అద్భుత ప్రదర్శనతో సాధించిన వరుస విజయాలు అసలు సమయంలో అక్కరకు వచ్చాయి. వర్షంతో మైదానంలో అడుగు పెట్టకపోయినా విజయం మన జట్టును వెతుక్కుంటూ వచ్చింది. ఫలితంగా టి20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు తొలిసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇంగ్లండ్‌తో జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్‌లో వాన కారణంగా ఒక్క బంతి పడకపోయినా... లీగ్ దశలో అజేయంగా నిలిచిన హర్మన్ సేన తుది పోరుకు అర్హత సాధించింది. మెగా టోర్నీలో మనపై ఉన్న ఘనమైన రికార్డును కొనసాగించాలనుకున్న ఇంగ్లండ్‌ను వరుణుడు కరుణించకపోవడంతో నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇక లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో ఆదివారం ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించడమే భారత్ అంతిమ లక్ష్యం కానుంది.
సిడ్నీ: టి20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)లో ఇంగ్లండ్‌తో జరగాల్సిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. ఊహించినట్లుగానే సిడ్నీ నగరాన్ని వర్షం ముంచెత్తడంతో ఈ మ్యాచ్‌లో అసలు టాస్ వేయడం కూడా సాధ్యం కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అప్పటికీ వాన కురుస్తూనే ఉంది. ఆ తర్వాత సుదీర్ఘ సమయం పాటు ఎదురు చూసినా వాన తగ్గే అవకాశం కనిపించలేదు. దాంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. సెమీఫైనల్ మ్యాచ్‌కు ఎలాంటి రిజర్వ్ డే లేదు. వాన వల్ల ఆట సాధ్యం కాని పక్షంలో లీగ్ దశలో అత్యధిక విజయాలు/ పాయింట్లు సాధించిన జట్టు ముందంజ వేస్తుందని టోర్నీ నిబంధనలు చెబుతున్నాయి.
గ్రూప్ ‘ఎ’లో ఆడిన నాలుగు మ్యాచ్‌లు కూడా గెలిచి అజేయంగా నిలిచిన హర్మన్ సేన మొత్తం 8 పాయింట్లు సాధించింది. గ్రూప్ ‘బి’లో మూడు మ్యాచ్‌లు మాత్రమే నెగ్గిన ఇంగ్లండ్ మరో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. భారత జట్టు టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. గతంలో జరిగిన ఆరు టోర్నీల్లో మూడుసార్లు మన జట్టు సెమీఫైనల్‌కే పరిమితమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. లీగ్ దశలో ఎలాంటి ఉదాసీనతకు తావు లేకుండా ప్రతీ మ్యాచ్‌లో విజయంపై దృష్టి పెట్టడం భారత్‌కు కలిసొచ్చింది. ఈ క్రమంలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు పటిష్టమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను కూడా ఓడించి మన జట్టు తమ సత్తాను ప్రదర్శించింది.
అప్పుడు బౌండరీలు... ఇప్పుడు లీగ్ పాయింట్లు!
మెగా టోర్నీలలో ఐసీసీ నిర్వహణా వైఫల్యం
గత ఏడాది పురుషుల వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ జట్టు ‘బౌండరీ కౌంట్’ ద్వారా గెలుచుకున్నప్పుడు న్యూజిలాండ్ జట్టు గుండె బద్దలైంది. ఇదేం నిబంధన అంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై క్రికెట్ ప్రపంచం ధ్వజమెత్తింది. అయితే నిబంధనల ప్రకారమే గెలిచాం కాబట్టి మమ్మల్ని తప్పు పట్టవద్దంటూ ఇంగ్లండ్ పదే పదే చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఐసీసీ పెట్టిన ‘నో రిజర్వ్ డే’ నిబంధన అదే ఇంగ్లండ్ మహిళల జట్టు కొంప ముంచింది. టి20 ప్రపంచకప్‌లోనే కాకుండా ఓవరాల్‌గా కూడా భారత్‌పై ఉన్న ఘనమైన రికార్డు, తాజా ఫామ్‌ను బట్టి ఈ మ్యాచ్‌లో గెలవగలమని భావించిన ఇంగ్లండ్‌కు నిరాశ తప్పలేదు. ఈ నిష్క్రమణ అనంతరం టీమ్ కెప్టెన్ హెథర్ నైట్‌తో సహా మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, స్టువర్ట్ బ్రాడ్‌లు రిజర్వ్ డే లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. రెండు సందర్భాల్లోనూ ఐసీసీ పనితీరుపైనే సందేహాలు రేకెత్తాయి.
మన వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పినట్లు సగటు భారత అభిమానిగా భారత్ ఫైనల్ చేరడం సంతోషం కలిగిస్తున్నా... ఇలా ఆడకుండా ముందుకు వెళ్లడం మాత్రం నిరాశపర్చే అంశం. అసలు టి20 ప్రపంచ కప్ అంటే తక్కువ వ్యవధిలో ముగిసిపోవాలి కాబట్టి రెండు సెమీస్‌లకు రిజర్వ్ డే అంటే కష్టం అంటూ ఐసీసీ ఇచ్చిన వివరణే హాస్యాస్పదం. ప్రపంచకప్‌లాంటి టోర్నీ రెండు రోజులు పెరిగినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే టోర్నీకి ముందు నిబంధనల గురించి కెప్టెన్ల అంగీకారం తీసుకునే విషయంలోనే అసలు సమస్య ఉంది. మనం ఫోన్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడో, ఏదైనా వెబ్‌సైట్‌లు వీక్షించేందుకు ప్రయత్నించినప్పుడు పైనుంచి కింది వరకు సుదీర్ఘ నిబంధనలు ఉంటే అవేవీ చదవకుండా చివర్లో ‘ఐ అగ్రీ’ అంటూ ఓకే చేయడం అందరికీ అనుభవమే! వరల్డ్ కప్ విషయంలోనూ అలాగే జరిగినట్లు అనిపించింది. వివరాలు ఏమీ తెలియకుండా, ప్రశ్నలు అడగకుండా కెప్టెన్లు సంతకం చేసేశారు.
ఇప్పుడు రిజర్వ్ డే గురించి అడిగితే ఇది చూపించి నిబంధనల్లో లేదని, అందరూ అంగీకరించారని చెబుతూ ఐసీసీ తప్పించుకుంది. మరో మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ మాత్రం ఇది అందరికీ ఒక పాఠం కావాలంటూ సూచన చేశాడు. ‘ఇకపై ఏదైనా టోర్నీ ప్రారంభానికి ముందు నిబంధనలు పూర్తిగా చదువుకోవాలని ఆటగాళ్లు, క్రికెట్ బోర్డులకు తెలియాలి. అయితే నిజాయితీగా చెప్పాలంటే అదృష్టాన్ని నమ్ముకోకుండా మెగా టోర్నీలో మీ రాతను మీరే రాసుకోమని కూడా ఇది నేర్పించింది. నాకౌట్ మ్యాచ్‌లకే కాదు... టోర్నీ ఆరంభంలోనూ బాగా ఆడాల్సిన అవసరం ఉందని అర్థమైంది. ఇది చూపించి ముందంజ వేసిన భారత్‌కు అభినందనలు’ అని బిషప్ వ్యాఖ్యానించాడు. వర్షం వెంటాడినా సరే... అదృష్టవశాత్తూ కుదించిన మ్యాచ్‌తోనైనా సరే ఆతిథ్య ఆస్ట్రేలియా ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్ కూడా రద్దయి ఉంటే ఇంగ్లండ్‌లాగే ఆసీస్ కూడా నిష్క్రమించాల్సి వచ్చేది.
వేరే జట్ల సంగతి తెలీదుకానీ మాకైతే వర్షం నిబంధనలపై అవగాహన ఉంది. ఏదైనా కారణంగా సెమీస్ జరగకపోతే లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ వెళుతుందని తెలుసు. అందుకే ఆరంభం నుంచి కూడా ప్రతీ మ్యాచ్‌లో గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగాం. మేం ఫైనల్ చేరడంలో జట్టు సభ్యులందరి పాత్ర ఉంది. సెమీస్ మ్యాచ్ జరగకపోవడం దురదృష్టకరం. అయితే నిబంధనలు అలాగే ఉన్నాయి. మేమేమీ చేయలేం. మున్ముందు రిజర్వ్ డే ఉంచాలనే ఆలోచన మంచిదే. ‘తొలిసారి ఫైనల్’ అనే అనుభూతి గొప్పగా ఉంది. మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం. సెమీస్ చూసేందుకు అమ్మా, నాన్న రావడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. వారు నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడగా ఎప్పుడూ చూడలేదు. వారు ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌కు హాజరవుతారు. నా తల్లిదండ్రులే కాదు భారత్‌లో ఎంతో మంది మా విజయాన్ని కోరుకుంటున్నారు. మేం గెలిస్తే అది నిజంగా గొప్ప ఘనత అవుతుంది. –హర్మన్‌ప్రీత్ కౌర్, భారత కెప్టెన్ (ఫైనల్ జరిగే మార్చి 8 హర్మన్ 31వ పుట్టిన రోజు కూడా)
హర్మన్ దగ్గర భవిష్యత్తు గురించి చెప్పే మాయా అద్దం ఏదైనా ఉందేమో నాకు తెలీదు. వచ్చే టోర్నమెంట్‌కు ముందు ఆమె దగ్గర నేను తీసుకుంటా. ఎవరూ సెమీస్‌లో వర్షం పడుతుందని ఊహించరు. అలాంటి అరుదైన సందర్భం కోసం ఎవరూ ప్రణాళికలు రూపొందించుకోరు. రిజర్వ్ డే గురించి అసలు చర్చ జరగనే లేదు. ముందుగా సెమీస్‌కు అర్హత సాధించాలని, అక్కడ గెలిచి ఫైనల్ చేరాలని మాత్రమే అనుకున్నాం. ప్రతీ మ్యాచ్ గెలవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. ఈ తరహాలో నిష్క్రమించడం, వరల్డ్ కప్ ముగించడం అసహనం కలిగిస్తోంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి మాకు నష్టం కలిగించింది. గత మూడు మ్యాచ్‌లలో బాగా ఆడాక సెమీస్ కోసం ఉత్సాహంగా ఎదురు చూశాం. చివరకు ఇలా జరిగింది. – హెథర్ నైట్, ఇంగ్లండ్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment