చెన్నై సూపర్‌గా ఆడి కింగ్స్ ఎలెవన్‌ను ఓడించింది. పంజాబ్ లక్ష్యం ఓపెనర్ల పంజాకే కరిగిపోయింది. ఓవర్లు గడిచేకొద్దీ పరుగులు పెరిగిపోతున్నాయి. కానీ ఒక్క వికెట్ కూడా పడకపోవడం కింగ్స్ ఎలెవన్ బౌలింగ్ వైఫల్యాన్ని వేలెత్తి చూపించింది. లీగ్‌లో ఇప్పటిదాకా 5 మ్యాచ్‌లాడిన పంజాబ్‌కు ఇది నాలుగో ఓటమి కాగా... సూపర్‌కింగ్స్ తమ ‘హ్యాట్రిక్’ పరాజయాలకు ఫుల్‌స్టాప్ పెట్టింది. టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది.
దుబాయ్: చెన్నై దర్జాగా చిందేసింది. ప్రత్యర్థి తమ ముందు గట్టి లక్ష్యాన్నే నిర్దేశించినా... ఓపెనర్లు వాట్సన్ (53 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), డుప్లెసిస్ (53 బంతుల్లో 87 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) వేసిన పరుగుల బాటతో సూపర్‌కింగ్స్ విజయబావుటా ఎగరేసింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోని బృందం 10 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ లోకేశ్ రాహుల్ (52 బంతుల్లో 63; 7 ఫోర్లు, 1 సిక్స్) స్కోరుబోర్డును నడిపించగా... పూరన్ (17 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించాడు. శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండానే 181 పరుగులు చేసి గెలిచింది. వాట్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కింగ్స్ తుది జట్టులో కరుణ్, గౌతమ్, నీషమ్‌లను పక్కనబెట్టి మన్‌దీప్, హర్‌ప్రీత్ బ్రార్, జోర్డాన్‌లను తీసుకోగా... చెన్నై మార్పులేకుండా గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది.
రాహుల్ ఫిఫ్టీ...
రాహుల్, మయాంక్ జోరు లేని శుభారంభమైతే ఇచ్చారు. అయితే వేగం పెరిగే దశలో మయాంక్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు) ఔటయ్యాడు. మన్‌దీప్ సింగ్... చావ్లా ఓవర్లో మిడ్‌వికెట్, డీప్ మికెట్‌ల మీదుగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. కానీ మరుసటి ఓవర్లోనే జడేజా అతని స్పీడ్‌కు కళ్లెం వేశాడు. దీంతో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ భారీ షాట్లే లక్ష్యమని బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జడేజా ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదా డు. ఓపెనర్ రాహుల్ ఆలస్యంగా 15వ ఓవర్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. శార్దుల్ వేసిన ఈ ఓవర్లో సిక్స్ సహా వరుసగా రెండు బౌండరీలు కూడా కొట్టాడు. మరోవైపు పూరన్ సిక్సర్లతో అలరించాడు. 9 పరుగుల రన్‌రేట్‌కు చేరిన ఈ దశలో 18వ ఓవర్ వేసిన శార్దుల్ వరుస బంతుల్లో పూరన్, రాహుల్‌లను ఔట్ చేయడంతో డెత్ ఓవర్లలో రావల్సినన్ని పరుగులు రాలేదు.
ఇద్దరే పూర్తి చేశారు...
చెన్నై తరఫున పరుగుల వేట ప్రారంభించింది ఇద్దరే. పరుగులన్నీ చకచకా చేసింది ఇద్దరే! లక్ష్యం చేరేదాకా నిలబడింది కూడా ఆ ఇద్దరే! ఆ ఇద్దరు ఇంకెవరో కాదు... ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లెసిస్. మొత్తం 18 ఓవర్లు వేయగా... ఇందులో రెండే రెండు ఓవర్లు (1, 13వ) బౌండరీకి దూరమయ్యాయి. కానీ 16 ఓవర్లు బౌండరీని చేరేందుకే ఇష్టపడినట్లుగా ఇద్దరి ఆట రమ్యంగా సాగిపోయింది. జట్టు 6వ ఓవర్లో 50, 10వ ఓవర్లో వంద పరుగుల్ని దాటింది. వాట్సన్ 31 బంతుల్లో (9 ఫోర్లు, 1 సిక్స్)... డుప్లెసిస్ 33 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఏదో భారీ షాట్‌కో లేదంటే లూజ్ షాట్‌కో పెవిలియన్ చేరతారనుకుంటే పొరపాటే! జట్టు గెలిచేదాకా ఒట్టు పెట్టుకుని ఆడినట్లే ఆడారు. ఓవర్‌కు 10 పరుగుల రన్‌రేట్‌తో చెన్నై దూసుకెళ్లింది. పది వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది.
2 ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 10 వికెట్ల విజయాన్ని అందుకోవడం ఇది రెండోసారి. 2013లోనూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పైనే చెన్నై జట్టు తొలి 10 వికెట్ల విజయాన్ని సాధించడం విశేషం. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 12 సార్లు 10 వికెట్ల తేడాతో విజయాలు నమోదయ్యాయి.
స్కోరు వివరాలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (సి) ధోని (బి) శార్దుల్ 63; మయాంక్ (సి) కరన్ (బి) పీయూశ్ 26; మన్‌దీప్ (సి) రాయుడు (బి) జడేజా 27; పూరన్ (సి) జడేజా (బి) శార్దుల్ 33; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 11; సర్ఫరాజ్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 178.
వికెట్ల పతనం: 1–61, 2–94, 3–152, 4–152.
బౌలింగ్: దీపక్ చహర్ 3–0–17–0, స్యామ్ కరన్ 3–0–31–0, శార్దుల్ 4–0–39–2, బ్రేవో 4–0–38–0, జడేజా 4–0–30–1, పీయూశ్ 2–0–22–1.
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (నాటౌట్) 83; డుప్లెసిస్ (నాటౌట్) 87; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 181.
బౌలింగ్: కాట్రెల్ 3–0–30–0, షమీ 3.4–0–35–0, హర్‌ప్రీత్ 4–0–41–0, జోర్డాన్ 3–0–42–0, రవి బిష్ణోయ్ 4–0–33–0.
Comments
Please login to add a commentAdd a comment