పరుగుల వరద ఆగలేదు | India vs New Zealand 2016, 3rd Test: Kohli, Rahane shine as India declare at 557/5 on Day 2 | Sakshi
Sakshi News home page

పరుగుల వరద ఆగలేదు

Published Mon, Oct 10 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

పరుగుల వరద ఆగలేదు

పరుగుల వరద ఆగలేదు

 విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ  రహానే భారీ శతకం
 365 పరుగుల రికార్డు భాగస్వామ్యం
 తొలి ఇన్నింగ్స్ లో భారత్ 557/5 డిక్లేర్డ్
 న్యూజిలాండ్‌తో చివరి టెస్టు   

 
 విరాట్ కోహ్లి ఎక్కడా తగ్గలేదు... సెంచరీ నుంచి అలవోకగా డబుల్ సెంచరీ మైలురాయిని అందుకొని తన ఆటను, స్థాయిని ప్రదర్శించాడు. ద్విశతకం కొట్టి నాలుగు టెస్టులే అయింది. అంతలోనే బ్యాటింగ్‌లో తడబడుతున్నారని అనేశారు... కానీ భారీ స్కోరు ఎంతో దూరంలో లేదని ఈ మ్యాచ్‌కు ముందు చెప్పిన కోహ్లి, ఇప్పుడు దానిని చేసి చూపించాడు. మరోసారి డబుల్ సెంచరీతో గతంలో భారత కెప్టెన్‌గా ఎవరికీ సాధ్యం కాని ఘనతను సాధించాడు.
 
 బౌన్సర్లు శరీరాన్ని బలంగా తాకాయి... షార్ట్ పిచ్ బంతులు ఒంటిపై ముద్రలు వేశాయి... కానీ రహానే తొణకలేదు. అతని పట్టుదల ముందు ప్రత్యర్థి బౌలర్లు తేలిపోయారు. అతని అంకితభావానికి పరుగులు దాసోహమయ్యాయి. త్రుటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నా అమూల్యమైన ఇన్నింగ్స్ తో రహానే తన విలువేమిటో చూపించాడు.
 
 ఒకరితో మరొకరు పోటీ పడుతూ సాగిన కోహ్లి, రహానేల కళాత్మక బ్యాటింగ్ పలు రికార్డులను తుడిచి పెట్టేసింది. ఏకంగా 365 పరుగులతో భారత్ తరఫున నాలుగో వికెట్‌కు వీరిద్దరు అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి ఆటతో మూడో టెస్టుపైనా రెండో రోజే భారత్ పట్టు బిగించగా... ఇక కివీస్ ఏ మాత్రం పోరాడుతుందనేది ఆసక్తికరం.  
 
 ఇండోర్: మూడో టెస్టులో తొలిరోజే మొదలైన భారత్ పరుగుల ప్రవాహం రెండో రోజూ ఆగలేదు. కోహ్లి, రహానే అద్భుత ఆటతో న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లోనూ దాదాపుగా చేతులెత్తేసింది. ఆదివారం భారత్ తమ తొలి ఇన్నింగ్‌‌సను 5 వికెట్ల నష్టానికి 557 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (366 బంతుల్లో 211; 20 ఫోర్లు) డబుల్ సెంచరీ సాధించగా, అజింక్య రహానే (381 బంతుల్లో 188; 18 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆ అవకాశం కోల్పోయాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 365 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత రోహిత్ శర్మ (63 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్‌‌స ఆడాడు. అనంతరం న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. గప్టిల్ (17), లాథమ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుత భారత స్కోరు, పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న తీరు చూస్తే మూడో రోజు కివీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు.
 
 తొలి సెషన్: తగ్గని దూకుడు
 ఓవర్‌నైట్ స్కోరు 267/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ అదే జోరు కొనసాగించింది. కోహ్లి, రహానే ఇద్దరూ ఒకరితో మరొకరు పోటీ పడుతూ అలవోకగా పరుగులు సాధించారు. పేసర్ హెన్రీ మాత్రం వరుసగా షార్ట్ పిచ్ బంతులతో రహానేను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రహానే 210 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్‌లో ఇది ఎనిమిదో సెంచరీ కావడం విశేషం. కివీస్ బౌలర్లు పూర్తిగా విఫలం కావడంతో కోహ్లి, రహానే చకచకా పరుగులు తీశారు. ఈ సెషన్‌లో ఆ జట్టు కనీసం ఒక్క మెరుుడిన్ ఓవర్ కూడా వేయలేకపోయింది.  
 ఓవర్లు: 27, పరుగులు: 91, వికెట్లు: 0

