భారత క్రికెట్కు కోచ్ ఎవరైతే ఏంటి?
బెంగళూరు: భారత క్రికెట్ కోచ్ విషయంలో తాను రాజకీయాలు కోరుకోవడం లేదని ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జెఫ్ థాంప్సన్ స్పష్టం చేశాడు. భారత క్రికెట్కు కోచ్ గా విదేశీ వ్యక్తి వచ్చినా, లేక స్వదేశీ వ్యక్తిని అపాయింట్ చేసినా అది పెద్ద విషయం కాదన్నాడు. అయితే ఈ విషయంలో రాజకీయ జోక్యాన్ని మాత్రం తాను కోరుకోవడం లేదన్నాడు. 'భారత్ జట్టు ప్రస్తుతం చాలా మెరుగ్గా ఉంది. మరికొంత కాలం కూడా అంతర్జాతీయ క్రికెట్లో భారత ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ తరుణంలో భారత్ క్రికెట్కు కోచ్ గా ఎవర్ని నియమించినా పెద్దగా సమస్య అనేది ఉండదు' అని థాంప్సన్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నాడు. విదేశాల నుంచి తమ వాళ్లు కూడా కొంతమందిని కోచ్లగా నియమిస్తూ పెద్ద చర్చకు తెరలేపుతున్నారన్నాడు. అసలు జాతీయ క్రికెట్ కోచ్ల నియామకం వెనుక ఏమి జరుగుతుందనేది తనకు తెలియదన్నాడు.ఒకవేళ ఇందులో రాజకీయ కోణాలు ఏమైనా ముడి పడి ఉంటే తాను అక్కడకు వెళ్లే ప్రసక్తే లేదని థాంప్సన్ అన్నాడు.