ఇంకా నిరీక్షణే... | India waiting for medals | Sakshi
Sakshi News home page

ఇంకా నిరీక్షణే...

Published Sat, Aug 13 2016 2:16 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

ఇంకా నిరీక్షణే...

ఇంకా నిరీక్షణే...

పతకం కోసం భారత్ ఎదురుచూపులు

గత నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో (లండన్, బీజింగ్, ఏథెన్స్, సిడ్నీ) పోటీలు మొదలైన నాలుగు రోజుల్లోపే భారత్ పతకాల బోణీ చేసింది. కానీ రియో ఒలింపిక్స్‌లో మాత్రం వారం రోజులు గడిచినా మనోళ్లు ఇంకా ఒక్క పతకం కూడా సాధించలేకపోయారు. కచ్చితంగా పతకం తెస్తారనుకున్న వారంతా ఒక్కొక్కరుగా నిష్ర్కమిస్తుండటంతో... పతకం కోసం భారత్ ఎదురుచూపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

 

గ‘గన్’ గురి సరిపోలేదు
లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం బోణీ చేసిన షూటర్ గగన్ నారంగ్ ఈసారి తడబడుతున్నాడు. తన తొలి ఈవెంట్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమైన ఈ హైదరాబాద్ షూటర్... రెండో ఈవెంట్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలోనూ విఫలమయ్యాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో గగన్ నారంగ్ 623.1 పాయింట్లు స్కోరు చేసి 13వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. మొత్తం 47 మంది పోటీపడ్డ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో భారత్‌కే చెందిన మరో షూటర్ చెయిన్ సింగ్ 619.6 పాయింట్లు సాధించి 36వ స్థానంలో నిలిచాడు. 


పురుషుల స్కీట్ ఈవెంట్‌లో తొలి రోజు క్వాలిఫయింగ్ పోటీలు ముగిశాక మేరాజ్ అహ్మద్ ఖాన్ 72 పాయింట్లతో 10వ స్థానంలో... 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో తొలి రోజు క్వాలిఫయింగ్ పోటీలు ముగిశాక గుర్‌ప్రీత్ సింగ్ 289 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నారు.

 

అతాను ఆదుకోలేదు
ఆర్చరీలో భారత పోరాటం ముగిసింది.  శుక్రవారం జరిగిన పురుషుల వ్యక్తిగత విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో అతాను దాస్ 4-6తో (28-30, 30-28, 27-27, 27-28, 28-28) ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లీ సెయుంగ్ యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. దీంతో ఆర్చరీలో భారత పోరు ముగిసింది. మహిళల వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి, బొంబేలా దేవి ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో... లక్ష్మీరాణి తొలి రౌండ్‌లో నిష్ర్కమించారు. లీ సెయుంగ్ యున్‌తో జరిగిన పోటీలో ఇద్దరూ చెరో సెట్ గెలిచాక స్కోరు 2-2తో సమమైంది.  మూడో సెట్‌లో మూడో బాణంపై 9 పాయింట్లు సాధిస్తే అతాను సెట్  గెలిచేవాడు. కానీ  ఎనిమిది మాత్రమే రావడంతో స్కోరు సమమై ఇద్దరికీ ఒక్కో పాయింట్ లభించింది. నాలుగో సెట్‌ను కోల్పోయిన అతాను ఐదో సెట్‌లో స్కోరును సమం చేసినా ఫలితం లేకపోయింది.

 

 శ్రీకాంత్ శుభారంభం
మరోవైపు బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. గ్రూప్ ‘హెచ్’ తొలి లీగ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-11, 21-17తో లినో మునోజ్ (మెక్సికో)పై గెలుపొందాడు.

 
జ్వాల-అశ్విని జంట అవుట్

బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ ఈవెంట్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట కథ ముగిసింది. నాకౌట్‌కు చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన రెండో మ్యాచ్‌లో ఈ భారత నంబర్‌వన్ జోడీ ఓడిపోయింది. ఎఫ్జీ ముస్కెన్స్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్) ద్వయంతో జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో జ్వాల-అశ్విని జోడీ 16-21, 21-16, 17-21తో ఓటమి చవిచూసింది. తొలి మ్యాచ్‌లోనూ జ్వాల జంట ఓడిన సంగతి తెలిసిందే. ఈ గ్రూప్‌లో రెండేసి విజయాలు సాధించిన మిసాకి-అయాక (జపాన్), ఎఫ్జీ ముస్కెన్స్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్) క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు.


పురుషుల డబుల్స్ విభాగంలో సుమీత్ రెడ్డి-మను అత్రి జోడి పోరాటం కూడా ముగిసింది. ఈ భారత జంటకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో సుమీత్-మను అత్రి 13-21, 15-21తో బియావో చాయ్-వీ హాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement