176 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో తొలి 10 ఓవర్లలో స్కోరు 3 వికెట్లకు 47 పరుగులు... ఈ స్కోరు చూస్తేనే చెన్నై సూపర్ కింగ్స్ ఎలా ఆడిందో అర్థమవుతుంది. పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో మాజీ చాంపియన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ చేతులెత్తేసింది. ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడకపోవడంతో ధోని సేనకు భారీ పరాజయం ఎదురైంది. మరోవైపు ముందుగా పరిస్థితికి తగినట్లుగా సాగిన బ్యాటింగ్, ఆ తర్వాత చక్కటి బౌలింగ్‌తో ఢిల్లీ మరో విజయాన్ని అందుకుంది. ఏ ఒక్కరో కాకుండా సమష్టి ప్రదర్శన క్యాపిటల్స్‌ను గెలిపించింది.
దుబాయ్: శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. శుక్రవారం జరిగిన ఐపీఎల్ టి20 మ్యాచ్‌లో ఢిల్లీ 44 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పృథ్వీ షా (43 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. రిషభ్ పంత్ (25 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు), శిఖర్ ధావన్ (27 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (35 బంతుల్లో 43; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... రబడ 3 వికెట్లు పడగొట్టాడు. గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌తో నెగ్గిన ఢిల్లీకి ఈ విజయంతో తమ సత్తాను ప్రదర్శించింది.
భారీ భాగస్వామ్యం...
ఢిల్లీ ఇన్నింగ్స్ సరిగ్గా రెండు ‘సమ భాగాలు’గా సాగింది. తొలి 10 ఓవర్లలో 88 పరుగులు చేసిన ఆ జట్టు తర్వాతి 10 ఓవర్లలో 87 పరుగులు చేయగలిగింది. చహర్ వేసిన తొలి ఓవర్ రెండో బంతి తన బ్యాట్‌కు తగిలి కీపర్ ధోని చేతుల్లో పడినా ఎవరూ అప్పీల్ చేయకపోవడంతో బతికిపోయిన పృథ్వీ షా తర్వాతి రెండు బంతుల్లో ఫోర్లు కొట్టి జోరును ప్రదర్శించాడు. తర్వాత స్యామ్ కరన్, పీయూష్ చావ్లా ఓవర్లలోనూ అతను రెండేసి ఫోర్లు కొట్టాడు. అయితే పవర్‌ప్లేలో ఢిల్లీ 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరోవైపు తొలి 15 బంతుల పాటు ఒక్క ఫోర్ కూడా కొట్టని ధావన్ ఎట్టకేలకు జడేజా బంతిని భారీ సిక్సర్‌గా మలచి బౌండరీల బోణీ చేశాడు.
ఆ తర్వాత చావ్లా ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన షా 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చావ్లా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌నకు ప్రయత్నించి ధావన్ అవుట్ కావడంతో 94 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే షా అవుటైనా... పంత్, శ్రేయస్ అయ్యర్ (22 బంతుల్లో 26; 1 ఫోర్) భాగస్వామ్యం ఢిల్లీని నడిపించింది. అయితే ఆశించిన మెరుపులు క్యాపిటల్స్ నుంచి రాలేదు. వీరిద్దరు 40 బంతుల్లో 58 పరుగులు జోడించారు. చివర్లో హాజల్‌వుడ్ వేసిన 18వ, 20వ ఓవర్లలో కలిపి 5 ఫోర్లు సహా మొత్తం 25 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ మెరుగైన స్కోరు సాధించగలిగింది.
డు ప్లెసిస్ మినహా..
10 ఓవర్లలో 3 వికెట్లకు 47 పరుగులు... ఛేదనలో సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి చెన్నై స్కోరిది. ఆరంభం నుంచి ఆ జట్టు బ్యాటింగ్ తడబాటుకు లోనైంది. ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నెమ్మదిగా ఆడిన ఇద్దరు ఓపెనర్లు విజయ్ (15 బంతుల్లో 10; ఫోర్), వాట్సన్ (16 బంతుల్లో 14; ఫోర్, సిక్స్) తక్కువ వ్యవధిలోనే వెనుదిరగ్గా, అవకాశం లేని చోట పరుగుకు ప్రయత్నించి రుతురాజ్ గైక్వాడ్ (10 బంతుల్లో 5) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో డు ప్లెసిస్ కాస్త ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. 22 పరుగుల వద్ద అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను హెట్‌మైర్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. కేదార్ జాదవ్ (21 బంతుల్లో 26; 3 ఫోర్లు) కొంత పోరాడినా పెద్దగా జట్టుకు పనికి రాలేదు.
ధోని మళ్లీ మళ్లీ...
చాలా కాలం తర్వాత క్రికెట్ ఆడుతున్నాను కాబట్టి నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకుంటున్నానని గత మ్యాచ్‌లో చెప్పిన ధోని ఈసారి కూడా ప్రభావం చూపలేకపోయాడు. 26 బంతుల్లో 78 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆరో స్థానంలో బరిలోకి దిగిన ధోని మరోసారి పరుగులు సాధించడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కుర్రాడు అవేశ్ ఖాన్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టినా, చివరకు కొండంత లక్ష్యం ముందు చేతులెత్తేయాల్సి వచ్చింది. 12 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన అనంత రం చివరి ఓవర్ మూడో బంతికి రబడ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో కాస్త ముందుగా వచ్చి పాత ధోని తరహాలో జట్టును గెలిపించాలని కోరుకుంటున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (స్టంప్డ్) ధోని (బి) పీయూష్ చావ్లా 64; శిఖర్ ధావన్ (ఎల్బీ) (బి) పీయూష్ చావ్లా 35; రిషభ్ పంత్ (నాటౌట్) 37; శ్రేయస్ అయ్యర్ (సి) ధోని (బి) స్యామ్ కరన్ 26; స్టొయినిస్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 175.
వికెట్ల పతనం: 1–94; 2–103; 3–161.
బౌలింగ్: దీపక్ చహర్ 4–0–38–0; స్యామ్ కరన్ 4–0– 27–1; హాజల్‌వుడ్ 4–0–28–0; పీయూష్ చావ్లా 4–0–33–2; జడేజా 4–0–44–0.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: మురళీ విజయ్ (సి) రబడ (బి) నోర్జే 10; షేన్ వాట్సన్ (సి) హెట్‌మైర్ (బి) అక్షర్ పటేల్ 14; డు ప్లెసిస్ (సి) రిషభ్ పంత్ (బి) రబడ 43; రుతురాజ్ గైక్వాడ్ (రనౌట్) 5; కేదార్ జాదవ్ (ఎల్బీ) (బి) నోర్జే 26; ధోని (సి) రిషభ్ పంత్ (బి) రబడ 15; రవీంద్ర జడేజా (సి) అమిత్ మిశ్రా (బి) రబడ 12; స్యామ్ కరన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 131.
వికెట్ల పతనం: 1–23; 2–34; 3–44; 4–98; 5–113; 6–130; 7–131.
బౌలింగ్: రబడ 4–0–26–3; అక్షర్ పటేల్ 4–0–18–1; నోర్జే 4–0–21–2; అవేశ్ ఖాన్ 4–0–42–0; అమిత్ మిశ్రా 4–0–23–0.
Comments
Please login to add a commentAdd a comment