
పెర్త్ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఆధిక్యం 175 పరుగులకు చేరింది. భారత పేస్ బౌలర్ల ధాటిని తట్టుకొని.. ఉస్మాన్ ఖవాజా 40 పరుగులతో, ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టడంలో ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. షమీ రెండు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ 283 పరుగులకు ముగిసింది. 172/3 ఓవైర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లిసేన.. ఆదిలోనే అజింక్యా రహానే (51:105 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం హనుమ విహారితో కోహ్లి ఆచితూచి ఆడుతూ.. ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 214 బంతుల్లో 11 ఫోర్లతో కోహ్లి కెరీర్‌లో 25వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోతున్న ఈజోడిని హజల్‌వుడ్ దెబ్బతీశాడు. హనుమ విహారి(26)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో 5వ వికెట్‌కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
కోహ్లి ఔట్.. టీమిండియా ప్యాకప్..
థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి కోహ్లి బలవ్వడంతో భారత్ వికెట్లను చకచకా కోల్పోయింది. కమిన్స్ వేసిన 93వ ఓవర్ చివరి బంతి కోహ్లి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకండ్ స్లిప్‌లో ఉన్న హ్యాండ్స్‌కోంబ్ చేతిలో పడింది. అయితే బంతి మాత్రం నేలకు తాకిన సమయంలోనే ఫీల్డర్ చేతిలో పడినట్లు రిప్లేలో కనబడింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఔట్‌గా ప్రకటించాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన మహ్మద్ షమీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. చివరల్లో దాటిగా ఆడే ప్రయత్నం చేసిన పంత్.. టేలండర్ల సాయంతో 27 పరుగులు జోడించాడు. నాథన్ లయన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్ (36) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. చివరి వికెట్‌గా బుమ్రా ఔటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. 5 వికెట్లతో స్పిన్నర్ లయన్ భారత బ్యాట్స్‌మన్ పతనాన్ని శాసించాడు. స్టార్క్, హజల్‌వుడ్‌లకు రెండేసి వికెట్లు దక్కగా.. కమిన్స్‌కు ఒక వికెట్ దక్కింది.
అనంతరం 43 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ ఆరంభంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఓపెనర్ ఆరోన్ ఫించ్ గాయపడి.. రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. మహ్మద్ షమీ వేసిన 13వ ఓవర్ తొలిబంతి.. ఫించ్ కుడి చూపుడు వేలుకు బలంగా తగిలింది. దీంతో నొప్పితో విలవిలాడిన ఫించ్ మైదానం వీడాడు. అతన్ని ఎక్స్‌రే కోసం ఫిజియోలు ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రమైతే ఫించ్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్ట్ ఓడిన కంగారులకు ఫించ్ గాయం కంగారుపెడుతోంది. మరో ఓపెనర్ హారిస్ (20)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్ష్(5)ను షమీ పెవిలియన్‌కు చేర్చాడు. మరో ఆసీస్ బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌ను ఇషాంత్ శర్మ ఔట్ చేయగా.. ట్రావిస్ హేడ్‌ను షమీ పెవిలియన్‌కు పంపాడు.
Comments
Please login to add a commentAdd a comment