ఒక్క బంతీ పడలేదు..!
వర్షంతో మూడో టి20 రద్దు
సిరీస్ 2-0తో దక్షిణాఫ్రికా సొంతం
ఆదివారం తొలి వన్డే
కోల్‌కతా: టి20 సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయినా... చివరి మ్యాచ్‌లో నెగ్గి కాస్త పరువు దక్కించుకుందామని భావించిన భారత్‌కు ఆశాభంగం కలిగింది. దక్షిణాఫ్రికాతో గురువారం ఇక్కడ జరగాల్సిన మూడో టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం కొద్దిసేపే పడినా... అవుట్ ఫీల్డ్ అనుకూలంగా లేకపోవడంతో ఆట సాధ్యం కాలేదు. గ్రౌండ్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా బౌండరీ సమీపంలో మైదానం చిత్తడిగానే ఉండిపోయింది. అంపైర్లు గంటకు ఒక సారి చొప్పున మొత్తం మూడు సార్లు మైదానాన్ని పరీక్షించారు.
చివరకు 9.30 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా టాస్ వేయకుండా, ఒక్క బంతి కూడా పడకుండానే కోల్‌కతా మ్యాచ్ కథ ముగిసిపోయింది. దీంతో 2-0తో టి20 సిరీస్ దక్షిణాఫ్రికా ఖాతాలో చేరింది. జేపీ డుమినికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. సిరీస్ కోల్పోయి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగునుంచి ఆరో స్థానానికి పడిపోగా, దక్షిణాఫ్రికా ఐదో స్థానానికి చేరింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం కాన్పూర్‌లో తొలి మ్యాచ్ జరుగుతుంది.
ఈ మ్యాచ్‌లో రహానేతో ఓపెనింగ్ చేయించాలని, రైనాను మూడో స్థానంలో పంపాలని... మిశ్రా, బిన్నీలను ఆడించాలని కూడా నిర్ణయించాం. అయితే అది సాధ్యం కాలేదు. ఇలాంటి వేదికకు వచ్చి మ్యాచ్ ఆడకపోవడం అసంతృప్తి కలిగించింది. ఇక్కడి అవుట్ ఫీల్డ్ చాలా మారాల్సి ఉంది. వన్డేల్లోనూ మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్ కీలకమే. సొంతగడ్డపై సిరీస్ కాబట్టి పిచ్‌లపై పచ్చిక ఉండాలని కోరుకోవడం లేదు. -ధోని, భారత కెప్టెన్
మ్యాచ్ సాధ్యం కాకపోవడంతో నిరాశ చెందాం. అయితే ఇలాంటి సుదీర్ఘ పర్యటనంలో ఆటగాళ్లు గాయాల పాలు కాకుండా ఉండటం కూడా ముఖ్యం. భారత్‌లో సిరీస్ గెలవడం అంత సులువు కాదు. మా నలుగురు పేసర్లు కూడా బాగా ఆడారు. ఈ విజయం వన్డేల్లో మా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది
- డు ప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్