
కొలంబో: ఆసియా కప్ మహిళల ఎమర్జింగ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. శ్రీలంక మహిళల జట్టుతో మంగళవారం జరిగిన ఫైనల్లో దేవిక వైద్య నాయకత్వంలోని టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 14 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. తనుశ్రీ సర్కార్ (47; 4 ఫోర్లు), సిమ్రన్ బహదూర్ (34; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. భారత ఇన్నింగ్స్ తర్వాత వర్షం రావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతితో శ్రీలంక లక్ష్యాన్ని 35 ఓవర్లలో 150 పరుగులుగా సవరించారు. శ్రీలంక 34.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో తనుజా కన్వర్ (4/15), దేవిక వైద్య (4/29) నాలుగేసి వికెట్లు తీసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.