 రెండో సెషన్:  కోహ్లి డబుల్
 లంచ్ అనంతరం భారత బ్యాట్స్‌మెన్ మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. 273 బంతుల్లో 150 పరుగుల మార్క్ చేరుకున్న కోహ్లి తనదైన శైలిలో చూడచక్కటి షాట్లు ఆడాడు. నీషమ్ బౌలింగ్‌లో కొట్టిన కవర్‌డ్రైవ్, సాన్‌ట్నర్ ఓవర్లో ఆడిన రివర్స్ షాట్ అతని ఇన్నింగ్‌‌సలో హైలైట్‌గా నిలిచాయి. ఎట్టకేలకు హెన్రీ వేసిన బంతిని డీప్ స్క్వేర్ దిశగా పంపి 347 బంతుల్లో కోహ్లి డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతవిధాలా ప్రయత్నించినా ఈ జోడీని విడదీయలేకపోయిన న్యూజిలాండ్, ఈ టెస్టులో వరుసగా మూడో సెషన్‌లో కూడా వికెట్ పడగొట్టడంలో విఫలమైంది.
 ఓవర్లు: 30, పరుగులు: 98, వికెట్లు: 0
 
 మూడో సెషన్: రహానే మిస్
 విరామం తర్వాత తొలి ఓవర్లోనే కోహ్లి అద్భుత ఇన్నింగ్‌‌స ముగిసింది. పటేల్ బౌలింగ్‌లో అతను వికెట్ల ముందు దొరిగిపోవడంతో రికార్డు భాగస్వామ్యానికి తెర పడింది. మరో వైపు ద్విశతకం దిశగా దూసుకుపోరుున రహానేను దురదృష్టం వెంటాడింది. బౌల్ట్ వేసిన బంతిని డ్రైవ్ చేయబోయి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో రహానే డబుల్ అవకాశాన్ని కోల్పోయాడు. ఈ దశలో రోహిత్ దూకుడుగా ఆడి భారత్ మరింత భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి జడేజా (17 నాటౌట్)నుంచి మంచి సహకారం లభించింది. వీరిద్దరు 9.5 ఓవర్లలోనే ఆరో వికెట్‌కు 53 పరుగులు జోడించడం విశేషం. 62 బంతుల్లో రోహిత్ సిరీస్‌లో మూడో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ వెంటనే భారత ఇన్నింగ్స్ ను కోహ్లి డిక్లేర్ చేశాడు. అనంతరం న్యూజిలాండ్ ఓపెనర్లు జాగ్రత్తగా ఇన్నింగ్‌‌స ఆరంభించారు. కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదురైనా వారిద్దరు వికెట్ పడకుండా ఆటను ముగించగలిగారు.   
  ఓవర్లు: 22, పరుగులు: 101, వికెట్లు: 2 (భారత్)
 ఓవర్లు: 9, పరుగులు: 28, వికెట్లు: 0 (కివీస్)
 
 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్ : విజయ్ (సి) లాథమ్ (బి) పటేల్ 10; గంభీర్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 29; పుజారా (బి) సాన్‌ట్నర్ 41; కోహ్లి (ఎల్బీ) (బి) పటేల్ 211; రహానే (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 188; రోహిత్ (నాటౌట్) 51; జడేజా (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (169 ఓవర్లలో 5 వికెట్లకు డిక్లేర్డ్) 557.
 
 వికెట్ల పతనం: 1-26; 2-60; 3-100; 4-465; 5-504. బౌలింగ్: బౌల్ట్ 32-2-113-2; హెన్రీ 35-3-127-0; పటేల్ 40-5-120-2; సాన్‌ట్నర్ 44-4-137-1; నీషమ్ 18-1-53-0.

 న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్  :  గప్టిల్ (బ్యాటింగ్) 17; లాథమ్ (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 28.
 
 బౌలింగ్: షమీ 2-0-5-0; ఉమేశ్ 2-0-7-0; అశ్విన్ 3-1-9-0; జడేజా 2-1-2-0.  
 
 ఓకే రహానే
 రెండో రోజు ఆటలో మొదటినుంచి రహానేపై హెన్రీ వరుసగా షార్ట్ పిచ్ బంతులు సంధించాడు. ఆరో ఓవర్లో హెన్రీ విసిరిన బౌన్సర్ నుంచి తప్పించుకునే క్రమంలో రహానే తల వెనక్కి తిప్పినా, పూర్తిగా నియంత్రణలో లేకపోయాడు. దాంతో బంతి నేరుగా అతని హెల్మెట్ వెనుక భాగంలో సరిగ్గా చెవి పైన బలంగా తగిలింది. దాంతో అతను కొద్దిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే హెన్రీతో పాటు ఇతర కివీస్ ఆటగాళ్లు ఆందోళనగా బ్యాట్స్‌మన్ వద్దకు వచ్చేశారు. అయితే ఫిజియో స్వల్ప చికిత్స తర్వాత రహానే సాధారణ స్థితికి వచ్చేశాడు. అయితే ఆ తర్వాతి బంతిని కూడా హెన్రీ బౌన్సర్ విసరడం విశేషం!  
 
 ఈ ఇన్నింగ్‌‌స నాకెంతో ప్రత్యేకం. చిరకాలం గుర్తుండిపోతుంది. 100/3 నుంచి మరో 365 పరుగులు జోడించడం నిజంగా అద్భుతం. తొలి రోజుతో పోలిస్తే ఈ రోజు చాలా స్వేచ్ఛగా ఆడాను. షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పడిన మాట వాస్తవం. దీనిని ఒప్పుకోవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదు. అయితే పట్టుదలగా నిలబడగలిగా. అందుకే ఈ సెంచరీ అమితానందం ఇస్తే, టెస్టు క్రికెట్ గొప్పతనం ఏమిటో కూడా నాకు తెలిసింది.
  - రహానే
 
 జడేజాకు జరిమానా  
 పదే పదే హెచ్చరించిన తర్వాత కూడా పిచ్‌పై పరుగెత్తిన జడేజాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. అంపైర్లు ఫిర్యాదుపై స్పందిస్తూ... జడేజా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతతో పాటు 3 డీ మెరిట్ పాయింట్లు శిక్షగా విధించింది. రెండేళ్ల లోపు ఈ పాయింట్ల సంఖ్య 4కు చేరితే తీవ్రతను బట్టి మ్యాచ్ నిషేధానికి గురయ్యే అవకాశం ఉంది.  
 
 భారత్ తరఫున నాలుగో వికెట్‌కు ఇదే (365) అత్యుత్తమ భాగస్వామ్యం. గతంలో సచిన్, లక్ష్మణ్ నెలకొల్పిన (353-సిడ్నీ) భాగస్వామ్యాన్ని కోహ్లి, రహానే అధిగమించారు.
 
 భారత్ తరఫున ఏ వికెట్‌కై నా ఇది ఐదో అత్యుత్తమ భాగస్వామ్యం.
 
 కెప్టెన్‌గా రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకై క భారత ఆటగాడు కోహ్లి. సచిన్ (2010) తర్వాత ఒకే ఏడాది రెండు డబుల్ సెంచరీలు భారత బ్యాట్స్‌మన్ కూడా అతనే.
 
 జడేజా కావాలనే చేశాడా!  
 భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత న్యూజిలాండ్ ఓపెనర్లు బ్యాటింగ్ చేసేందుకు అప్పుడే క్రీజ్‌లోకి వస్తున్నారు. ఇంకా మన ఫీల్డర్లు పూర్తిగా సిద్ధం కూడా కాలేదు. ఒక్క బంతి కూడా పడలేదు. కానీ స్కోరు బోర్డు మాత్రం 5/0గా చూపించింది! ఇవి భారత్‌కు అంపైర్లు విధించిన పెనాల్టీ పరుగులు. అంతకు కొద్దిసేపు ముందు రవీంద్ర జడేజా పిచ్‌పై పరుగెత్తినందుకు శిక్షగా ఆట ఆరంభానికి ముందే కివీస్ స్కోరులో ఐదు పరుగులు వచ్చి చేరారుు. తను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జడేజా షాట్ ఆడి పిచ్‌పైనుంచే పరుగు తీశాడు.

ఒకసారి హెచ్చరించిన అంపైర్లు రెండో సారి అలాగే చేయడంతో పెనాల్టీని విధించారు. ఇది పాత నిబంధనే అరుునా చాలా అరుదుగా మాత్రమే అమల్లో కనిపించింది. అయితే పొరపాటున కాకుండా పిచ్ నుంచి మరింత సహకారం పొందేందుకు జడేజా కావాలని దీనిని చేసినట్లు కూడా వినిపించింది! సరిగ్గా క్రీజ్‌కు సమీపంలో ఫుట్ మార్క్‌లు ఏర్పడటం వల్ల బంతి విపరీతంగా టర్న్ అయి స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. అలాంటి పరిస్థితిని సృష్టించేందుకే ’సర్’ ఇలాంటి వ్యూహం పాటించాడా అనేదే సందేహం!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement