ఐపీఎల్‌లో అంబటి తిరుపతి రాయుడు అదరగొట్టాడు. ఇతర బ్యాట్స్‌మెన్ ఒక్కో పరుగు కోసం శ్రమిస్తున్న వేళ అలవోకగా పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు. 13వ సీజన్ తొలి మ్యాచ్‌లో తన జట్టుకు శుభారంభం అందించాడు. రాయుడుకు తోడు డు ప్లెసిస్ బ్యాటింగ్, అంతకుముందు బౌలర్ల ప్రదర్శన వెరసి చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ముంబైకి చెక్ పెట్టింది. రోహిత్ సేన చేతిలో వరుసగా ఐదు మ్యాచుల్లోనూ ఓడిన ధోని టీమ్ తాజా సీజన్‌ను విజయంతో మొదలు పెట్టింది. మరోవైపు బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో లీగ్ తొలి మ్యాచ్‌లలో తమ పేలవ రికార్డును ముంబై కొనసాగించింది. 2013 నుంచి వరుసగా ప్రతీ సీజన్‌ను ఓటమితోనే ఆరంభించిన ముంబైకి ఈసారీ పరాజయం తప్పలేదు. తొలి రోజు విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శనలు లేకపోయినా... సగటు అభిమానికి ఐపీఎల్ సంతోషం మొదలైంది.
అబుదాబి: ఐపీఎల్–2020లో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ బోణీ చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సౌరభ్ తివారి (31 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. క్వింటన్ డి కాక్ (20 బంతుల్లో 33; 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. చెన్నై బౌలర్లలో ఇన్‌గిడి 3 వికెట్లు పడగొట్టగా... దీపక్ చహర్, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అంబటి తిరుపతి రాయుడు (48 బంతుల్లో 71; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫాఫ్ డు ప్లెసిస్ (44 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 85 బంతుల్లో 115 పరుగులు జోడించారు.
రోహిత్ ఫోర్‌తో మొదలు...
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి శుభారంభం లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (12) తొలి బంతికి ఫోర్‌తో ఆట మొదలుపెట్టగా... డి కాక్ దూకుడును ప్రదర్శించాడు. వీరిద్దరు 28 బంతుల్లోనే 46 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరిని నాలుగు బంతుల వ్యవధిలోనే అవుట్ చేసి చెన్నై ఒత్తిడి పెంచింది. తర్వాతి బ్యాట్స్‌మెన్‌లో సౌరభ్ తివారి ఒక్కడే చెలరేగగా... మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడం ముంబైని దెబ్బ తీసింది. జడేజా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన హార్దిక్ పాండ్యా (14), ఆశలు పెట్టుకున్న పొలార్డ్ (18) కీలక సమయంలో వెనుదిరిగారు. చివరి 6 ఓవర్లలో 41 పరుగులు మాత్రమే చేయగలిగిన ముంబై 6 వికెట్లను కోల్పోయింది.
శతక భాగస్వామ్యం...
సూపర్ కింగ్స్ తమ ఛేదనను పేలవంగా ప్రారంభించింది. తొలి ఓవర్లోనే వాట్సన్ (4)ను బౌల్ట్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయగా... తర్వాతి ఓవర్ వేసిన ప్యాటిన్సన్... విజయ్ (1)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే డు ప్లెసిస్, రాయుడు భాగస్వామ్యం చెన్నైని ముందుకు నడిపించింది. రాయుడు దూకుడుగా ఆడగా, ప్లెసిస్ అతనికి అండగా నిలిచాడు. ప్లెసిస్ ప్రశాంతంగా తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ 42 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా (10) అవుటైన సమయంలో చెన్నై విజయానికి 17 బంతుల్లో 29 పరుగులు కావాల్సి ఉండగా... స్యామ్ కరన్ (6 బంతుల్లో 18; 1 ఫోర్, 2 సిక్సర్లు) చకచకా ఆడి చెన్నైని విజయానికి చేరువగా తెచ్చాడు.
ఆ రెండు క్యాచ్‌లు...
ముంబై ఇన్నింగ్స్ 15వ ఓవర్లో డు ప్లెసిస్ అందుకున్న రెండు క్యాచ్‌లు హైలైట్‌గా నిలిచాయి. జడేజా వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి సౌరభ్ తివారి కొట్టిన షాట్‌ను లాంగాన్ బౌండరీ వద్ద అద్భుతంగా అందుకున్న ప్లెసిస్... ఐదో బంతికి హార్దిక్ పాండ్యా షాట్‌కు లాంగాఫ్ బౌండరీ వద్ద ఎగిరి అందుకున్నాడు. ఇదే ఓవర్ ముంబైను
నియంత్రించడంలో కీలకంగా మారింది.
స్పెషల్ ఇన్నింగ్స్...
2 ఓవర్ల తర్వాత 2 వికెట్లకు 6 పరుగులు... ఈ స్కోరు వద్ద రాయుడు బ్యాటింగ్‌కు వచ్చాడు. ప్యాటిన్సన్ బౌలింగ్‌లో బ్యాక్‌ఫుట్‌పై కొట్టిన ఫోర్‌తో అతని జోరు మొదలైంది. బౌల్ట్ ఓవర్లో కొట్టిన కవర్ డ్రైవ్ బౌండరీ అయితే చూడముచ్చటగా అనిపించింది. బుమ్రా వేసిన వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ (ఫ్రీ హిట్) కొట్టిన అతను జోరు పెంచాడు. కృనాల్ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్ కొట్టిన అనంతరం రాయుడు... బుమ్రా ఓవర్లో కొట్టిన అద్భుతమైన స్ట్రెయిట్ బౌండరీతో 33 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా కొన్ని చూడచక్కటి షాట్లతో అలరించిన రాయుడు... చెన్నైకి గెలుపు బాట చూపించి రాహుల్ చహర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
436 రోజుల తర్వాత...
మహేంద్ర సింగ్ ధోని అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. మైదానంలో మహిని చూడాలని ఇంతకాలం ఎదురు చూసిన వారు ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ధోనిని చూసి సంబరపడ్డారు. తన గడ్డం స్టయిల్‌ను కూడా కాస్త మార్చుకొని అతను బరిలోకి దిగాడు. ధోని చివరిసారిగా 2019 జూలై 9–10 తేదీల్లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆడాడు. అంటే 436 రోజుల విరామం తర్వాత ఈ మాజీ కెప్టెన్ మళ్లీ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. అన్నట్లు ఆగస్టు 15న 19.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని... ఇప్పుడు 19.30 గంటలకు మళ్లీ దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌తో ఆటలోకి వచ్చాడు.
స్లిప్‌లో ఫీల్డర్‌ను ఉంచవచ్చా...
సరదాగా సింగిల్ పంచ్‌లు విసరడంలో ధోని తర్వాతే ఎవరైనా. మీడియా సమావేశాల్లో, మ్యాచ్ తర్వాత వ్యాఖ్యలు చేసే సమయంలో కూడా ఇది చాలా సార్లు కనిపించింది. తొలి మ్యాచ్‌లో టాస్ వేసే సమయంలో కూడా అతను ఇదే విషయాన్ని చెప్పాడు. ఐపీఎల్‌లో సోషల్ డిస్టెన్సింగ్ గురించి మాట్లాడుతూ ‘నేను కూడా రిఫరీని అడిగాను. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ పక్కన మొదటి స్లిప్‌లో ఫీల్డర్‌ను ఉంచవచ్చా... లేక డిస్టెన్స్ పాటించాలా’ అని ధోని నవ్వుతూ చెప్పాడు.
కరోనా బాధితుడితో మొదలు...
ఐపీఎల్ యూఏఈకి తరలిపోవడం, సెప్టెంబర్‌లో ఎట్టకేలకు టోర్నీ జరగడం... ఇలా అన్నింటికీ కరోనాయే కారణమనేది అందరికీ తెలిసిందే. లీగ్‌లో పాల్గొంటున్న జట్లు యూఏఈ చేరుకున్న తర్వాత ఇద్దరు చెన్నై ఆటగాళ్లు కోవిడ్–19 బారిన పడ్డారు. వీరిలో పేసర్ దీపక్ చహర్ కోలుకొని మళ్లీ మైదానంలోకి వచ్చాడు. ఇప్పుడు టోర్నీ తొలి బంతిని అతనే వేశాడు. కరోనా నేపథ్యంలో మొదలైన ఐపీఎల్‌కు ఇంతకంటే సరైన ఆరంభం ఉండదేమో.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) కరన్ (బి) చావ్లా 12; డి కాక్ (సి) వాట్సన్ (బి) కరన్ 33; సూర్యకుమార్ (సి) కరన్ (బి) చహర్ 17; సౌరభ్ తివారి (సి) డు ప్లెసిస్ (బి) జడేజా 42; హార్దిక్ (సి) డు ప్లెసిస్ (బి) జడేజా 14; పొలార్డ్ (సి) ధోని (బి) ఇన్‌గిడి 18; కృనాల్ (సి) ధోని (బి) ఇన్‌గిడి 3; ప్యాటిన్సన్ (సి) డు ప్లెసిస్ (బి) ఇన్‌గిడి 11; రాహుల్ చహర్ (నాటౌట్) 2; బౌల్ట్ (బి) చహర్ 0; బుమ్రా (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 162.
వికెట్ల పతనం: 1–46; 2–48; 3–92; 4–121; 5–124; 6–136; 7–151; 8–156; 9–156.
బౌలింగ్: దీపక్ చహర్ 4–0–32–2; స్యామ్ కరన్ 4–0–28–1; ఇన్‌గిడి 4–0–38–3; పీయూష్ చావ్లా 4–0–21–1; జడేజా 4–0–42–2.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: విజయ్ (ఎల్బీ) (బి) ప్యాటిన్సన్ 1; వాట్సన్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 4; డు ప్లెసిస్ (నాటౌట్) 58; రాయుడు (సి అండ్ బి) రాహుల్ చహర్ 71; జడేజా (ఎల్బీ) (బి) కృనాల్ 10; స్యామ్ కరన్ (సి) ప్యాటిన్సన్ (బి) బుమ్రా 18; ధోని (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 166.
వికెట్ల పతనం: 1–5; 2–6; 3–121; 4–134; 5–153.
బౌలింగ్: బౌల్ట్ 3.2–0–23–1; ప్యాటిన్సన్ 4–0–27–1; బుమ్రా 4–0–43–1; కృనాల్ 4–0–37–1; రాహుల్ చహర్ 4–0–36–1.
సాధారణంగా మేము వేసవి కాలంలోనూ ప్రాక్టీస్ చేస్తాం. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగాను. పిచ్ కూడా బాగుంది. ఉక్కబోత వాతావరణం ఉండే చెన్నై, దుబాయ్‌లలో ప్రాక్టీస్ చేయడం కలిసొచ్చింది. – ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాయుడు
Comments
Please login to add a commentAdd a comment