రాంచీ : ఇంకో రెండు వికెట్లు పడగొడితే మూడో టెస్టులోనూ టీమిండియానే విజయం సాధిస్తుంది. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లి సేన విజయం దాదాపు ఖాయమైంది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో సపారీ జట్టుకు వైట్‌వాష్ తప్పేలా లేదు. ఇప్పటికే విశాఖ, పుణే టెస్టుల్లో ఘన విజయాలు అందుకున్న కోహ్లి సేనకు రాంచీ టెస్టులో భారీ విజయం ముంగిట నిలిచింది. ఆటను మూడో రోజు ముగించాలని చేసిన టీమిండియా, అంపైర్ల ప్రయత్నాలకు సఫారీ ఆటగాళ్లు డి బ్రూయిన్(30 బ్యాటింగ్), నోర్ట్జే(5 బ్యాటింగ్)లు అడ్డుపడ్డారు. మూడో రోజు ఆటముగిసే సమయానికి సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇంకా 203 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లు కేవలం ఒక్క రోజులోనే 16 వికెట్లు పడగొట్టి దకిణాఫ్రికా జట్టు పతనాన్ని శాసించారు.
తొలి ఇన్నింగ్స్ సాగింది ఇలా..
ఓవర్ నైట్ స్కోర్ 9/2తో మూడో రోజు ఆటను ప్రారంభించిన సఫారీ జట్టుకు ఆరంభంలోనే ఉమేశ్ యాదవ్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. డుప్లెసిస్(1) బౌల్డ్ చేశాడు. ఆపై హమ్జా-బావుమాల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 91 పరుగులు జత చేసిన తర్వాత హమ్జా(62), బావుమా(32)లు వెంట వెంటనే ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా పతనం తిరిగి ప్రారంభమైంది. క్లాసెన్(6), పీయడ్త్(4), రబడా(0)లు స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. అయితేలిండే(37;81 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్)చాలాసేపు ప్రతిఘటించాడు.
అతనికి నోర్ట్జే నుంచి సహకారం లభించింది. వీరిద్దరూ సుమారు 18 ఓవర్లు క్రీజ్‌లో ఉన్నారు. కాగా, లిండే తొమ్మిదో వికెట్‌గా ఔటైన తర్వాత నోర్ట్జే(4; 55 బంతులు) చివరి వికెట్‌గా ఔటయ్యాడు. దీంతో 162 పరుగులకే సఫారీ జట్టు ఆలౌట్ కావడంతో ఆ జట్టును టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఫాలోఆన్‌కు ఆహ్వానించాడు. కాగా టీమిండియాకు 335 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, షమీ, నదీమ్, జడేజాలు తలో రెండు వికెట్లు తీశారు.
వాళ్లు తీరు మార్చుకోలేదు.. మనోళ్ల ఊపు తగ్గలేదు..
భారీ ఆధిక్యం ఉండటంతో ప్రత్యర్థి జట్టును ఫాలోఆన్ ఆడించాలన్న సారథి నిర్ణయాం సరైనదే అంటూ బౌలర్లు నిరూపించారు. సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే డికాక్(5)ను ఉమేశ్ ఔట్ చేసి వికెట్ల వేటను ప్రారంభించాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్ భారత బౌలర్ల జోరుకు పెవిలియన్‌కు క్యూ కట్టారు. వరుసగా హమ్జా(0), డుప్లెసిస్(4), బవుమా(0), క్లాసెన్5) వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో 36 పరుగులకే ఐదు వికెట్ల కోల్పోయి సఫారీ జట్టు కష్టాల్లో పడింది. అయితే ఉమేశ్ బౌలింగ్‌లో ఎల్గర్(16) తలకు గాయం కావడంతో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా డిబ్రూయిన్ క్రీజులోకి వచ్చాడు.
అయితే లిండే(27), పీట్(30), రబడ(12)లు కాసేపు మెరుపులు మెరిపించినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేదు. దీంతో ఆట మూడో రోజు ముగస్తుందని అందరూ భావించారు. అయితే డిబ్రూయిన్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ విజయాన్ని నాలుగో రోజుకు వాయిదా వేయించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ రెండు, రవీంద్ర జడేజా, అశ్విన్‌లు తలో వికెట్ పడగొట్టారు.
సాహాకు గాయం.. పంత్ కీపింగ్ భాద్యతలు
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ వేసిన 27 ఓవర్ తొలి బంతిని అందుకునే క్రమంలో సాహా వేలికి గాయమైంది. గాయంతో విలవిలాడిన సాహాకు ఫిజియో ప్రాథమిక చికిత్స అందించాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఫిజియోతో కలిసి సాహా మైదానాన్ని వీడాడు. దీంతో స్టాండ్ బై కీపర్‌గా ఉన్న రిషభ్ పంత్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment