షార్జా మైదానం నిరాశపర్చలేదు. మరో మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి పరుగుల వరద పారించాయి. మొత్తం 438 పరుగులు, 28 సిక్సర్లు నమోదు కాగా... అంతిమంగా ఢిల్లీ క్యాపిటల్స్‌దే పైచేయి అయింది. ఇరు జట్లు భారీ షాట్లు, సిక్సర్లతో పోటీ పడిన పోరులో కోల్‌కతా వెనుకబడిపోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుపు బ్యాటింగ్‌కు మరో ఇద్దరు యువ ఆటగాళ్లు పృథ్వీ షా, రిషభ్ పంత్ జత కలవడంతో క్యాపిటల్స్ దూసుకుపోయింది. ఛేదనలో నితీశ్ రాణా, మోర్గాన్, త్రిపాఠి దూకుడుగా ఆడినా అది కోల్‌కతాకు విజయం అందించేందుకు సరిపోలేదు.
షార్జా: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సమష్టి ప్రదర్శనతో మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ‘టాప్’లోకి వెళ్లింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 18 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (38 బంతుల్లో 88 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా... పృథ్వీ షా (41 బంతుల్లో 66; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్ పంత్ (17 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 210 పరుగులు చేసింది. నితీశ్ రాణా (35 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, ఇయాన్ మోర్గాన్ (18 బంతుల్లో 44; 1 ఫోర్, 5 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (16 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిపించారు.
పృథ్వీ షా దూకుడు...
టాప్–4 బ్యాట్స్‌మెన్ అందరూ దూకుడుగా ఆడటంతో ఢిల్లీ భారీ స్కోరు సాధ్యమైంది. జట్టు ఇన్నింగ్స్‌లో మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు ఉండటం విశేషం. చిన్న మైదానాన్ని బాగా ఉపయోగించుకుంటూ అంతా షాట్లతో చెలరేగారు. కమిన్స్ ఓవర్లో పృథ్వీ షా వరుసగా ఫోర్, సిక్స్ కొట్టగా మరో వైపు నరైన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లతో శిఖర్ ధావన్ (16 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడు. పవర్‌ప్లే ముగిసేసరికి ధావన్ వికెట్ కోల్పోయి ఢిల్లీ 57 పరుగులు చేసింది. ఆ తర్వాత షా, అయ్యర్ ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు రాబట్టారు. మావి, నరైన్, నాగర్‌కోటి వేసిన మూడు ఓవర్లలో కలిపి ఢిల్లీ 41 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో 35 బంతుల్లో షా అర్ధ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు షా వికెట్ తీసి నాగర్‌కోటి ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు.
4 ఓవర్లలో 70 పరుగులు...
15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 151/2. ఈ దశలో అయ్యర్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్ ఆశించిన విధంగా మరో ఎండ్‌నుంచి పంత్ కూడా చక్కటి సహకారం అందించడంతో క్యాపిటల్స్ దూసుకుపోయింది. మావి ఓవర్లో పంత్ మూడు ఫోర్లు కొట్టగా, కమిన్స్ ఓవర్లో అయ్యర్ 2 ఫోర్లు, సిక్సర్‌తో చెలరేగాడు. రసెల్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదిన పంత్ తర్వాతికి వెనుదిరగడంతో 72 పరుగుల (31 బంతుల్లో) పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. వరుణ్ వేసిన మరుసటి ఓవర్లో అయ్యర్ 2 సిక్సర్లు, ఫోర్ బాదడంతో మొత్తం 20 పరుగులు లభించాయి. అయితే రసెల్ వేసిన చివరి ఓవర్లో మాత్రం ఢిల్లీ 7 పరుగులే చేయగలిగింది. 19వ ఓవర్ ముగిసేసరికి 88 పరుగుల వద్ద నిలిచిన అయ్యర్‌కు ఆఖరి ఓవర్లో ఒక్క బంతి కూడా ఆడే అవకాశం రాకపోవడంతో సెంచరీ సాధ్యం కాలేదు.
రసెల్ సూపర్...
ప్రత్యర్థి జట్టు 228 పరుగుల భారీ స్కోరు నమోదు చేసిన ఇన్నింగ్స్‌లో ఒక బౌలర్ 4 ఓవర్లలో 29 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీయడం అంటే విశేషంగానే చూడాలి. అలాంటి చక్కటి బౌలింగ్‌తో ఆండ్రీ రసెల్ ఆకట్టుకున్నాడు. తన నాలుగు ఓవర్లలో 4, 3, 15, 7 చొప్పున పరుగులు ఇచ్చిన రసెల్ 11 డాట్ బాల్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు.
రాణించిన రాణా...
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. రెండో ఓవర్లోనే నరైన్ (3) అవుట్ కాగా, శుబ్‌మన్ గిల్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) తడబడ్డాడు. రబడతో పాటు స్పిన్నర్ అమిత్ మిశ్రా బ్యాట్స్‌మెన్‌ను పూర్తిగా కట్టి పడేయడంతో ఒత్తిడికి లోనైన కోల్‌కతా తక్కువ వ్యవధిలో వికెట్లు చేజార్చుకుంది. ఒక్క రాణా మాత్రమే కాస్త గట్టిగా నిలబడ్డాడు. అశ్విన్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో ఆకట్టుకున్న అతను 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రసెల్ (13)... రబడ మాయలో పడగా, కెప్టెన్ కార్తీక్ (6) తన వైఫల్యాన్ని కొనసాగించాడు. రాణా, కార్తీక్ వరుస బంతుల్లో అవుట్ కావడంతోనే కోల్‌కతా గెలుపు ఆశలు సన్నగిల్లాయి. అయితే మోర్గాన్, త్రిపాఠి కలిసి దూకుడుగా ఆడటంతో పరిస్థితి మళ్లీ నైట్‌రైడర్స్‌కు అనుకూలంగా కనిపించింది. తొలి బంతినే సిక్సర్‌గా మలచిన మోర్గాన్ తర్వాతా చెలరేగిపోయాడు. అయితే 10 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన స్థితిలో అతను అవుట్ కావడంతో ఢిల్లీ గెలుపు ఖాయమైంది.
8 బంతుల్లో 42 పరుగులు
మోర్గాన్, త్రిపాఠి కలిసి కోల్‌కతాను గెలిపించేలా కనిపించారు. ఒక దశలో వీరిద్దరు 9 వరుస బంతుల్లో కలిపి 42 పరుగులు రాబట్టారు. స్టొయినిస్ ఓవర్లో త్రిపాఠి 3 సిక్సర్లు, ఫోర్ కొట్టగా...రబడ ఓవర్లో తొలి మూడు బంతుల్లో మోర్గాన్ వరుసగా భారీ సిక్సర్లు కొట్టాడు.
ఇదేం ఎంపిక?
ఛేదనలో కోల్‌కతా వ్యూహాలు ఆశ్చర్యంగా అనిపించాయి. తొలిసారి రాహుల్ త్రిపాఠిని తుది జట్టులోకి తీసుకున్న కోల్‌కతా అసలు అతడున్నాడనే విషయమే మరచిపోయినట్లుంది! త్రిపాఠి రెగ్యులర్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. దేశవాళీ క్రికెట్‌లో, గత ఐపీఎల్‌లలో కూడా అతను ఓపెనర్‌గానే ఆడాడు. కనీసం మిడిలార్డర్‌లో కూడా ఎప్పుడూ ఆడలేదు. కానీ ఈ మ్యాచ్‌లో అతడిని కేకేఆర్ ఎనిమిదో స్థానంలో (బౌలర్ కమిన్స్ తర్వాత) ఆడించింది. నరైన్ వరుసగా విఫలమవుతున్నా సరే... అతడే ఓపెనర్‌గా తమ పాత వ్యూహాన్ని కొనసాగిస్తున్న ఆ జట్టు త్రిపాఠికి మాత్రం అసలు అవకాశం ఇవ్వలేదు. చివర్లో చెలరేగి త్రిపాఠి తన సత్తా ఏమిటో చూపించాడు.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) శుబ్‌మన్ (బి) నాగర్‌కోటి 66; ధావన్ (సి) మోర్గాన్ (బి) వరుణ్ 26; అయ్యర్ (నాటౌట్) 88; పంత్ (సి) మావి (బి) రసెల్ 38; స్టొయినిస్ (సి) వరుణ్ (బి) రసెల్ 1; హెట్‌మైర్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 228.
వికెట్ల పతనం: 1–56; 2–129; 3–201; 4–221.
బౌలింగ్: కమిన్స్ 4–0–49–0; శివమ్ మావి 3–0–40–0; వరుణ్ 4–0–49–1; నరైన్ 2–0–26–0; రసెల్ 4–0–29–2; నాగర్‌కోటి 3–0–35–1.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ (సి) పంత్ (బి) మిశ్రా 28; నరైన్ (బి) నోర్జే 3; రాణా (సబ్) అక్షర్ (బి) హర్షల్ 58; రసెల్ (సి) పంత్ (బి) రబడ 13; కార్తీక్ (సి) ధావన్ (బి) హర్షల్ 6; మోర్గాన్ (సి) హెట్‌మైర్ (బి) నోర్జే 44; కమిన్స్ (సి) హర్షల్ (బి) నోర్జే 5; త్రిపాఠి (బి) స్టొయినిస్ 36; నాగర్‌కోటి (నాటౌట్) 3; మావి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 210.
వికెట్ల పతనం: 1–8; 2–72; 3–94; 4–117; 5–117; 6–122; 7–200; 8–207.
బౌలింగ్: రబడ 4–0–51–1; నోర్జే 4–0–33–3; అశ్విన్ 2–0–26–0; స్టొయినిస్ 4–0–46–1; హర్షల్ 4–0–34–2; అమిత్ మిశ్రా 2–0–14–1.
Comments
Please login to add a commentAdd a comment