ఈ జట్లు టోర్నీలో ఇప్పటి వరకూ చూపించిన నిలకడకు నిదర్శనం. అవడానికి ప్రపంచకప్ అయినా రెండు ఆసియా జట్ల మధ్య ఆదివారం జరిగే ఈ టి20 సమరానికి షేరే బంగ్లా స్టేడియం వేదిక కానుంది. భారత్, శ్రీలంకల మధ్య ఇదే వేదికలో టోర్నీకి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో శ్రీలంక గెలిచింది. అయితే ఆ మ్యాచ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇరు జట్లూ అంటున్నాయి.
 
 సూపర్ ఫామ్‌లో భారత్
 ఈ టోర్నీలో భారత్ నాలుగు సులభమైన విజయాలతో సెమీస్‌కు చేరినా... ఒత్తిడిలో బ్యాట్స్‌మెన్ భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే ఎలా అనే సందేహం ఉండేది. దక్షిణాఫ్రికాతో సెమీస్ ద్వారా ఆ సందేహం కూడా తీరిపోయింది. ఇక బౌలింగ్, బ్యాటింగ్ ఏది ముందు చేసినా సమస్య లేదనే ధీమా పెరిగింది. రోహిత్, రహానే సెమీస్‌లో బాగా ఆడిన నేపథ్యంలో ధావన్ మరోసారి పెవిలియన్‌కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. కోహ్లి, యువరాజ్, రైనా, ధోనిలతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది.
 
 ఇక రవీంద్ర జడేజా, అశ్విన్ కూడా కాస్తో కూస్తో బ్యాటింగ్ చేయగల సమర్థులు. ఇక బౌలింగ్‌లో స్పిన్ త్రయం అశ్విన్, మిశ్రా, జడేజాలతో పాటు రైనా కూడా ఓ చేయి వేస్తున్నాడు. మిశ్రా సెమీస్‌లో విఫలమైనా... జట్టుకు తన విషయంలో ఎలాంటి బెంగా అవసరం లేదు. ఇక పేసర్ భువనేశ్వర్ ఆకట్టుకుంటున్నా... కీలకమైన సెమీస్‌లో మోహిత్ శర్మ పేలవంగా బౌలింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఫైనల్‌కు మోహిత్‌ను కొనసాగిస్తారా? లేక పేస్ ఎక్కువగా వేయగల షమీని తిరిగి జట్టులోకి తెస్తారో చూడాలి. చేస్తే ఈ ఒక్క మార్పు చేయొచ్చు. ఏ మార్పులు లేకుండా ధోనిసేన బరిలోకి దిగినా ఆశ్చర్యం లేదు.
 
 ముగ్గురు స్పిన్నర్లు?
మరోవైపు శ్రీలంక కూడా ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. వెస్టిండీస్‌తో సెమీస్‌లో ఇదే ఫార్ములాతో బరిలోకి దిగింది. కాబట్టి భారత్‌పై కూడా అదే ఆలోచన చేయొచ్చు. బ్యాటింగ్‌లో ఓపెనర్లు కుశాల్ పెరీరా, దిల్షాన్ ఫామ్‌లోనే ఉన్నారు. సంగక్కర ఇప్పటిదాకా ఈ టోర్నీలో ఆకట్టుకోలేదు.
 
 
 తనతో పాటు చివరి మ్యాచ్ ఆడబోతున్న జయవర్ధనే మాత్రం టోర్నీలో బాగానే పరుగులు చేశాడు. తిరిమన్నెతో పాటు ఆఖరి ఓవర్లలో వేగంగా ఆడగల మాథ్యూస్ ఈ జట్టు మిడిలార్డర్‌కు బలం. ఇక తిషార పెరీరా స్థానంతో స్పిన్ ఆల్‌రౌండర్ ప్రసన్న సెమీస్ ఆడాడు. ఫైనల్లో కూడా ముగ్గురు స్పిన్నర్లు అనుకుంటే తిషార బెంచ్‌కి పరిమితం కావాలి. ఇక బౌలింగ్‌లో మలింగ, కులశేఖర, మాథ్యూస్ పేస్ బాధ్యత తీసుకుంటారు. సేనానాయకే, హెరాత్ తుది జట్టులో ఉండటం ఖాయం. కాబట్టి మెండిస్ బెంచ్‌కు పరిమితం కావచ్చు. ఏమైనా లంక జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది.
 
 జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లి, యువరాజ్, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, అశ్విన్, మిశ్రా, భువనేశ్వర్, మోహిత్ / షమీ.
 శ్రీలంక: లసిత్ మలింగ (కెప్టెన్), దిల్షాన్, కుశాల్ పెరీరా, సంగక్కర, జయవర్ధనే, తిరిమన్నె, మాథ్యూస్, ప్రసన్న/తిషార పెరీరా, హెరాత్, సేనానాయకే, కులశేఖర.
 
 షేరే బంగ్లా పిచ్ చాలా స్లోగా ఉంటోంది. రెండు జట్లలోనూ ఉన్న బలమైన బ్యాటింగ్ లైనప్‌ను దృష్టిలో ఉంచుకుంటే... భారీ స్కోర్లు ఖాయంగా కనిపిస్తోంది. మరోసారి స్పిన్నర్లదే కీలక పాత్ర.
 
 శనివారం మొత్తం ఢాకాలో మబ్బులు పట్టే ఉ న్నాయి. రోజూ ఉండే ఎండ లేదు. ఉక్కపోత ఎక్కువగా ఉంది. ఆదివారం వర్షం పడే అవకాశా లు ఉ న్నాయని వాతావరణ శాఖ నివేదిక. అయితే మ్యాచ్‌కు ఆటంకం కలిగే స్థాయిలో ఉండకపోవచ్చు. ఒకవేళ వర్షంతో మ్యాచ్ జరగకపోతే... సోమవారం రిజర్వ్ డే ఉంది. సోమవారం కూడా మ్యాచ్ సాధ్యం కాకపోతే సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
 
 3 ఇప్పటివరకూ భారత్, శ్రీలంకల మధ్య జరిగిన ఐదు టి20ల్లో భారత్ మూడు గెలిచింది. లంక రెండు నెగ్గింది.
 
 1 ఇరు జట్ల మధ్య టి20 ప్రపంచకప్‌లలో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్ (2010)లో శ్రీలంక గెలిచింది.
 
 3 భారత్ చివరిగా ఆడిన మూడు టోర్నీల ఫైనల్స్‌లోనూ గెలిచింది.
 
 19 భారత్, శ్రీలంక ఇప్పటివరకూ 19సార్లు వివిధ టోర్నీల ఫైనల్స్ ఆడాయి. ఇందులో భారత్ 9 గెలిస్తే, లంక 8 నెగ్గింది. రెండుసార్లు సంయుక్త విజేతలుగా నిలిచారు.
 
 శ్రీలంక మంచి జట్టు. యువకులు, అనుభవజ్ఞులతో సమతూకంతో ఉంది. వికెట్‌కు తగ్గట్టుగా బౌలింగ్ చేయగల స్పిన్నర్లు ఉన్నారు. దక్షిణాఫ్రికాపై 170 పైచిలుకు పరుగులు ఛేదించడంతో మా ఆత్మవిశ్వాసం పెరిగింది. పెద్ద మ్యాచ్‌కు ముందు అభిమానులకు చెప్పేదేం లేదు. మా మనసులో ఏడాది పొడవునా గెలవాలనే ఉంటుంది. దానికోసం మా సర్వశక్తులూ ఒడ్డుతాం. ప్రస్తుతానికి మా దృష్టి అంతా ఫైనల్ మీదే ఉంది. బాగా ఆడటం, దేశం కోసం ప్రపంచకప్ గెలవడం ఒక్కటే ముఖ్యం. మంచు ప్రభావం లేనందున ఛేజింగ్ చేసినా, మొదట బ్యాటింగ్ చేసినా ఒకటే.     
 -ధోని
 
 రెండు నెలలుగా బంగ్లాదేశ్‌లో క్రికెట్ ఆడుతున్నాం. దీనివల్ల ఇక్కడి పరిస్థితులపై మాకు పూర్తి అవగాహన ఉంది. ఇదే వేదికలో ఆసియాకప్ గెలిచిన ఆత్మవిశ్వాసం మాలో ఉంది. ఎంత గొప్ప ఆటగాడైనా (కోహ్లిని ఉద్దేశించి) ఒక్క మంచి బాల్‌కు అవుట్ అవుతాడు. రేపు ఆ మంచి బాల్ నా దగ్గరి నుంచి వస్తుందని ఆశిస్తున్నా. చండి మల్‌తో సహా అందరూ ఫైనల్‌కు అందుబాటులో ఉన్నారు. ఒకవేళ చండిమల్ ఆడినా నేనే కెప్టెన్. ప్రాక్టీస్ మ్యాచ్‌లో విజయాన్ని పట్టించుకోనవసరం లేదు. అసలు మ్యాచ్‌లో పరిస్థితులు వేరే ఉంటాయి. తక్కువ తప్పులు చేసిన జట్టే ఎప్పుడైనా గెలుస్తుంది.     
 - మలింగ
 
  కీలక సమరం
 కోహ్లి    x మలింగ
 ఈ టోర్నీలో కోహ్లి ఇప్పటిదాకా చేసిన పరుగులు 242. ఐదు ఇన్నింగ్స్‌లో మూడు సార్లు అజేయంగా నిలిచి 3 అర్ధసెంచరీలతో 242 పరుగులు చేశాడు. మరోవైపు మలింగ 5 మ్యాచ్‌ల్లో తీసింది ఐదు వికెట్లు మాత్రమే.
 
  కానీ తన యార్కర్లతో ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. ముఖ్యంగా వెస్టిండీస్‌తో సెమీఫైనల్లో గేల్, స్మిత్‌లను బౌల్డ్ చేసి మ్యాచ్‌ను గెలిపించాడు. కోహ్లి, మలింగల మధ్య ఫైనల్లో ఎలాంటి సమరం జరుగుతుందనేది ఆసక్తికరం. సాధారణంగా మలింగపై ప్రతిసారీ కోహ్లి ఆధిపత్యం ప్రద ర్శిస్తాడు. ఈసారి ఆధిపత్యం ఎవరిదో!
 
 దిగ్గజాలకు ఆఖరి మ్యాచ్
 శ్రీలంక స్టార్ క్రికెటర్లు మహేళ జయవర్ధనే, కుమార సంగక్కర తమ ఆఖరి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ను నేడు ఆడబోతున్నారు. ఈ టోర్నీ తర్వాత ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు చెబుతామని ఇంతకు ముందే ఈ ఇద్దరూ ప్రకటించారు. దీంతో శ్రీలంక క్యాంప్‌లో వీళ్లిద్దరి విషయంలో ఎమోషన్స్ బాగా పెరిగాయి.
 
  ‘వాళ్లిద్దరూ ప్రపంచ క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లు. అలాంటి గొప్ప క్రికెటర్లకు వీడ్కోలు మ్యాచ్‌ను మేం సంతోషంతో ముగించాలని ఆశిస్తున్నాం’ అని లంక కెప్టెన్ మలింగ వ్యాఖ్యానించాడు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమయంలోనూ లంక ఆటగాళ్లు ఇదే మాట అన్నారు. టైటిల్ గెలిచి మురళీధరన్‌కు ఘనమైన వీడ్కోలు ఇస్తామని చెప్పారు. కానీ పాపం వాళ్ల ఆశ తీరలేదు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement