పట్టాలి... క్యాచుల్ని, సిరీస్‌ని! | India vs West Indies 3rd T20 At Mumbai | Sakshi
Sakshi News home page

పట్టాలి... క్యాచుల్ని, సిరీస్‌ని!

Published Wed, Dec 11 2019 1:34 AM | Last Updated on Wed, Dec 11 2019 1:34 AM

India vs West Indies 3rd T20 At Mumbai - Sakshi

సిరీస్‌ సొంతం చేసుకోవడానికి భారత్, వెస్టిండీస్‌ జట్లు ఆఖరి సమరానికి సిద్ధమయ్యాయి. నిలకడలేని బ్యాటింగ్, ఫీల్డర్ల వైఫల్యం టీమిండియాను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా... ఐపీఎల్‌ అనుభవంతో నిర్ణాయక మ్యాచ్‌ ఫలితాన్ని శాసించాలని పొలార్డ్‌ బృందం పట్టుదలతో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రోహిత్‌ శర్మ సొంత మైదానంలో ‘హిట్‌’ కావాలని, జట్టుకు సిరీస్‌ అందించాలని ఉత్సాహంతో ఉన్నాడు.   

ముంబై: భారత్, వెస్టిండీస్‌ల మధ్య ‘పొట్టి’పోరు ఆఖరి అంకానికి చేరింది. కోహ్లి సేన లోపాలను సరిదిద్దుకొని సమరానికి సన్నద్ధం కాగా... వాంఖెడే స్టేడియం పొలార్డ్‌ను ఊరిస్తోంది. ఐపీఎల్‌తో సొంత మైదానమైన చోట మ్యాచ్‌ను, సిరీస్‌ను చేజిక్కించుకోవాలని విండీస్‌ కెపె్టన్‌ పట్టుదలతో ఉన్నాడు. పూర్తిగా యువకులతో కూడిన వెస్టిండీస్‌ గత మ్యాచ్‌లో గెలిచి భారత్‌కు సవాల్‌ విసిరింది. టి20ల్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన విండీస్‌తో ఈ పోరులో భారత్‌ ఆదమరిస్తే... మూల్యంగా మ్యాచ్‌నే కాదు,  సిరీస్‌నే చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి అనుభవజ్ఞులు, కుర్రాళ్ల కలయికతో ఉన్న టీమిండియా సత్తా చాటాల్సిన సమయమిదే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచి 1–1తో సమంగా ఉన్న నేపథ్యంలో నేడు జరిగే చివరిదైన మూడో టి20 మ్యాచ్‌ నిర్ణాయకం కానుంది.  

రోహిత్‌పై ఆశలు...

రోహిత్, కోచ్‌ రవిశాస్త్రి

తన సొంతగడ్డపై రోహిత్‌ శర్మ మెరుపులు మెరిపిస్తే భారత్‌ విజయం సులువవుతుంది. గత రెండు మ్యాచ్‌ల్లో అతను నిరాశపరిచాడు. 8, 15 పరుగులే చేసిన ‘హిట్‌మ్యాచ్‌’ ఈ పోరులో బ్యాట్‌ ఝుళిపిస్తే పరుగుల వరద ఖాయం. తొలి మ్యాచ్‌లో కోహ్లితో పాటు చెలరేగిన రాహుల్‌ ఈ మ్యాచ్‌లో తన ప్రభావం చూపేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఛేజింగ్‌లో ఓపెనర్లిద్దరు శుభారంభమిస్తే కోహ్లి సేన ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించగలుగుతుంది. సిరీస్‌ను తేల్చే కీలకమైన ఈ మ్యాచ్‌కు తుదిజట్టులో మార్పులు చేయకపోవచ్చు.

పైగా కెపె్టన్‌ కోహ్లి... వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌పై నమ్మకముంచడంతో సంజూ సామ్సన్‌కు ఈ సిరీస్‌లోనూ తుది జట్టులో ఆడే చాన్స్‌ లేకపోయింది. బంగ్లాదేశ్‌తో కూడా అతన్ని ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. టాపార్డర్‌లో ప్రమోషన్‌ పొందిన శివమ్‌ దూబే ఈ మ్యాచ్‌లోనూ మెరుపులు మెరిపించేందుకు తహతహలాడుతున్నాడు. మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్, పంత్‌లు కూడా పరుగుల ప్రవాహానికి జతకలిస్తే భారత్‌ భారీ స్కోరు చేయగలుగుతుంది. ముఖ్యంగా స్లాగ్‌ ఓవర్లపై భారత బ్యాట్స్‌మెన్‌ దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

క్యాచ్‌లు పడితేనే...
ఈ సిరీస్‌లో భారత ఫీల్డింగ్‌ వైఫల్యం జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపరుస్తోంది. రెండు మ్యాచ్‌ల్లోనూ విలువైన క్యాచ్‌లు జారవిడువడం సమస్యగా మారింది. తొలి టి20లో ఈ వైఫల్యాన్ని అనుకూలంగా మలుచుకున్న విండీస్‌ 200 పైచిలుకు పరుగులు చేసింది. కోహ్లి ఆఖరిదాకా చెలరేగడంతో గెలుపు దక్కింది. కానీ రెండో వన్డేలో క్యాచ్‌లు చేజార్చి భారత్‌ మూల్యం చెల్లించుకుంది. లేదంటే ఈపాటికే సిరీస్‌ను గెలిచేది. నెట్స్‌లోనూ భారత్‌ ప్రధానంగా ఈ లోపాలపైనే కసరత్తు చేసింది. మరోవైపు బౌలింగ్‌ విభాగం కూడా మెరుగుపడాలి. పునరాగమనం చేసిన భువనేశ్వర్‌ పరుగుల్ని కట్టడి చేయలేకపోయాడు. బంగ్లాదేశ్‌పై నిప్పులు చెరిగిన దీపక్‌ చాహర్‌ ఈ సిరీస్‌లో లయ కోల్పోయాడు. స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. వీళ్లంతా రాణిస్తేనే కీలకమైన ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ విజయఢంకా మోగిస్తుంది.  

పొలార్డ్‌కు కలిసొచ్చే ముంబై...
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌గా వాంఖెడేలో విండీస్‌ సారథి పొలార్డ్‌కు ఎంతో అనుభవముంది. పిచ్, గ్రౌండ్‌పై అతనికి రోహిత్‌ శర్మకు ఉన్నంత అవగాహన ఉండటం ఈ మ్యాచ్‌లో విండీస్‌కు కలిసిరావొచ్చు. టాపార్డర్‌లో సిమన్స్, లూయిస్‌ ఫామ్‌లో ఉన్నారు. హిట్టర్లు హెట్‌మైర్, నికోలస్‌ పూరన్‌ అందుబాటులో ఉండటం కరీబియన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను పటిష్టం చేసింది. జట్టు మొత్తం యువకులే. పొట్టి ఫార్మాట్‌కు తగిన దూకుడు కుర్రాళ్లలోనే ఉంటుంది. బ్రాండన్‌ కింగ్‌ భారీషాట్లు ఆడగల సమర్థుడు. గత మ్యాచ్‌లో బౌలర్లు విలియమ్స్, కాట్రెల్‌ భారత జోరుకు కళ్లెం వేశారు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో అద్భుతంగా కట్టడి చేశారు. అనుభవజ్ఞుడైన పేసర్‌ హోల్డర్, లెగ్‌ స్పిన్నర్‌ హేడెన్‌ వాల్ష్  టీమిండియాపై తప్పకుండా ప్రభావం చూపే అవకాశం ఉంది.

►ముంబైలోని వాంఖెడే స్టేడియంలో భారత్‌ ఇప్పటివరకు మూడు టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఒక మ్యాచ్‌లో గెలిచి (శ్రీలంకపై 5 వికెట్లతో; డిసెంబర్‌ 24న, 2017)... రెండింటిలో (ఇంగ్లండ్‌ చేతిలో 6 వికెట్లతో; డిసెంబర్‌ 22న, 2012... విండీస్‌ చేతిలో 7 వికెట్లతో; మార్చి 31న, 2016) ఓడిపోయింది. వాంఖెడేలో జరిగిన ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్‌ చేసిన జట్టే గెలుపొందడం విశేషం.

మేం ఎప్పుడో జరిగే పొట్టి ప్రపంచకప్‌పై ఆలోచించడం లేదు. ఈ మ్యాచ్‌తో సిరీస్‌ గెలవడంపైనే దృష్టి పెట్టాం. ఇప్పుడైతే మా లోపాలను సవరించుకునే పనిలో ఉన్నాం. లక్ష్యాన్ని ఛేదించడమే భారత్‌కు సులువు. ఈ సిరీస్‌లో కూడా అదే జరిగింది. ప్రస్తుతం పటిష్టమైన జట్టును ఎదుర్కొంటున్నాం. ఆ తర్వాత శ్రీలంకతో ఆడాలి. అనంతరం న్యూజిలాండ్‌కు వెళ్లాలి. పది నెలల తర్వాత జరిగే మెగా ఈవెంట్‌కు ముందు మేం ఎన్నో టి20లు ఆడాల్సి ఉంటుంది.
–భారత ఓపెనర్‌ రోహిత్‌  

క్యాచ్‌లు చేజార్చుతుంటే మ్యాచ్‌ల్ని నెగ్గలేం. ఫీల్డర్లు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఫ్లడ్‌లైట్ల వల్ల కనబడలేదనో, మరే ఇతర కారణాల్ని సాకులుగా చెప్పడానికి వీల్లేదు. అవసరమైతే ప్రాక్టీస్‌లో కఠోరంగా శ్రమించైనా పట్టు సాధించాలి. కెపె్టన్‌ పొలార్డ్‌కు ఈ వేదికపై విశేషంగా ఆడిన అనుభవముంది. ఇది మా జట్టుకు పనికొస్తుంది. ఇక్కడ 200 చేసినా ఛేదించవచ్చు. మొదట బ్యాటింగ్‌ కంటే చేజింగే సులువు.
–వెస్టిండీస్‌ కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌  

పిచ్, వాతావరణం
వాంఖెడేలో లక్ష్యఛేదన సులువు. టాస్‌ నెగ్గిన జట్టు ఫీల్డింగే ఎంచుకుంటుంది. మంచుకురిసే రాత్రి వేళ బౌలర్లకు పట్టుదొరకడం కష్టం కావొచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.  

జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెపె్టన్‌), రోహిత్‌ శర్మ, రాహుల్, పంత్, శ్రేయస్, శివమ్‌ దూబే, జడేజా, వాషింగ్టన్‌ సుందర్, దీపక్‌ చాహర్, భువనేశ్వర్, చహల్‌.

వెస్టిండీస్‌: కీరన్‌ పొలార్డ్‌ (కెపె్టన్‌), లెండిల్‌ సిమన్స్, లూయిస్, కింగ్, హెట్‌మైర్, నికోలస్‌ పూరన్, జేసన్‌ హోల్డర్, పియరీ, విలియమ్స్, కాట్రెల్, హేడెన్‌ వాల్ష్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement