జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్‌లో తొలి రోజు భారత షూటర్లు అదరగొట్టారు. నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఆరు పతకాలు గెల్చుకున్నారు. అంతేకాకుండా రెండు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు కూడా ఖరారయ్యాయి. తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు సొంతం చేసుకుంది.
ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ భారత్‌కు ఒలింపిక్ బెర్త్ అందించింది. ఎనిమిది మంది షూటర్లు ఎలిమినేషన్ పద్ధతిలో పోటీపడ్డ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఇషా సింగ్ 243.1 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. తలత్ కిష్మలా (పాకిస్తాన్; 236.3 పాయింట్లు) రజతం, భారత్‌కే చెందిన రిథమ్ సాంగ్వాన్ (214.5 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకున్నారు. భారత్‌కే చెందిన మరోషూటర్ సురభి రావు 154 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది.
అంతకుముందు క్వాలిఫయింగ్‌లో రిథమ్, సురభి రావు 579 పాయింట్లతో వరుసగా మూడు, ఐదు స్థానాల్లో నిలువగా... ఇషా సింగ్ 578 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్‌లో రిథమ్, సురభి, ఇషా సింగ్ సాధించిన స్కోరు ఆధారంగా భారత జట్టుకు టీమ్ విభాగంలో బంగారు పతకం లభించింది. భారత బృందం మొత్తం 1736 పాయింట్లు స్కోరు చేసింది.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ వరుణ్ తోమర్ స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు భారత్‌కు పారిస్ ఒలింపిక్ బెర్త్‌ను ఖరారు చేశాడు. ఇదే ఈవెంట్‌లో మరో భారత షూటర్ అర్జున్ సింగ్ చీమా రజత పతకం నెగ్గాడు.
ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో వరుణ్ 239.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలువగా... అర్జున్ 237.3 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. వరుణ్, అర్జున్ సింగ్, ఉజ్వల్ మలిక్‌లతో కూడిన భారత బృందం 1740 పాయింట్లతో టీమ్ విభాగంలో పసిడి పతకాన్ని గెల్చుకుంది. ఇప్పటి వరకు భారత్ నుంచి 15 మంది షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ నుంచి 15 మంది షూటర్లు బరిలోకి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment