భారత్ ‘ఎ’దే సిరీస్
♦ మూడో వన్డేలో టీమిండియా గెలుపు
♦ సురేశ్ రైనా సెంచరీ
♦ రాణించిన సంజూ శామ్సన్
బెంగళూరు : తొలి రెండు మ్యాచ్‌ల్లో నిరాశపర్చిన సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా (94 బంతుల్లో 104; 9 ఫోర్లు, 1 సిక్స్) మూడో వన్డేలో చెలరేగిపోయాడు. బంగ్లాదేశ్ ‘ఎ’ బౌలర్లను ఊచకోత కోస్తూ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ ‘ఎ’ జట్టు 75 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) బంగ్లాదేశ్ ‘ఎ’పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఉన్ముక్త్ చంద్ సారథ్యంలోని టీమిండియా ‘ఎ’ 2-1తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 297 పరుగులు చేసింది.
సంజూ శామ్సన్ (99 బంతుల్లో 90; 10 ఫోర్లు, 1 సిక్స్), ఉన్ముక్త్ చంద్ (68 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్), రిషి ధావన్ (15 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ఉన్ముక్త్ చంద్‌తో కలిసి రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించిన శామ్సన్... రైనాతో కలిసి మూడో వికెట్‌కు 116 పరుగులు సమాకూర్చాడు. షఫీయుల్ ఇస్లామ్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు రెండుసార్లు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో లక్ష్యాన్ని 32 ఓవర్లలో 217 పరుగులుగా నిర్దేశించారు. షబ్బీర్ (41), మోమినుల్ (37) మినహా మిగతా వారు విఫలం కావడంతో బంగ్లాదేశ్ 6 వికెట్లకు 141 పరుగులే చేసి ఓడింది. అరవింద్, కుల్దీప్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.