
భారత్ ‘ఎ’ ఘనవిజయం
దక్షిణాఫ్రికా ‘ఎ’తో నాలుగు రోజుల మ్యాచ్
పోష్‌స్ట్రూమ్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. చివరి రోజు మంగళవారం ఆటలో అంకిత్ రాజ్‌పుత్ (3/15), షాబాజ్ నదీమ్ (3/47) తమ బౌలింగ్‌తో బెంబేలెత్తించగా ఆతిథ్య జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 65.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. వీరి ధాటికి 138/4 ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ప్రొటీస్ కేవలం 39 పరుగులకే మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది.
దీంతో ఆ జట్టుకు 223 పరుగుల ఆధిక్యం లభించింది. స్టీఫెన్ కుక్ (196 బంతుల్లో 70 నాటౌట్; 10 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. గౌతమ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం 224 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 62.3 ఓవర్లలో 4 వికెట్లకు 226 పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. కెప్టెన్ కరుణ్ నాయర్ (144 బంతుల్లో 90; 13 ఫోర్లు), ఓపెనర్ సమర్థ్ (90 బంతుల్లో 55; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌తో రాణించారు.