జైత్రయాత్రకు బ్రేక్‌ | India vs South Africa, Women's cricket World Cup 2017, full score: SA thrash IND by 115 runs | Sakshi
Sakshi News home page

జైత్రయాత్రకు బ్రేక్‌

Published Sun, Jul 9 2017 1:14 AM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM

జైత్రయాత్రకు బ్రేక్‌

జైత్రయాత్రకు బ్రేక్‌

దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌కు పరాభవం
115 పరుగుల తేడాతో ఓడిన మిథాలీ బృందం
లిజెల్లీ లీ మెరుపు ఇన్నింగ్స్‌
డేన్‌ నికెర్క్‌ మాయాజాలం


మిథాలీ సేన విజయ పరంపరకు బ్రేక్‌ పడింది. వరుస విజయాలతో దూసుకెళుతోన్న భారత మహిళల జట్టు అనూహ్యంగా దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. మొదట బ్యాట్‌తో లిజెల్లీ లీ చెలరేగగా... కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నికెర్క్‌ బంతితో మాయాజాలం చేసింది. దాంతో అన్ని విభాగాల్లో విఫలమైన భారత్‌ చేతులెత్తేసి భారీ ఓటమిని మూటగట్టుకుంది. భారత్‌ సెమీస్‌ చేరుకోవాలంటే ఈనెల 12న ఆసీస్‌తో, 15న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో విజయం సాధించాల్సి ఉంటుంది.  

లీసెస్టర్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో మిథాలీ సేనను కంగుతినిపించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 115 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 273 పరుగులు చేసింది. లిజెల్లీ లీ (65 బంతుల్లో 92; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగింది. కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నికెర్క్‌ (66 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించింది. శిఖా పాండే 3 వికెట్లు తీసింది. తర్వాత భారత్‌ 46 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ (111 బంతుల్లో 60; 5 ఫోర్లు) పోరాడగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వాన్‌ నికెర్క్‌ 4 వికెట్లు పడగొట్టి భారత్‌ను దెబ్బ తీసింది.

లిజెల్లీ లీ మెరుపులు...
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే శిఖా పాండే షాక్‌ ఇచ్చింది. తన తొలి ఓవర్లోనే ఓపెనర్‌ లౌరా వొల్వార్డ్‌ (1)ను బౌల్డ్‌ చేసింది. దీంతో క్రీజ్‌లో ఉన్న ఓపెనర్‌ లిజెల్లీకి త్రిశా చెట్టీ (24) జతకాగా, పరుగుల వేగం మందగించింది. తొలి ఐదు ఓవర్లు ముగిసేసరికి జట్టు 16/1 స్కోరు చేసింది. శిఖా వేసిన ఆరో ఓవర్లో లిజెల్లీ ఒక్కసారిగా 2 ఫోర్లు, సిక్సర్‌తో జోరు పెంచింది. ఇక్కడితో మొదలైన ఆమె ‘షో’ ఇక ఏ దశలోనూ ఆగలేదు. లిజెల్లీ 49 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మరింత వేగంగా ఆడటంతో మిగతా 42 పరుగుల్ని కేవలం 16 బంతుల్లోనే చేసింది. జట్టు స్కోరు 134 పరుగుల వద్ద ఆమె మూడో వికెట్‌గా నిష్క్రమించింది. ఇందులో లిజెల్లీవే 92 పరుగులుండటం విశేషం. ఆ తర్వాత వాన్‌ నికెర్క్‌... డు ప్రీజ్‌ (22), ట్రియాన్‌ (24)లతో కలిసి జట్టు స్కోరును 250 పరుగుల్ని దాటించింది.

మూకుమ్మడిగా...
గెలిస్తే సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకునే మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ మూకుమ్మడిగా చేతులెత్తేశారు. ఓపెనర్‌ స్మృతి మంధన (4) వరుసగా మూడో మ్యాచ్‌లో విఫలం కాగా... జట్టు స్కోరు 47 పరుగుల వరకు బాగానే సాగింది. అదే స్కోరుపై  ఓపెనర్‌ పూనమ్‌ రౌత్‌ (22)ను అయబొంగ ఖాకా బౌల్డ్‌ చేసింది. అక్కడితో భారత్‌ పతనం వేగమైంది. నిలకడగా ఆడుతూ అర్ధసెంచరీల రికార్డును సాధించి న కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (0) తొలి బంతికే డకౌటైంది. విండీస్‌తో మ్యాచ్‌లో పరుగులే ఇవ్వకుండా 4 వికెట్లు తీసిన లెగ్‌ స్పిన్నర్‌ వాన్‌ నికెర్క్‌ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో మిథాలీని, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (0)ను డకౌట్‌ చేసింది. తర్వాత వేద కృష్ణమూర్తి (3)ని అయబొంగ ఖాకా, శిఖా పాండే (0)ను నికెర్క్‌ పెవిలియన్‌కు పంపారు. సుష్మా వర్మ (1) రనౌట్‌ కావడంతో 65 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ దీప్తి శర్మ, జులన్‌ (79 బంతుల్లో 43 నాటౌట్‌; 6 ఫోర్లు) కాసేపు పోరాడినా భారత్‌ను ఓటమి నుంచి తప్పించలేకపోయారు.

స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: వోల్‌వార్ట్‌ (బి) శిఖా పాండే 1; లిజెల్లీ లీ ఎల్బీడబ్ల్యూ (బి) హర్మన్‌ప్రీత్‌ 92, త్రిశా చెట్టి (సి) జులన్‌ (బి) ఏక్తా బిష్త్‌ 24; డు ప్రీజ్‌ (స్టంప్డ్‌) సుష్మ (బి) పూనమ్‌ యాదవ్‌ 22; మరిజన్‌ కాప్‌ (బి) హర్మన్‌ప్రీత్‌ 19; వాన్‌ నికెర్క్‌ (సి) స్మృతి (బి) శిఖా పాండే 57; సునే లూస్‌ (సి) వేద (బి) జులన్‌ 16; క్లో ట్రియాన్‌ (సి) జులన్‌ (బి) శిఖా పాండే 24; షబ్నిమ్‌ (స్టంప్డ్‌) సుష్మ (బి) ఏక్తా బిష్త్‌ 5; అయబొంగ ఖాకా నాటౌట్‌ 7; మొసెలిన్‌ డానియెల్స్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 273.

వికెట్ల పతనం: 1–1, 2–92, 3–134, 4–160, 5–162, 6–203, 7–252, 8–265, 9–265.
బౌలింగ్‌: జులన్‌ గోస్వామి 10–0–53–1, శిఖా పాండే 9–0–40–3, ఏక్తా బిష్త్‌ 9–1–68–2, పూనమ్‌ యాదవ్‌ 10–1–31–1, దీప్తి శర్మ 8–0–61–0, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 4–0–18–2.

భారత్‌ ఇన్నింగ్స్‌: పూనమ్‌ రౌత్‌ (బి) అయబొంగ ఖాకా 22; స్మృతి (సి) షబ్నిమ్‌ (బి) మరిజన్‌ కాప్‌ 4; దీప్తి శర్మ (సి) మొసెలిన్‌ (బి) వాన్‌ నికెర్క్‌ 60; మిథాలీ రాజ్‌ (బి) వాన్‌ నికెర్క్‌ 0; హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఎల్బీడబ్ల్యూ (బి) వాన్‌ నికెర్క్‌ 0; వేద (బి) అయబొంగ ఖాకా 3; శిఖా పాండే (స్టంప్డ్‌) త్రిశా చెట్టి (బి) వాన్‌ నికెర్క్‌ 0; సుష్మ రనౌట్‌ 1, జులన్‌ నాటౌట్‌ 43; ఏక్తా బిష్త్‌ (సి) వాన్‌ నికెర్క్‌ (బి) లూస్‌ 13; పూనమ్‌ యాదవ్‌ (సి) త్రిశా చెట్టి (బి) షబ్నిమ్‌ 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (46 ఓవర్లలో ఆలౌట్‌) 158.

వికెట్ల పతనం: 1–4, 2–47, 3–48, 4–48, 5–53, 6–56, 7–65, 8–118, 9–155, 10–158. బౌలింగ్‌: షబ్నిమ్‌ 9–1–18–1, మరిజన్‌ కాప్‌ 8–1–31–1, అయబొంగ ఖాకా 10–1–33–2, డానియెల్స్‌ 3–0–21–0, వాన్‌ నికెర్క్‌ 10–0–22–4, లూస్‌ 6–1–27–1.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement