ఊహించినట్లే జరిగింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టింది. ఆతిథ్య ఒమన్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ‘ఢీ’కొనేందుకు సిద్ధమైంది.
మస్కట్: యువ ఆటగాడు దిల్‌ప్రీత్ సింగ్ ‘హ్యాట్రిక్’ సాధించడంతో... ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. ఒమన్ జట్టుతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 11–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ (41వ, 55వ, 57వ నిమిషాల్లో) మూడు గోల్స్ చేయగా... లలిత్ ఉపాధ్యాయ్(17వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (22వ ని.లో), నీలకంఠ శర్మ (23వ ని.లో), మన్‌దీప్ సింగ్ (30వ ని.లో), గుర్జంత్ సింగ్ (37వ ని.లో), ఆకాశ్‌దీప్ సింగ్ (48వ ని.లో), వరుణ్ కుమార్ (49వ ని.లో), చింగ్లేన్‌సనా (53వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ‘హ్యాట్రిక్’ హీరో 18 ఏళ్ల దిల్‌ప్రీత్ సింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది.
గతంలో ఒమన్‌తో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకొని అన్నింటా విజయాలు నమోదు చేసిన భారత్ ఈసారీ అదే జోరును కొనసాగించింది. 15 నిమిషాల తొలి క్వార్టర్‌లో ఖాతా తెరువలేకపోయిన భారత్ ఆ తర్వాతి మూడు క్వార్టర్స్‌లో గోల్స్ వర్షం కురిపించింది. భారత్ దూకుడు పెంచడంతో ఆరంభంలో కాస్త పోటీనిచ్చిన ఒమన్ ఆ తర్వాత చేతులెత్తేసింది. ‘ఇది నా వ్యక్తిగత ప్రతిభ కాదు. తోటి ఆటగాళ్ల సహకారంతోనే నేను మూడు గోల్స్ చేశాను’ అని కెరీర్‌లో తొలిసారి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు పొందిన దిల్‌ప్రీత్ వ్యాఖ్యానించాడు. మరోవైపు చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ మాట్లాడుతూ భారీ విజయంతో బోణీ చేయాలన్న లక్ష్యంతోనే బరిలోకి దిగినట్లు తెలిపారు. అయితే తొలి క్వార్టర్‌లో భారత ప్రదర్శనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘శుభారంభంతో సంతోషంగా ఉన్నాను. అయితే తొలి క్వార్టర్‌లో మేము సరిగ్గా ఆడలేదు. నేడు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఆసియా క్రీడల సెమీఫైనల్లో మలేసియా చేతిలో ఓటమి తర్వాత కొన్ని రోజులపాటు ఆటగాళ్లు నిరాశగా ఉన్నారు. అయితే గతం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఫలితం ఉండదు. ప్రస్తుతం మా దృష్టి ఈ టోర్నమెంట్‌పైనే ఉంది’ అని హరేంద్ర సింగ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment