‘రిహార్సల్స్’ కొనసాగింపు!
వరల్డ్‌కప్‌కు రిహార్సల్స్‌గా సాగుతున్న పొట్టి క్రికెట్ మ్యాచ్‌ల పోరులో ఆస్ట్రేలియాతో మనోళ్లు క్లీన్‌స్వీప్ చేసేశారు. మరో రెండు వారాల తర్వాత ఆసియా కప్‌లో కనీసం నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆలోగా భారత్ కోసం మరో అంకం సిద్ధంగా ఉంది. అదే శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్. బంగ్లాదేశ్‌లో జరిగే ఆసియా కప్‌తో పోలిస్తే ప్రపంచకప్‌లోపు సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడటం ధోని సేనకు కచ్చితంగా లాభిస్తుంది. ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్‌తో పాటు పరిస్థితులపై కూడా అవగాహన వస్తుంది. ఇదే ఆలోచనతో మరో క్లీన్‌స్వీప్‌పై దృష్టి పెట్టిన టీమిండియా సిరీస్ గెలిస్తే నంబర్‌వన్ ర్యాంక్‌నూ నిలబెట్టుకుంటుంది.
* సొంతగడ్డపై భారత్ వరల్డ్‌కప్ సన్నాహాలు
* రేపటినుంచి శ్రీలంకతో టి20 సిరీస్
సాక్షి క్రీడా విభాగం: వన్డేల్లో అలా వ్యాహ్యాళికి వెళ్లినంత అలవాటుగా, అతి తరచుగా, అభిమానులకు విసుగొచ్చేంతగా తలపడ్డ ప్రత్యర్థులు భారత్, శ్రీలంక. అయితే ఈ ‘ప్రియమైన శత్రువు’లకు టి20 క్రికెట్‌లో మాత్రం పెద్దగా ఎదురుపడే అవకాశం రాలేదు. ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య 6 మ్యాచ్‌లు మాత్రమే జరగ్గా... ఇందులో రెండు జట్లు చెరో 3 మ్యాచ్‌లు గెలిచాయి.
వెస్టిండీస్ పర్యటన రద్దు నేపథ్యంలో బీసీసీఐ విజ్ఞప్తి మేరకు ఏడాదిన్నర క్రితం హడావిడిగా వన్డే సిరీస్‌కు వచ్చిన లంక, ఇప్పుడు కూడా టీమిండియాకు ‘ప్రాక్టీస్’ కల్పించేందుకు వారం రోజుల వ్యవధిలో మూడు టి20 మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధం అయింది. భారత్, శ్రీలంక మధ్య జరిగిన రెండు వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ప్రత్యర్థినే విజయం వరించింది.
2014 టి20 ప్రపంచకప్ ఫైనల్లో లంక చేతిలో భారత్ ఓటమి తర్వాత ఇరు జట్లు తలపడనుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. భారత్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి మాత్రమే విశ్రాంతినివ్వగా... గాయాలతో మలింగ, మ్యాథ్యూస్ తప్పుకోవడంతో లంక జట్టులో దాదాపు అంతా కొత్త కుర్రాళ్లే కనిపిస్తున్నారు.
కొత్తగా ప్రయత్నిస్తారా!
టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో లేని ఇద్దరు ఆటగాళ్లు ఇప్పుడు లంకతో సిరీస్‌లో పాల్గొంటున్నారు. బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే, బౌలర్ భువనేశ్వర్ కుమార్‌లకు ఈ సిరీస్‌లో అవకాశం దక్కింది. వరల్డ్ కప్ కోసమే ఈ సన్నద్ధత అని భావిస్తే వీరిద్దరికి తుది జట్టులో చోటే లభించకపోవచ్చు. ఆసీస్‌తో విజయం సాధించిన జట్టునే కాకుండా బయట అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను కూడా ఈ సిరీస్‌లో ప్రయత్నించాలని భావిస్తే ఆడించే అవకాశం ఉంది. కాబట్టి పాండే, భువీ కూడా మ్యాచ్‌ను ఆశిస్తున్నారు.
ఇక ఓపెనర్‌గా రహానేకు ఒక అవకాశం ఇచ్చి చూడాలనే ఆలోచన కూడా ఉంది. అన్నింటికి మించి లెఫ్టార్మ్ స్పిన్నర్ పవన్ నేగికి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఇది సరైన అవకాశం. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే నేరుగా వరల్డ్‌కప్‌కు ఎంపికైన నేగిపై ఐపీఎల్ వేలంతో అంచనాలు మరింత పెరిగాయి. ఐపీఎల్‌లో అతడి ఆటను దగ్గరి నుంచి చూసిన ధోని, ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లో నేగి ఆటపై ప్రత్యేకంగా దృష్టి పెడతాడనడంలో సందేహం లేదు. జడేజా లేదా పాండ్యాలలో ఒకరికి విశ్రాం తినిచ్చి నేగిని రెగ్యులర్‌గా ఆడించే అవకాశం ఉంది.
అంతా కొత్తగా...
భారత బోర్డుతో మొహమాటానికే తప్ప శ్రీలంక జట్టు ఈ సిరీస్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిం చడం లేదు. చాలా మంది సీనియర్లు గాయం పేరుతోనే దూరమయ్యారు. లసిత్ మలింగ, మ్యాథ్యూస్‌లకు తోడు సీనియర్లు కులశేఖర, రంగన హెరాత్ కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక గాయంతో ఆల్‌రౌండర్ తిలకరత్నే దిల్షాన్ తొలి మ్యాచ్‌లో ఆడటం లేదు.
శనివారం శ్రీలంక జట్టు భారత్‌కు చేరగా... అతను మాత్రం వారితో రాలేదు. దాదాపు నాలుగేళ్ల క్రితం లంక తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడిన దిల్హారా ఫెర్నాండో పునరాగమనం చేశాడు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో దిల్షాన్ మినహా తిసార పెరీరాకే ఎక్కువ మ్యాచ్‌లు (42) ఆడిన అనుభవం ఉంది. గతంలో కూడా ఈ ఫార్మాట్‌లో లంకకు కెప్టెన్‌గా వ్యవహరించిన చండీమల్ ఈసారి కూడా జట్టును నడిపిస్తున్నాడు. గత నెలలో కివీస్ చేతిలో 0-2తో శ్రీలంక టి20 సిరీస్ ఓడింది.
జట్ల వివరాలు
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, రైనా, యువరాజ్, పాండే, జడేజా, అశ్విన్, పాండ్యా, బుమ్రా, హర్భజన్, నెహ్రా, భువనేశ్వర్, నేగి.
శ్రీలంక: చండీమల్ (కెప్టెన్), దిల్షాన్, ప్రసన్న, సిరివర్ధన, గుణతిలక, తిసార పెరీరా, షనక, గుణరత్నే, కపుగెదెర, చమీరా, దిల్హారా ఫెర్నాండో, రజిత, బినూరా ఫెర్నాండో, సేనానాయకే, వాండర్సే.
నిలవాలంటే గెలవాలి
శ్రీలంకతో సిరీస్‌ను గెలుచుకుంటే భారత జట్టు ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది. కనీసం 2-1తో గెలిచినా భారత్ నంబర్‌వన్‌గా కొనసాగుతుంది. ఇదే తేడాతో లంక గెలిస్తే ఆ జట్టు నంబర్‌వన్ కావడంతో పాటు భారత్ ఏడో స్థానానికి దిగజారుతుంది.