అమెరికన్లను ఆకట్టుకోగలిగామా..!
* టి20 మ్యాచ్‌లకు భారీగా ప్రేక్షకులు
* అంతా భారత, ఆసియా సంతతివారే
భారత క్రికెట్ జట్టు ఎక్కడ ఆడినా దానికి ఉండే క్రేజ్ వేరు. అభిమానులను ఆకట్టుకోవడంలో మన జట్టు తర్వాతే ఎవరైనా. అదే ఆలోచనతో ఐసీసీ కూడా తొలిసారి అమెరికాలో భారత జట్టు ఆడేందుకు ఏర్పాట్లు చేసింది. అధికారిక లెక్కల ప్రకారం ఇది బీసీసీఐ హోం సిరీస్! అంటే భారత్‌లో జరగాల్సిన సిరీస్‌కే యూఎస్ ఇప్పుడు వేదికైంది. మరి మన జట్టు భారత అభిమానుల మధ్య సొంతగడ్డపై ఆడుతున్న అనుభూతిని పొందిందా... ఒరిజినల్ అమెరికన్లను కొత్త అభిమానులుగా మార్చి వారిని ఆకట్టుకోవడంలో సఫలమైందా..
అంతా మనోళ్లే
కారణమేదైనా రెండో టి20 మ్యాచ్‌కు మాత్రం జనం చాలా తక్కువ సంఖ్యలో వచ్చారు. అరుుతే అంతకు ముందు తొలి మ్యాచ్‌కు లాడర్‌హిల్ స్టేడియం పూర్తిగా నిండిపోయింది. ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకాలే ఎగిరాయి. ఒక వైపు కొంత భాగం మాత్రం వెస్టిండీస్‌నుంచి వచ్చిన ఫ్యాన్‌స కనిపించారు. వీరంతా కొత్త క్రికెట్ ఫ్యాన్‌స కాదు. విండీస్‌లో జరిగే మ్యాచ్‌లకు కూడా రెగ్యులర్‌గా హాజరయ్యేవారే. యూఎస్‌లో మ్యాచ్‌కు వచ్చిన వారంతా కూడా అమెరికా ఇండియన్‌స తప్ప అసలు అమెరికన్లు కాదు! ఒక అంచనా ప్రకారం మొత్తం మైదానంలో ఐదు శాతం కూడా స్థానిక అభిమానులు లేరు. అయితే భారతీయులు లేదంటే ఉపఖండానికి చెందినవారే తమ హీరోలను చూసేందుకు వచ్చారు. కొందరు అమెరికన్లు మాత్రమే ఆట గురించి ఏమీ తెలియకపోయినా మొహమాటం కొద్దీ వచ్చామని చెప్పడం విశేషం. ఒకరికి క్లోజ్‌ఫ్రెండ్ ఇండియన్,.. ఇంకొకరికి ఆఫీసులో బాస్ ఇండియన్!
అక్కడివారికి అవసరం లేదా..?
అమెరికా మార్కెట్‌కు క్రికెట్ రుచి చూపించాలని బీసీసీఐ ప్రణాళికలైతే పెద్దగా వేసింది కానీ కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోయింది. కేవలం భారత టీవీ ప్రేక్షకుల కోసం మనకు అనుకూలమైన సమయంలో మ్యాచ్‌లు నిర్వహించారు. వారాంతపు రోజుల్లో ఉదయం 10 గంటలకు క్రికెట్ చూసేందుకు ఎంత మంది అమెరికన్లు వెళ్లగలరు? టార్గెట్ అమెరికా అయినప్పుడు భారత వీక్షకుల గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందా! అన్నింటికీ మించి ఈ రెండు మ్యాచ్‌లు కూడా అమెరికా టీవీల్లో అసలు ప్రసారమే కాలేదు.
భారతీయులకు సంబంధించిన కార్యక్రమాలను అందించే ఒక వెబ్‌సైట్‌లో మాత్రమే చూపించారు. దాంతో అమెరికాలో ఉండే భారతీయుల కోసమే ఈ క్రికెట్ తప్ప మన కోసం కాదు అనే భావన చాలా మంది అమెరికన్లలో కనిపించింది. యూఎస్ బాగుంది, మరిన్ని సిరీస్‌లు కూడా ఆడవచ్చని భారత కెప్టెన్ ధోని తన అభిప్రాయం చెప్పాడు. అరుుతే అక్కడ మార్కెట్ ఏర్పడాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని తాజా పరిస్థితి చూపిస్తోంది. స్థానిక అమెరికన్లను భాగం చేస్తూ, వారిని క్రికెట్ వైపు ఆకర్షించే విధంగా ఐసీసీ ఏదైనా కొత్తగా ప్రయత్నించాల్సి ఉంది. లేదంటే ఏడాదికో సారి ఇలాంటి మ్యాచ్‌లు జరిగినా... అది భారత్‌లోని వేదికలకు కొనసాగింపుగా కనిపిస్తుంది తప్ప అక్కడ క్రికెట్ నిలబడటం కష్టం!
- సాక్షి క్రీడావిభాగం