IPL 2024, DC VS KKR: ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్‌ | IPL 2024 Delhi Capitals Vs Kolkata Knight Riders Match Updates And Highlights | Sakshi
Sakshi News home page

IPL 2024, DC VS KKR: ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్‌

Published Wed, Apr 3 2024 7:03 PM | Last Updated on Wed, Apr 3 2024 11:28 PM

IPL 2024 Delhi Capitals Vs Kolkata Knight Riders Match Updates And Highlights - Sakshi

ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్‌
ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 3) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. సునీల్‌ నరైన్‌ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్‌ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్‌ (8 బంతుల్లో 26; ఫోర్‌, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే 3, ఇషాంత్‌ శర్మ 2, ఖలీల్‌ అహ్మద్‌, మిచెల్‌ మార్ష్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో​కి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసింది. రిషబ్‌ పంత్‌ (55), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్‌ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్‌ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్‌, పోరెల్‌, అక్షర్‌ డకౌట్లయ్యారు. కేకేఆర్‌ బౌలర్లలో వైభవ్‌ అరోరా, వరుణ్‌ చక్రవర్తి అద్భుతంగా బౌల్‌ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్‌ 2, రసెల్‌, నరైన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. పంత్‌ ఔట్‌
మెరుపు అర్దశతకం బాదిన అనంతరం పంత్‌ (55) ఔటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

చితక్కొడుతున్న పంత్‌.. 23 బంతుల్లో ఫిఫ్టి
వెంకటేశ్‌ అయ్యర్‌ వేసిన 12వ ఓవర్‌లో పంత్‌ చెలరేగిపోయాడు. నాలుగు ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు పిండుకున్నాడు. పంత్‌ 23 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని కేవలం 23 బంతుల్లోనే పూర్తి చేశాడు. 12 ఓవర్లలో ఢిల్లీ స్కోర్‌ 125/4గా ఉంది.

పోరాడుతున్న పంత్‌, స్టబ్స్‌
273 పరుగల లక్ష్య ఛేదనలో 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీని రిషబ్‌ పంత్‌ (11 బంతుల్లో 23; 3 సిక్సర్లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 9 ఓవర్ల అనంతరం ఢిల్లీ స్కోర్‌ 83/4గా ఉంది.

పేకమేడలా కూలుతున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కూలుతుంది. 33 పరుగులకే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. స్టార్క్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన అనంతరం వార్నర్‌ (18) ఔటయ్యాడు. 5 ఓవర్లలో ఢిల్లీ స్కోర్‌ 40/4గా ఉంది. రిషబ్‌ పంత్‌ (6), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
27 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్‌ కోల్పోయింది. వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో సునీల్‌ నరైన్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ పోరెల్‌ (0) ఔటయ్యాడు. 

రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
26 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. స్టార్క్‌ బౌలింగ్‌లో రమన్‌దీప్‌కు క్యాచ్‌ ఇచ్చి మిచెల్‌ స్టార్క్‌ (0) ఔటయ్యాడు.డేవిడ్‌ వార్నర్‌కు (11) జతగా అభిషేక్‌ పోరెల్‌ (0) క్రీజ్‌లోకి వచ్చాడు.

273 పరుగుల లక్ష్యం.. తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
273 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 21 పరుగుల వద్ద వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో వరుణ్‌ చక్రవర్తికి క్యాచ్‌ ఇచ్చి పృథ్వీ షా (10) ఔటయ్యాడు. వార్నర్‌తో (10), మిచెల్‌ మార్ష్‌ జత కలిశాడు.

వీరంగం సృష్టించిన కేకేఆర్‌ బ్యాటర్లు.. ఐపీఎల్‌ చరిత్రలో రెండో భారీ స్కోర్‌
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ బ్యాటర్లు శివాలెత్తిపోయారు. టాపార్డర్‌ బ్యాటర్లు పోటాపోటీపడి విధ్వంసం సృష్టించారు.తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో రెండో భారీ స్కోర్‌ నమోదైంది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. సునీల్‌ నరైన్‌ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్‌ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్‌ (8 బంతుల్లో 26; ఫోర్‌, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. ఇదే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్‌ చేసిన 277 స్కోర్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. 

మూడో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌.. రఘువంశీ ఔట్‌
27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి అనంతరం రఘువంశీ ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్‌లో ఇషాంత్‌ శర్మ క్యాచ్‌ పట్టాడు. 14 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 181/3గా ఉంది. రసెల్‌ (9), శ్రేయస్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన రఘువంశీ
కేకేఆర్‌ యువ ఆటగాడు రఘువంశీ కేవలం 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 13 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 171/3గా ఉంది. రఘువంశీకి జతగా రసెల్‌ (5) క్రీజ్‌లో ఉన్నాడు. 

చితకబాది ఔటైన నరైన్‌.. కేకేఆర్‌ స్కోర్‌ 164/2
39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేసిన సునీల్‌ నరైన్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ మూడో బంతికి మిచెల్‌ మార్ష్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్‌ స్కోర్‌ 164/2గా ఉంది. రఘువంశీకి (49) జతగా రసెల్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 

10 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 135 పరుగులు చేసిన కేకేఆర్‌
సునీల్‌ నరైన్‌ (32 బంతుల్లో 74; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) , రఘువంశీ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్‌) ధాటికి కేకేఆర్‌ 10 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 135 పరుగులు చేసింది.  

21 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదిన నరైన్‌
కేకేఆర్‌ ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ శివాలెత్తిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే  6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా కేకేఆర్‌ 6 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 88 పరుగులు చేసింది.

తొలి వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
4.3వ ఓవర్‌: 60 పరుగుల వద్ద కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. నోర్జే బౌలింగ్‌లో ట్రిస్టన్‌ స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి సాల్ట్‌ (18) ఔటయ్యాడు.

విధ్వంసం సృష్టిస్తున్న సునీల్‌ నరైన్‌
కేకేఆర్‌ ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేశాడు. ఇషాంత్‌ వేసిన మూడో ఓవర్‌లో నరైన్‌ మూడు సిక్సర్లు, రెండు బౌండరీలు బాదాడు. ఫలితంగా ఆ ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. 4 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 58/0గా ఉంది. నరైన్‌తో పాటు ఫిలిప్‌ సాల్ట్‌ (16) క్రీజ్‌లో ఉన్నాడు. 

ఐపీఎల్‌ 2024లో భాగంగా విశాఖలోని వైఎస్‌ రాజశేఖర రెడ్డి స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్‌ 3) ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఢిల్లీ ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి ఏడో స్థానంలో నిలిచింది. 

తుది జట్లు..

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: ఫిలిప్ సాల్ట్(వికెట్‌కీపర్‌), వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్‌), రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలామ్, అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement