
రెండో వన్డే కూడా భారత్‌దే..
► హ్యాట్రిక్ సాధించిన కుల్దీప్
►పోరాడిన స్టోయినీస్, స్మిత్
సాక్షి, కోల్‌కతా: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. చైనామన్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్‌తో విజృంభించడంతో ఆస్ట్రేలియా 43.1 ఓవర్లలో 202 పరుగులకే చాప చుట్టేసింది. 253 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్(1), కార్ట్‌రైట్(1)లు తీవ్రంగా నిరాశపరిచారు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్, ట్రావిస్ హెడ్‌లు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. హెడ్ ఇచ్చిన సునాయసమైన క్యాచ్‌ను రోహిత్ శర్మ నేలపాలు చేశాడు. క్రీజులో నిలదొక్కుకుంటున్న ఈ జంటను చాహల్ అద్బుత బంతితో హెడ్(39)ను అవుట్ చేసి విడగొట్టాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్ కుల్దీప్ బౌలింగ్‌లో వరుస రెండు సిక్సులతో దాటిగా ఆడుతూ స్మిత్‌కు అండగా నిలిచే ప్రయత్నం చేశాడు. కానీ చాహల్ మరో అద్బుత బంతికి మాక్స్‌వెల్(14) స్టంప్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ దశలో స్మిత్ 65 బంతుల్లో కెరీర్‌లో 18వ అర్ధసెంచరీ నమోదు చేశాడు. అనంతరం (59) పాండ్యా బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుటవ్వడంతో ఆసీస్ వికెట్ల పతనం మెదలైంది. ఆవెంటనే క్రీజులోకి వచ్చిన వేడ్(2), అగర్(0), కమిన్స్(0)లను అవుట్ చేసి కుల్దీప్ హ్యాట్రిక్ సాధించాడు.
చివర్లో స్టోయినీస్ 62 నాటౌట్(65 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు) ఒంటరి పొరాటం చేశాడు. ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం అందకపోవడంతో స్టోయినీస్ పొరాటం వృధా అయింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్‌లకు మూడేసి వికెట్లు దక్కగా, చాహల్, పాండ్యాలకు రెండు వికెట్లు దక్కాయి. అంతకు ముందు భారత్ 252 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ కోహ్లి(92),రహానే(55) లు రాణించారు. మ్యాన్‌ఆఫ్ ది మ్యాచ్ కోహ్లిని వరించింది.