
శతక్కొట్టారు
► విరాట్, ధావన్ వీరోచిత సెంచరీలు
► తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 375 ఆలౌట్
► రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 5/2
పరుగుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న కోహ్లితో పాటు శిఖర్ ధావన్ కూడా తొలి టెస్టులో సత్తా చాటాడు. లంక బ్యాట్స్‌మెన్ విఫలమైన వికెట్‌పై ఇద్దరూ శతకాల మోత మోగించారు. స్పిన్నర్ అశ్విన్ ఇచ్చిన ఆరంభాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకుని మ్యాచ్‌లో పట్టు బిగించారు. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన లంకేయులు రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ఆటతీరుతో ఎదురీదుతున్నారు.
గాలే: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో లంకేయులను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన టీమిండియా బ్యాటింగ్‌లోనూ తడాఖా చూపెట్టింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (271 బంతుల్లో 134; 13 ఫోర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లి (191 బంతుల్లో 103; 11 ఫోర్లు) శతకాలు బాదడంతో గురువారం రెండోరోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 117.4 ఓవర్లలో 375 పరుగులకు ఆలౌటైంది. దీంతో కోహ్లిసేనకు 192 పరుగుల ఆధిక్యం దక్కింది. సాహా (120 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక రెండో ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లలో 2 వికెట్లకు 5 పరుగులు చేసింది. ప్రసాద్ (3 బ్యాటింగ్), సంగక్కర (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు కరుణరత్నే (0), జేకే సిల్వా (0)లు విఫలమయ్యారు. తొలి ఓవర్ నుంచే స్పిన్ అటాక్‌ను దించిన కోహ్లి లంకపై ఒత్తిడి పెంచాడు. ఫలితంగా 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం మ్యాథ్యూస్‌సేన ఇంకా 187 పరుగులు వెనుకబడి ఉంది.
భారీ భాగస్వామ్యం
అంతకుముందు 128/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ధావన్, కోహ్లి నిలకడగా ఆడారు. లంక పేసర్లు, స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొంటూ భారత్‌కు భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో ధావన్ 178 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అయితే 227/2 స్కోరుతో లంచ్‌కు వెళ్లిన భారత్ రెండో సెషన్‌లో తడబడింది. 187 బంతుల్లో కెరీర్‌లో 11వ శతకం సాధించిన కోహ్లి.. కౌశల్ బంతిని స్వీప్ చేయబోయి అవుటయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు ధావన్‌తో కలిసి నెలకొల్పిన 227 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత స్వల్ప విరామాల్లో రహానే (0)తో పాటు ధావన్ కూడా వెనుదిరగడంతో భారత్ స్కోరు 294/5గా మారింది. ఈ దశలో సాహా నిలకడను చూపెట్టినా... అశ్విన్ (7), హర్భజన్ (14), మిశ్రా (10)లు తక్కువ స్కోరుకే అవుటయ్యారు. సహచరుల నుంచి సహకారం లేకపోవడంతో ఒత్తిడికి లోనైన సాహా స్కోరు పెంచే ప్రయత్నంలో వికెట్ చేజార్చుకున్నాడు. ఆ వెంటనే ఆరోన్ (4) కూడా వెనుదిరగడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఓవరాల్‌గా కోహ్లిసేన 73 పరుగుల తేడాలో చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. కౌశల్‌కు 5, ప్రదీప్‌కు 3 వికెట్లు దక్కాయి.
స్కోరు వివరాలు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 183 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ ఎల్బీడబ్ల్యు (బి) ప్రసాద్ 7; ధావన్ (బి) ప్రదీప్ 134; రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) మ్యాథ్యూస్ 9; కోహ్లి ఎల్బీడబ్ల్యు (బి) కౌశల్ 103; రహానే ఎల్బీడబ్ల్యు (బి) కౌశల్ 0; సాహా (సి) చండిమల్ (బి) ప్రదీప్ 60; అశ్విన్ (బి) ప్రదీప్ 7; హర్భజన్ (బి) కౌశల్ 14; మిశ్రా (బి) కౌశల్ 10; ఇషాంత్ నాటౌట్ 3; ఆరోన్ (సి) మ్యాథ్యూస్ (బి) కౌశల్ 4; ఎక్స్‌ట్రాలు: 24; మొత్తం: (117.4 ఓవర్లలో ఆలౌట్) 375.
వికెట్ల పతనం: 1-14; 2-28; 3-255; 4-257; 5-294; 6-302; 7-330; 8-344; 9-366; 10-375.
బౌలింగ్: ప్రసాద్ 22-4-54-1; ప్రదీప్ 26-2-98-3; మ్యాథ్యూస్ 4-1-12-1; కౌశల్ 32.4-2-134-5; హెరాత్ 33-4-67-0.
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: కరుణరత్నే (బి) అశ్విన్ 0; సిల్వ (బి) మిశ్రా 0; ప్రసాద్ బ్యాటింగ్ 3; సంగక్కర బ్యాటింగ్ 1; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: (4 ఓవర్లలో 2 వికెట్లకు) 5.
వికెట్ల పతనం: 1-0; 2-1.
బౌలింగ్: అశ్విన్ 2-2-0-1; మిశ్రా 1-0-1-1; హర్భజన్ 1-0-4-0.