‘ఎక్కడైనా’ ఆడగలడు
♦ ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌కు సిద్ధం
♦ ఏ దేశంలో అయినా నిలకడగా పరుగులు
♦ భారత క్రికెట్ భవిష్యత్తు అజింక్య రహానే
సాక్షి క్రీడావిభాగం : రెండో టెస్టులో అనూహ్యంగా మూడో స్థానంలో రహానేను బరిలోకి దించినపుడు అంతా అతనిపై జాలి పడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో అతను విఫలం అయ్యాక గవాస్కర్‌లాంటి దిగ్గజమే ‘బలి చేశారు’ అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. కానీ రహానే ఇలాంటివేమీ పట్టించుకోలేదు. తన కర్తవ్యం మాత్రం సమర్థంగా నిర్వర్తించాడు. ముంబై తరఫున రంజీ ట్రోఫీలో మూడో స్థానం లో ఆడిన మ్యాచ్‌లను గుర్తు చేసుకున్నాడు. అదే స్ఫూర్తితో రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగి శతకం సాధించాడు. సవాల్‌ను స్వీకరించడం 27 ఏళ్ల ‘జింక్స్’కు కొత్తేం కాదు. టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పుడు తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో ఎన్నడూ ఆడని ఆరో స్థానంలో పంపిస్తే అక్కడా సత్తా చాటాడే కానీ తనకు సాధ్యం కాదని చేతులెత్తేయలేదు. 17 టెస్టుల్లో ఇప్పటికే నాలుగు స్థానాల్లో ఆడేశాడు. అన్ని చోట్లా కనీసం 40పైనే అతని బ్యాటింగ్ సగటు ఉంది.
నిరాడంబరుడు
ముంబైనుంచి వచ్చినా చాలా మంది అక్కడి క్రికెటర్లలో కనిపించే ‘మెరుపు’ అతని ప్రవర్తనలో కనిపించదు. సాదాసీదా వ్యక్తిత్వం, నిరాడంబరత, సాధారణ మధ్యతరగతి మనస్తత్వం. టెస్టు ఆడేటప్పుడు అతను పాతతరం ఆటగాడిగా అనిపిస్తాడు. ఫుల్ స్లీవ్స్‌ను మోచేతుల వరకు మడిచి ఫీల్డింగ్ చేస్తుంటే 60వ దశకం ఆటగాడిని గుర్తుకు తెస్తాడు. ఒంటి నిండా టాటూలతో మోడ్రన్‌గా కనిపించే తరంలో ఉన్నా తాను దానికి దూరం. అయితే అంత మాత్రాన అతని ఆట సంప్రదాయం కాదు.
రహానే దూకుడు, ఆధునికత్వం అంతా ఆడే షాట్లలో కనిపిస్తుంది. కొలంబో టెస్టులో పరిస్థితికి తగినట్లుగా ముందు నిలదొక్కుకొని, ఆ తర్వాత అజింక్య చూడచక్కని బ్యాటింగ్‌తో అలరించాడు. టెస్టు క్రికెట్‌లో కూడా వినోదం అందించవచ్చనేది ఈ ఇన్నింగ్స్‌తో రహానే చూపించాడు. ‘ఇన్ని స్థానాల్లో బాగా ఆడావు కదా, అయినా నీకిష్టమైన స్థానం ఏమిటి’ అని మీడియా ప్రశ్నిస్తే... మీరే చెప్పారు కదా అన్ని చోట్లా బాగా ఆడానని, ఇక ప్రశ్నే లేదు అంటూ బదులివ్వడం అతని ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది.
దూకుడుగానూ ఆడతాడు
రహానే బ్యాటింగ్‌లో కొత్త రూపం గత డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో కనిపించింది. నెమ్మదిగా ఆడే సంప్రదాయవాది మాత్రమే కాదు, అవసరమైతే ఏ గేర్‌లోనైనా బండిని పరుగెత్తించగలనని అతను నిరూపించాడు. దూకుడుకు మారుపేరైన కోహ్లి ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసేందుకు 166 బంతులు తీసుకుంటే, రహానేకు మాత్రం 127 బాల్స్ సరిపోయాయి. ప్రతీ ఆసీస్ బౌలర్‌పై చెలరేగి అతను 21 బౌండరీలు బాదాడు. ఐపీఎల్‌లో ధాటిగా ఆడటంతో పాటు 58 బంతుల్లోనే సెంచరీ చేసిన రికార్డు ఉన్న రహానే... టెస్టు క్రికెట్‌లోనూ పరిస్థితిని బట్టి మారగలడని మెల్‌బోర్న్ ఇన్నింగ్స్ నిరూపించింది. అంతకు ముందు డర్బన్ టెస్టులో స్టెయిన్‌ను వరుస పెట్టి బాదిన బౌండరీలు అజింక్య ఆటతీరుకు ఉదాహరణ.
ద్రవిడ్ మార్గదర్శనంలో...
ముంబై క్రికెటర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తర్వాతే రాహుల్ ద్రవిడ్‌తో రహానే సాంగత్యం కుదిరింది. అయితే ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్ సభ్యుడిగా, మెంటార్‌గా ద్రవిడ్ చేసిన మార్గదర్శనం అతని కెరీర్‌పై చాలా ప్రభావం చూపించిందని రహానే స్వయంగా చెప్పుకున్నాడు. అటు బ్యాటింగ్ మెరుగు కావడంతో పాటు కఠిన పరిస్థితుల్లో ఆడటంలాంటివి అతనినుంచి రహానే స్ఫూర్తి పొందాడు. వెల్లింగ్టన్‌లో సాధించిన తొలి సెంచరీని అతను తన రోల్ మోడల్ ద్రవిడ్‌కే అంకితమివ్వడం విశేషం. రహానే ఆటతీరు, శైలి, వ్యక్తిత్వం ద్రవిడ్‌ను గుర్తుకు తెస్తుండగా... ఇప్పుడు మూడో స్థానంలో ఆడిన బ్యాటింగ్‌తో ‘వాల్’ పోలికలు కనిపించాయి. ఎనిమిది క్యాచ్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించిన రహానే స్లిప్ ఫీల్డర్‌గా కూడా ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసినట్లున్నాడు.
కెప్టెన్‌గానూ అవకాశం...
రెండో టెస్టులో కోహ్లి గాయంతో బయటికి వెళ్లినప్పుడు విజయ్ తర్వాత కొద్ది సేపు రహానే కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అదే సమయంలో మ్యాథ్యూస్ వికెట్ పడింది. ఇది తనకు చాలా సంతృప్తినిచ్చిందని రహానే నేరుగా చెప్పాడు. ఆటతీరు మెరుగు పడిన కొద్దీ అతనిలోని నాయకత్వ లక్షణాలు కూడా బయట పడుతున్నాయి. గతంలో ముంబై తరఫున ఒక ఫస్ట్ క్లాస్, ఒక టి20 కెప్టెన్‌గా విఫలమైన రహానే...ఇటీవల జింబాబ్వేతో కెప్టెన్‌గా మూడు వన్డేల్లో విజయాన్ని అందించాడు. ఇప్పటికిప్పుడు అతని నాయకత్వ బాధ్యతలు దక్కే అవకాశం లేకపోయినా, జట్టు వ్యూహాల్లో అతను చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. అన్ని చోట్లా డిపెండబుల్ బ్యాట్స్‌మన్‌గా మారిన రహానేకు విదేశీ టూర్లలో వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశం కూడా ఉంది.
కాపాడుకోవాలి...
మూడో స్థానంలో అద్భుతంగా ఆడిన రహానే అక్కడే కొనసాగుతాడా లేక కోహ్లి కొత్త వ్యూహాల్లో భా గంగా మళ్లీ స్థానం మారతాడా అనేది ఆసక్తికరం. సాధారణంగా అగ్రశ్రేణి ఆటగాళ్లను ఒక స్థానానికి పరిమితం చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయనేది చరిత్ర చెప్పిన సత్యం. అన్ని చోట్లా బాగా ఆడగలగడం మంచిదే. కానీ ఎక్కడో ఒక చోట ‘మాస్టర్’ కావాల్సిందే. గతంలో తాను ఓపెనింగ్ స్థానంనుంచి దిగువకు ఆడనని గట్టిగా చెప్పిన సచిన్ ఉన్నాడు...కెరీర్‌లో ఒకే ఒక సారి నాలుగో స్థానంలో ఆడి తన అత్యధిక స్కోరు (236) చేసినా...మళ్లీ పట్టుబట్టి ఓపెనింగ్‌కు వెళ్లిపోయిన గవాస్కర్ ఉదంతం కూడా మనకు ఉంది. రహానేను కూడా వేర్వేరు స్థానాలతో ఇబ్బంది పెట్టకుండా కాపాడుకుంటేనే భారత్‌ను మేలు జరుగుతుంది.
రహానే ప్రపంచంలోని అన్ని వేదికల్లో సత్తా చాటాడు. అతని ఆరు అత్యధిక స్కోర్లు వేర్వేరు మైదానాల్లో ఉండటం విశేషం.
1. 147 ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్
2. 126 శ్రీలంకపై కొలంబో
3. 118 న్యూజిలాండ్‌పై వెల్లింగ్టన్
4. 103 ఇంగ్లండ్‌పై లార్డ్స్
5. 98 బంగ్లాదేశ్‌పై ఫతుల్లా
6. 96 దక్షిణాఫ్రికాపై డర్బన్