14 ఏళ్లకే భారత సీనియర్ జట్టులోకి
మీరట్ షూటర్ శపథ్ ఘనత
పాటియాలా: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఉత్తరప్రదేశ్ యువ షూటర్ శపథ్ భరద్వాజ్ 14 ఏళ్లకే భారత సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చే ఏడాది న్యూఢిల్లీ, మెక్సికో, సైప్రస్‌లలో జరిగే షూటింగ్ ప్రపంచకప్‌లలో పాల్గొనే భారత ‘డబుల్ ట్రాప్’ జట్టు ఎంపిక కోసం సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్‌లో శపథ్ విశేషంగా రాణించి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తొలి రౌండ్‌లో శపథ్ 150 పాయింట్లకు 122 పాయింట్లు... రెండో రౌండ్‌లో 150 పాయింట్లకు 136 పాయింట్లు స్కోరు చేశాడు.
అంకుర్ మిట్టల్ తొలి స్థానంలో, సంగ్రామ్ దహియా మూడో స్థానంలో నిలిచి శపథ్‌తో కలిసి జాతీయ జట్టులోకి ఎంపికయ్యారు. మీరట్‌లో తొమ్మిదో తరగతి చదువుతోన్న శపథ్ ఇటీవలే జైపూర్‌లో జరిగిన జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ‘డబుల్ ట్రాప్’ జూనియర్ విభాగంలో రజతం, సీనియర్ విభాగంలో కాంస్యం సాధించాడు. గత జులైలో ఇటలీలో జరిగిన అంతర్జాతీయ గ్రాండ్‌ప్రి టోర్నీలో శపథ్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో స్వర్ణాలు గెలిచాడు.