బిగిసింది పట్టు... | India vs West Indies, 1st Test: West Indies 94/6 at stumps | Sakshi
Sakshi News home page

బిగిసింది పట్టు...

Published Sat, Oct 6 2018 12:55 AM | Last Updated on Sat, Oct 6 2018 5:00 AM

India vs West Indies, 1st Test: West Indies 94/6 at stumps - Sakshi

ఎదురుగా గుండెలు గుభేల్‌మనేలా కొండంత స్కోరు... కనీసం ఇద్దరు మూడంకెల స్కోరు చేస్తేనే దీటైన సమాధానం ఇవ్వగల పరిస్థితి! కానీ, వెస్టిండీస్‌... షమీ పేస్‌ను ఎదుర్కొనలేక, అశ్విన్‌ త్రయం స్పిన్‌కు తాళలేక చేతులెత్తేసింది. వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్టే వరుస కట్టారు! వెరసి... రాజ్‌కోట్‌ టెస్టుపై టీమిండియా పట్టు బిగించింది. అంతకుముందు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా శతకాలతో జట్టుకు భారీ స్కోరు అందించారు. మిగిలి ఉన్న మూడు రోజుల ఆటలో ఎంత పోరాడినా నిలవడం ప్రత్యర్థికి కష్టమే! భారత్‌ శనివారమే మ్యాచ్‌ను ముగించినా ఆశ్చర్యం లేదు.  

రాజ్‌కోట్‌: ఏమాత్రం సవాలు విసరని బౌలింగ్‌ను ముందుగా బ్యాట్స్‌మెన్‌ ఆటాడుకున్నారు... అనంతరం అంతంతమాత్రం అనుభవం ఉన్న ప్రత్యర్థి బ్యాటింగ్‌ లైనప్‌ను బౌలర్లు కుప్పకూల్చారు! మొత్తమ్మీద సొంతగడ్డపై తమజట్టు ఎంత పటిష్టమైనదో చూపుతూ టీమిండియా రాజ్‌కోట్‌ టెస్టులో విజయం దిశగా దూసుకెళ్తోంది. అద్భుత శతకంతో మొదటి రోజు యువ ఓపెనర్‌ పృథ్వీ షా వేసిన బలమైన పునాదిని శుక్రవారం రెండో రోజు విరాట్‌ కోహ్లి (230 బంతుల్లో 139; 10 ఫోర్లు), రవీంద్ర జడేజా (132 బంతుల్లో 100 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మరింత బలపరిచారు. వీరికి వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (84 బంతుల్లో 92; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడు తోడవడంతో తొలి ఇన్నింగ్స్‌ను భారత్‌ 649/9 వద్ద డిక్లేర్‌ చేసింది. బిషూ నాలుగు, లూయిస్‌ రెండు వికెట్లు పడగొట్టగా... గ్రాబియెల్, ఛేజ్, బ్రాత్‌వైట్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌ దిగిన విండీస్‌... పేసర్‌ షమీ (2/11) ధాటికి, అశ్విన్‌ (1/32), జడేజా (1/9), కుల్దీప్‌ యాదవ్‌ (1/19)ల మాయకు కుదేలైంది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి విండీస్‌ 94/6తో నిలిచింది. రోస్టన్‌ ఛేజ్‌ (27 బ్యాటింగ్‌), కీమో పాల్‌ (13 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. భారత్‌ స్కోరుకు ఇంకా 555 పరుగులు వెనుకబడి ఉన్న ఆ జట్టు కనీసం ఫాలోఆన్‌ను తప్పించుకోవడమూ కష్టమే. 

నిలిచేవారేరి? ఆడేవారేరి? 
భీకరంగా సాగిన భారత బ్యాటింగ్‌కు పూర్తి భిన్నంగా నడిచింది పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌. ఏ బ్యాట్స్‌మన్‌ కూడా పట్టుమని 10 ఓవర్లు నిలిచేలా కనిపించలేదు. జట్టులో సీనియర్, కీలక బ్యాట్స్‌మన్, ఈ టెస్టుకు కెప్టెన్‌ అయిన ఓపెనర్‌ బ్రాత్‌వైట్‌ (2)... షమీ రెండో ఓవర్లోనే బౌల్డయ్యాడు. నోబాల్‌ అనే అనుమానంతో పలుమార్లు పరిశీలించినా, చివరకు థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. షమీ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్‌ కీరన్‌ పావెల్‌ (1) వికెట్ల ముందు దొరికిపోయాడు. షై హోప్‌ (10), హేట్‌మైర్‌ (10) నిలదొక్కుకోవడానికి చూసినా అది అతి కొద్దిసేపే. అశ్విన్‌... హోప్‌ వికెట్లను గిరాటేశాడు. అతడి తదుపరి ఓవర్లోనే మిడాన్‌లోకి బంతిని కొట్టి పరుగుకు యత్నించిన హేట్‌మైర్‌... జడేజా డైరెక్ట్‌ హిట్‌కు రనౌటయ్యాడు. స్లిప్‌లో రహానే క్యాచ్‌తో సునీల్‌ ఆంబ్రిస్‌ (12)ను జడేజా వెనక్కుపంపాడు. వికెట్‌ కీపర్‌ డౌరిచ్‌ (10)ను కుల్దీప్‌ బలిగొన్నాడు. దీంతో విండీస్‌ 74 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఛేజ్‌కు జత కలిసిన కీమో పాల్‌... సిక్స్, ఫోర్‌తో దూకుడు చూపాడు. వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా రోజును ముగించారు. మూడో సెషన్‌లో 29 ఓవర్లను ఎదుర్కొన్న వెస్టిండీస్‌ 94 పరుగులు మాత్రమే చేయగలిగింది.  ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా ఔటైనందున శనివారం ఆ జట్టు లోయరార్డర్‌ను పడగొట్టడం భారత్‌కు పెద్ద కష్టమేమీ కాదు. తద్వారా భారీ ఆధిక్యం దక్కడం ఖాయం. అయితే, కోహ్లి ప్రత్యర్థిని ఫాలోఆన్‌ ఆడిస్తాడో? లేక రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌కు దిగుతాడో చూడాలి. 

ఆ ముగ్గురూ ఆడుతూ పాడుతూ... 
ఓవర్‌నైట్‌ స్కోరు 364/4తో శుక్రవారం కొనసాగిన టీమిండియా స్కోరు కోహ్లి, పంత్‌ జోరైన బ్యాటింగ్‌తో చకచకా ముందుకు సాగింది. కోహ్లి అడపాదడపా షాట్లు కొట్టగా... రిషభ్‌ సహజ శైలిలో ఆడాడు. కీమో పాల్‌ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్‌తో అర్ధ శతకం  అందుకున్నాడు. తర్వాత ఛేజ్, బిషూల ఓవర్లలోనూ ఇదే తరహాలో బాది పరుగులు పిండుకున్నాడు. 18 బంతుల్లోనే అతడు వ్యక్తిగత స్కోరు 42 నుంచి 83కు చేరుకోవడం విశేషం. అవతలి ఎండ్‌లోని కోహ్లి అప్పటికి చేసివని 22 పరుగులే కావడం గమనార్హం. మరికాసేపటికే బిషూ బౌలింగ్‌లో ఫైన్‌ లెగ్‌లో బౌండరీ బాదిన కెప్టెన్‌ కెరీర్‌లో 24వ శతకాన్ని అందుకున్నాడు. అయితే, శతకం చేసే ఊపులో కనిపించిన పంత్‌... బిషూ గూగ్లీని షాట్‌ కొట్టే యత్నంలో షార్ట్‌ థర్డ్‌మ్యాన్‌లో పాల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 133 పరుగుల ఐదో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. జడేజా సైతం బ్యాట్‌ ఝళిపించడం తో లంచ్‌కు ముందే స్కోరు 500 దాటింది. 

లంచ్‌–టీ జడేజా సెషన్‌... 
విరామం నుంచి వస్తూనే లూయిస్‌ బౌలింగ్‌లో బౌండరీ బాదిన కోహ్లి ఈ ఏడాది టెస్టుల్లో 1000 పరుగుల మార్కు దాటాడు. అదే ఊపులో బిషూ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. కోహ్లి ఔటయ్యాక జడేజా విజృంభణ మొదలైంది. ఈ మధ్యలో అశ్విన్‌ (7), కుల్దీప్‌ (12) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఫిఫ్టీ అనంతరం సిక్స్‌లు, ఫోర్లతో జడేజా మరింత ధాటిగా ఆడాడు. అతడికి ఉమేశ్‌ యాదవ్‌ (22; 2 సిక్స్‌లు) సహకరించాడు. 79 పరుగుల వద్ద దక్కిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకుంటూ భారీ షాట్లతో 90ల్లోకి వచ్చాడు. కానీ, అప్పటికే 9 వికెట్లు పడటంతో అతడి సెంచరీ పూర్తవుతుందా? అనే అనుమానం కలిగింది. దీనికి తగ్గట్లే కొంత ఉత్కంఠ నెలకొన్నా షమీ (2 నాటౌట్‌) సహకరించాడు. బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌లో మిడాఫ్‌ లోకి బంతిని కొట్టి పరుగు తీయడంతో టెస్టుల్లో జడేజా తొలి శతకం పూర్తయింది. ఆ వెంటనే కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. 

సొంతగడ్డపై జడేజాలం... 
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన, ఏడాది పైగా విరామంతో వన్డేల్లో చోటుతో ఆసియా కప్‌ ఫైనల్లో విలువైన పరుగులతో మళ్లీ జనం నాట్లో నానుతున్న జడేజా... సొంతగడ్డపై టెస్టులో శుక్రవారం అంతా తానే అయి కనిపించాడు. లోయరార్డర్‌ అండగా సిక్స్‌లు బాది తొమ్మిదేళ్ల కెరీర్‌లో తొలి శతకం నమోదుతో కర్ర సాము చేసిన ఈ ఆల్‌ రౌండర్‌... ప్రత్యర్థి ఇన్నింగ్స్‌లో ఓ రనౌట్‌ (హేట్‌మైర్‌), ఓ వికెట్‌ పడగొట్టాడు. ఇందులో రనౌట్‌ను కొంత విచిత్రం అనిపించేలా చేశాడు. అదెలాగంటే, అశ్విన్‌ బౌలింగ్‌లో హేట్‌మైర్‌ బంతిని మిడాన్‌లోకి ఆడి ఆంబ్రిస్‌ను పరుగుకు పిలిచాడు. కానీ, తర్వాత వెనక్కుతగ్గాడు.ఈలోగా ఆంబ్రిస్‌ స్ట్రయికర్‌ క్రీజు వద్దకు వచ్చేశాడు. దీంతో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ ఒకేవైపు ఉండిపోయారు. బంతిని అందుకున్న జడేజా... అశ్విన్‌కు ఇవ్వకుండా వికెట్లను పడగొట్టేందుకు నింపాదిగా రాసాగాడు. అవకాశాన్ని గమనించిన హేట్‌మైర్‌ పరుగుకు యత్నించాడు. ఈ నేపథ్యంలో అశ్విన్‌ కంగారుపడగా, జడేజా వేగం పెంచి బంతిని వికెట్లకేసి కొట్టాడు. దగ్గరగా ఉన్నప్పటికీ త్రో తరహాలో బంతిని విసిరాడు. అది తగలకుంటే పరిస్థితి ఏమిటన్న రీతిలో అశ్విన్, కోహ్లి అతడికేసి చూడటం, తర్వాత కులాసాగా నవ్వడం గమనార్హం. 

కోహ్లి సంబరాలు లేకుండానే: సరైన సవాల్‌ ఉంటేనే కోహ్లికి మజానేమో? దీటైన ప్రత్యర్థిపై ఆడితేనే ఆనందమేమో...? శుక్రవారం అతడి బాడీ లాంగ్వేజ్‌ ఇలాగే ఉంది మరి. టెస్టులంటే అమితాసక్తి చూపే భారత కెప్టెన్‌ అందులో సెంచరీ చేస్తే ఆకాశమే పాదాక్రాంతమైనట్లు రెండు చేతులూ చాచి గర్జనలాంటి అరుపుతో సంబరం చేసుకుంటాడు. రాజ్‌కోట్‌లో మాత్రం ఇవేమీ లేకుండానే అతడి శతకాభివాదం సాగిపోయింది.అసలు తాను మూడంకెలను చేరుకున్నాడా లేదా అని అభిమానులకు అనుమానం కలిగేలా అత్యంత సాధారణంగా బ్యాట్‌ను పైకెత్తాడు. 

ఈ శతకం అమ్మకు అంకితం... 
గతంలో 80లు, 90లు చేసినా సెంచరీలుగా మల్చలేకపోయా. ఈ రోజు మాత్రం ఎలాంటి చెత్త షాట్లు కొట్టదల్చుకోలేదు. అందుకే ఉమేశ్, షమీలతో ఎప్పటికప్పుడు మాట్లాడా. శతకం చేసి తీరాలని నాకు నేను సంకల్పించుకున్నా. స్థిరంగా ఆడకుంటే ఒత్తిడిలో పడతాం. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోదల్చుకున్నా. ఇంగ్లండ్‌లోనూ ఇదే ఆలోచనతో ఉన్నా. ఈ సెంచరీ మా అమ్మకు అంకితం.
-  జడేజా  

►124  టెస్టుల్లో 24 సెంచరీలు చేసేందుకు కోహ్లి తీసుకున్న ఇన్నింగ్స్‌ల సంఖ్య. బ్రాడ్‌మన్‌ (66 ఇన్నింగ్స్‌) మాత్రమే ఇంతకంటే వేగంగా 24 సెంచరీలు చేశాడు. సచిన్‌కు 125, గావస్కర్‌కు 128 ఇన్నింగ్స్‌లు పట్టాయి.  

►30  టెస్టులు, వన్డేలు కలిపి కెప్టెన్‌గా కోహ్లి సెంచరీల సంఖ్య. నాయకుడిగా అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో పాంటింగ్‌ (41), గ్రేమ్‌ స్మిత్‌ (33) 
అతనికంటే ముందున్నారు.   
 

24 టెస్టుల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. తాజా శతకంతో  సెహ్వాగ్‌ (23)ను అధిగమించాడు. భారత్‌ తరఫున సచిన్‌ టెండూల్కర్‌ (51), రాహుల్‌ ద్రవిడ్‌ (36), సునీల్‌ గావస్కర్‌ (34) మాత్రమే అతనికంటే ఎక్కువ సెంచరీలు చేశారు.  

3    వరుసగా మూడో ఏడాది టెస్టుల్లో 1000 పరుగులు చేసిన కోహ్లి ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.  

1     జడేజాకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే తొలి సెంచరీ. తన 218వ మ్యాచ్‌లో అతను ఈ మార్క్‌ను అందుకున్నాడు  

► 649 టెస్టుల్లో విండీస్‌పై భారత్‌కిదే అత్యధిక స్కోరు. గత రెండేళ్లలో భారత్‌ 600 అంతకంటే ఎక్కువ స్కోరు చేయడం ఇది ఎనిమిదోసారి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement