Jeff Thomson
-
'బుమ్రాకు ఇది ఆలోచించుకోవాల్సిన సమయం'
టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి గాయం తిరగబెట్టడంతో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. బుమ్రా లేకపోవడం టీమిండియాకు పెద్ద మైనస్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెన్నునొప్పి నుంచి కోలుకొని ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌కు ఎంపికయిన బుమ్రా ఒక్క మ్యాచ్ ఆడాడో లేదో మళ్లీ వెన్నునొప్పి తిరగబెట్టింది. దీంతో దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌తో పాటు టి20 ప్రపంచకప్‌కు కూడా దూరం కావాల్సి వచ్చింది. ఇక బుమ్రా ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. ఇలా మూడు ఫార్మట్లలో రెగ్యులర్ బౌలర్‌గా కొనసాగడం వల్లే బుమ్రా తరచూ గాయాలపాలవుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జెఫ్ థామ్సన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు వచ్చిన బ్రేక్ బుమ్రా ఆలోచించుకోవాల్సిన సమయం.. మూడు ఫార్మాట్లలో కొనసాగాలా లేక ఏదైనా ఒక ఫార్మాట్ నుంచి తప్పుకోవాలా అనే నిర్ణయంపై అతని భవిష్యత్తు ఆధారపడి ఉందని తెలిపాడు. ''మూడు ఫార్మాట్లలో ఆడిన బుమ్రా అతడి శరీరానికి శ్రమను కల్పించుకున్నాడు. అందువల్లే తరచూ గాయాల బారీన పడాల్సి వస్తుంది. దీంతో భవిష్యత్తులో ఏం చేయాలని అనుకుంటున్నాడో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత బుమ్రాపై ఉంది. ఆటగాడి కెరీర్లో ఒక దశాబ్దం పాటు మాత్రమే అత్యుత్తమ స్థాయిలో బౌలింగ్ చేయగలడు. ఆ తర్వాత నుంచి కెరీర్ ఉత్తమంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి.. సుదీర్ఘకాలం దేశం కోసం సేవ చేయడంలో ఏం సహాయపడుతుందో తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉన్న మూడు ఫార్మాట్లలో బుమ్రా వైట్‌బాల్ క్రికెట్(వన్డే, టి20) ఏంచుకోవడం ఉత్తమం. క్రికెట్ అభిమానులు బుమ్రాను ఎక్కువగా వైట్‌బాల్ క్రికెట్లో చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే వైట్‌బాల్ క్రికెట్లో తరచుగా ప్రపంచకప్ టోర్నీలు జరుగుతుంటాయి. ఇలా వైట్‌బాల్ క్రికెట్లో బుమ్రా టీమిండియా తరపున ఆడి ప్రపంచకప్ అందిస్తే చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. అందుకే నా వరకు బుమ్రా వైట్‌బాల్ క్రికెట్ ఆడడం అతనికి నేనిచ్చే సలహా. కానీ బుమ్రా నిర్ణయం అతని వ్యక్తిగతం. బుమ్రాకు ఏం చేయాలని అనిపిస్తే అదే నిర్ణయం తీసుకుంటాడు'' అని పేర్కొన్నాడు. ఇక బుమ్రా టి20 ప్రపంచకప్‌కు దూరమైనప్పటకి ఆ ప్రభావం టీమిండియాపై అంతగా కనిపించలేదు. బుమ్రా స్థానంలో వచ్చిన షమీ ఆకట్టుకునే బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రా, అర్ష్‌దీప్‌లతో పాటు స్పిన్నర్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా అదరగొట్టడం కలిసొచ్చే అంశం. ఇకపై కూడా టీమిండియా బౌలర్లు కలిసికట్టుగా రాణించి టైటిల్ అందించాలని కోరుకుందాం. ఇక పాక్, నెదర్లాండ్స్‌పై వరుస విజయాల ద్వారా టీమిండియా ఆదివారం(అక్టోబర్ 30న) సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సెమీస్ బెర్తు దాదాపు ఖరారు అయినట్లే. చదవండి: సమయం ఆసన్నమైంది.. వారిద్దరిని విడదీయాల్సిందే! -
ప్రసిద్ద్ కృష్ణ.. మేడిన్ ఆస్ట్రేలియా
పూణే: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో సంచలన ప్రదర్శన(4/54)తో ఆకట్టుకున్న టీమిండియా నయా పేస్ టాలెంట్ ప్రసిద్ద్ కృష్ణ.. ఆసీస్ లెజెండరీ పేసర్ జెఫ్ థామ్సన్ శిష్యరికంలో రాటు దేలాడు. థామ్సన్ ఇచ్చిన చిట్కాలతో తన పేస్‌కు పదును పెట్టాడు. స్వతహాగా ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్ లీ అభిమాని అయిన ఆయన.. ఆస్ట్రేలియా పిచ్‌లపై కఠోర సాధన చేశాడు. అలాగే ఎంఆర్ఎఫ్ అకాడమీలో ఆసీస్ ఆల్ టైమ్ గ్రేట్ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ వద్ద కూడా శిక్షణ తీసుకున్నాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ల సూచనలు, సలహాలతో పాటు కఠోర సాధనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ కర్ణాటక కుర్రాడు.. టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంగా ఉద్భవించాడు. కాగా, పూణేలోని ఎమ్సీఏ మైదానం వేదికగా జరిగిన తొలి వన్డేలో కృనాల్ పాండ్యాతో పాటు వన్డే క్యాప్‌ను అందుకున్న ప్రసిద్ద్.. మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రదర్శనతో అదరగొట్టాడు. కీలక సమయంలో జేసన్ రాయ్ (46), ప్రమాదకర బెన్ స్టోక్స్ (1)ను ఔట్ చేసి ఇంగ్లండ్ పతనాన్ని ప్రారంభించి, ఆతరువాత మిడిల్ ఓవర్లలో సామ్ బిల్లింగ్స్ (18), టామ్ కర్రన్ (11) వికెట్లు తీసి ఇంగ్లండ్ ఓటమిని ఖరారు చేశాడు. మొత్తం 8.1 ఓవర్లు బౌల్ చేసిన ఆయన.. 54 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతను వన్డే అరంగేట్రంలో ఏ భారత బౌలర్‌కు సాధ్యపడని నాలుగు వికెట్ల ఘనతను సాధించాడు. చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత దాయాదుల క్రికెట్ పోరు..? -
భారత క్రికెట్‌కు కోచ్ ఎవరైతే ఏంటి?
బెంగళూరు: భారత క్రికెట్ కోచ్ విషయంలో తాను రాజకీయాలు కోరుకోవడం లేదని ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జెఫ్ థాంప్సన్ స్పష్టం చేశాడు. భారత క్రికెట్‌కు కోచ్ గా విదేశీ వ్యక్తి వచ్చినా, లేక స్వదేశీ వ్యక్తిని అపాయింట్ చేసినా అది పెద్ద విషయం కాదన్నాడు. అయితే ఈ విషయంలో రాజకీయ జోక్యాన్ని మాత్రం తాను కోరుకోవడం లేదన్నాడు. 'భారత్ జట్టు ప్రస్తుతం చాలా మెరుగ్గా ఉంది. మరికొంత కాలం కూడా అంతర్జాతీయ క్రికెట్లో భారత ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ తరుణంలో భారత్ క్రికెట్‌కు కోచ్ గా ఎవర్ని నియమించినా పెద్దగా సమస్య అనేది ఉండదు' అని థాంప్సన్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నాడు. విదేశాల నుంచి తమ వాళ్లు కూడా కొంతమందిని కోచ్‌లగా నియమిస్తూ పెద్ద చర్చకు తెరలేపుతున్నారన్నాడు. అసలు జాతీయ క్రికెట్ కోచ్‌ల నియామకం వెనుక ఏమి జరుగుతుందనేది తనకు తెలియదన్నాడు.ఒకవేళ ఇందులో రాజకీయ కోణాలు ఏమైనా ముడి పడి ఉంటే తాను అక్కడకు వెళ్లే ప్రసక్తే లేదని థాంప్సన్ అన్నాడు. -
శార్దూల్ ఎంపికపై ఆసీస్ దిగ్గజం హర్షం
న్యూఢిల్లీ: త్వరలో వెస్టిండీస్‌కు వెళ్లే భారత క్రికెట్ జట్టులో ముంబై పేసర్ శార్దూల్ ఠాకూర్‌కు స్థానం కల్పించడంపై ఆసీస్ దిగ్గజ బౌలర్ జెఫ్ థాంప్సన్ హర్షం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్ టూర్‌తో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేయబోతున్న శార్దూల్ కచ్చితంగా విజయవంతమవుతాడని స్పష్టం చేశాడు. ఒకవేళ విండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో శార్దూల్ అవకాశం ఇవ్వకపోతే తాను చాలా నిరాశ చెందేవాడినని థాంప్సన్ తెలిపాడు. ' శార్దూల్‌లో కష్టించే తత్వం ఎక్కువ. అతని రెండు సంవత్సరాల కష్టమే జట్టులో స్థానం దక్కేలా చేసింది. ఆ టాలెంట్ క్రికెటర్‌కు చోటు దక్కకపోతే చాలా నిరూత్సాహపడేవాన్ని. అతని ఎంపిక సరైనదే'అని థాంప్సన్ తెలిపాడు.